అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో కేరళ
సీఎం పినరయి విజయన్ నాయకత్వంలో ఈ ఘనత
ఇందుకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు
‘అబద్దాల ఫ్యాక్టరీ’ నడిపేది యూడీఎఫ్, బీజేపీ-ఆరెస్సెస్
రాజకీయాల్లో మతాన్ని వాడొద్దు
కేరళ ప్రజలు ఎల్‌డీఎఫ్‌ను మళ్లీ గెలిపిస్తారు
బీజేపీకి ఓటు వేస్తే నిరుపయోగమని గమనించారు : సీపీఐ(ఎం) నాయకురాలు బృందాకరత్
హైదరాబాద్ : కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇందుకు కొన్ని నెలల సమయమే మిగిలి ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ఈసారి ఎన్నికల్లోనూ విజయం సాధించి మూడోసారి కూడా ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది. ప్రజా సంక్షేమం కోసం తాము తీసుకొచ్చిన పథకాలు, చేసిన అభివృద్ధి, జనరంజక పాలన ప్రజల మద్దతుకు బాటలు వేస్తాయని వెల్లడిస్తున్నది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఈ సారి తాము కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధిస్తామని చెప్తున్నది.
ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌లు రెండూ తమను తాము ఒక బలమైన లౌకిక శక్తులుగా ప్రదర్శించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) హిందుత్వ తరహా మత రాజకీయాలు చేస్తోందన్న కథనాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే ఈ ఆరోపణలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఆరోపణలు యూడీఎఫ్, బీజేపీ-ఆరెస్సెస్ అబద్దాల తయారీ కర్మాగారం నుంచి వస్తున్నాయని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, ఆ పార్టీ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ తెలిపారు.ఈనెల 26న హైదరాబాద్‌లో జరిగిన ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) నాలుగో జాతీయ మహాసభ సందర్భంగా ఆమెతో ప్రముఖ ఆంగ్లవార్తా సంస్థ మాట్లాడింది.
సీపీఐ(ఎం) కమ్యూనల్ రాజకీయాలు చేస్తోందన్న ఆరోపణలపై ఆమె స్పందించారు. ఈ ఆరోపణలు ఒక అబద్దాల తయారీ కర్మాగారం నుంచి వస్తున్నాయనీ, పగటి పూట యూడీఎఫ్, రాత్రి పూట బీజేపీ-ఆరెస్సెస్‌లు ఈ కర్మాగారాన్ని నడుపుతున్నాయని ఆమె అన్నారు. కేరళలో గానీ, దేశంలో ఎక్కడైనా కానీ సీపీఐ(ఎం) ఒక లౌకిక శక్తి అని నిరూపించుకోవడానికి ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టం చేశారు. ”ఇది పూర్తిగా నిరాశ నుంచి వచ్చిన అపవాదు. భారత రాజ్యాంగంపై హిందూత్వ రాజకీయాల దాడే దేశానికి ప్రధాన ప్రమాదమని మేము భావిస్తున్నాం. దానిని ఎదుర్కొం టూనే.. ఏ మతానికి చెందిన ఫండమెంటలి జంతోనూ మేము రాజీపడబోం. మేము ఏ కమ్యూనిటికీ వ్యతిరేకం కాదు. రాజకీయాల్లో మతాన్ని ఉపయోగించడాన్నే మేము వ్యతిరేకిస్తున్నాం” అని ఆమె అన్నారు.
సీపీఐ(ఎం) ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?
ఎన్నికల ప్రచారానికి సీఎం పినరయి విజయన్ నేతృత్వం వహించాలని నిర్ణయించబడింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వపు వాస్తవిక నిర్బంధంతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ.. ఆయన నాయకత్వంలోనే కేరళ దేశంలోనే అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచింది. కేరళ భారతదేశానికి లౌకికవాదం, ప్రజాస్వామ్యం విషయంలో ప్రతీకగా నిలిచింది. బీజేపీ, యూడీఎఫ్ అనుసరిస్తున్న రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఈ ఎన్నికల్లో పోరాడుతుంది.
కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి ఎల్‌డీఎఫ్ రికార్డు సృష్టించింది. మరో ఐదేండ్లు పరిపాలించాలని కేరళ ప్రజలు ఎల్‌డీఎఫ్‌కు అవకాశం ఇస్తారా?
ఈ నిర్ణయం పూర్తిగా ఓటర్ల చేతిలోనే ఉంది. జాతీయ సవాళ్లు, ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధి కోసం రాజీపడకుండా లెఫ్ట్ నిరంతరం చేసిన పోరాటాన్ని గమనించిన కేరళ ప్రజలు.. మళ్లీ ఎల్‌డీఎఫ్‌పై విశ్వాసం ఉంచుతారన్న నమ్మకం మాకు ఉంది.
కేరళలోని వామపక్షాలకు మాత్రమే కాకుండా.. దేశంలోని వామపక్ష శక్తులకు కూడా ఈ విజయం చాలా కీలకమని మీరు భావించడం లేదా? ఎందుకంటే దేశంలో వారు అధికారం లో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే కదా.
కేరళ మాత్రమే లెఫ్ట్ పాలనలో ఉన్న రాష్ట్రం కాబట్టి దానిని ప్రత్యేకంగా చూడం. కేరళ అబివృద్ధి కోసం ఎల్‌డీఎఫ్ ముఖ్యం. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ పునరుజ్జీవం కూడా అక్కడి ప్రజలకు అవసరం. కాబట్టి ఆ విషయాలను మేము విడివిడిగా చూడం.
ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ విధాన ప్రసంగంలోని కొన్ని భాగాలను కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మార్చిన వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి?
ఈ రోజుల్లో గవర్నర్లు రాజ్యాంగ రాయబారులుగా కాకుండా.. ఢిల్లీలోని పాలక ప్రభుత్వ సంకుచిత ప్రయోజనాలకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. దీనితో భారతదేశ సమాఖ్య స్వరూపం బలహీనపడుతోంది. కాగా హైదరాబాద్‌లో జరిగిన జాతీయ మహాసభలో.. మహిళలు, ఇతర బలహీన వర్గాల సంక్షేమం కోసం కేరళలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రశంసిస్తూ ఐద్వా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ తీవ్రమైన ఆర్థిక పరిమితుల నడుమ కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేసిందని ఆ తీర్మానం పేర్కొన్నది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేరళ జెండర్ బడ్జెట్ రూ.4840.12 కోట్లకు గణనీయంగా పెరిగిందనీ, ఇది మొత్తం ప్రణాళిక వ్యయంలో 20 శాతం కంటే ఎక్కువగా ఉన్నదని వివరించింది.
ఇతర రాష్ట్రాల్లో వరుస ఓటముల తర్వాత కేరళలో మళ్లీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ తీవ్ర నిరాశలో ఉందని మీరు భావించడం లేదా? యూడీఎఫ్ గత పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉంది. మరో ఐదేండ్లు వేచి చూడాల్సి వస్తే ఆ కూటమి పూర్తిగా బలహీనపడే పరిస్థితి రావచ్చని అనిపించడం లేదా?
అవును, కేరళలో ఆ నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ దురదృష్టవశాత్తు ఆ నిరాశ అంతగా పెరిగింది కాబట్టే అది బీజేపీతో రహస్యంగా, తెర వెనుక ఒప్పందాలకు దారి తీస్తోంది. ఇది ప్రతి ఓటరూ గమనించాల్సిన విషయం. దీనికి ఉదాహరణ కేరళలోని తిరువనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నిక. ఆ ఎన్నికలో కాంగ్రెస్ నష్టపోయి బీజేపీ గెలిచింది. మతత్వ శక్తులతో పోరాడాలనే ప్రాథమిక సూత్రాన్ని కాంగ్రెస్ ఉల్లంఘించింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా హౌల్‌సేల్‌గా బీజేపీలో చేరారు. అలాంటి పార్టీలపై ప్రజలు ఆధారపడలేరు. బీజేపీ అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో చేరరనే హామీ ఏమీ లేదు.
ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో బీజేపీకి ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోయినా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆ పార్టీ ఎదురుచూస్తోందా?
బీజేపీ గ్రాఫ్‌ను పరిశీలిస్తే అందులో ఎలాంటి పెరుగుదలా కనిపించడం లేదు. బీజేపీకి ఓటు వేయడం వల్ల ప్రయోజనం లేదని ప్రజలు గ్రహించారు. అసలు ముఖ్యమైన విషయం బీజేపీ ఖజానానే. కార్పొరేటు ట్రస్టులు ఇచ్చిన డబ్బుతో అది విపరీతంగా పెరిగిపోయింది. తాజా గణాంకాల ప్రకారం ఒక్క ఏడాదిలోనే ఆ పార్టీకి రూ.3300 కోట్లు వచ్చాయి. భారత్ కార్పొరేట్ ఆధారిత ప్రజాస్వామ్యంగా మారితే.. అది దేశానికి ఆందోళనకరమైన విషయం.
కేరళలో లోక్‌సభ, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి వీచింది. ఇది పునరావృతం అవుతుందని భావిస్తున్నారా?
కేరళను పరిశీలిస్తే, ప్రజలు వేర్వేరు స్థాయిల్లో జరిగే ఎన్నికల్లో వేర్వేరు విధంగా ఓటు వేసినట్టు కనిపిస్తుంది. గ్రామ పంచాయతీల్లో మేము ఓడిపోయినా.. జిల్లా పరిషత్తులో గెలిచాం. సాధారణంగా పరిస్థితి అలాగే కొనసాగుతుందనీ, ఫలితాలు మళ్లీ అదే విధంగా ఉంటాయని నమ్మడం తప్పుడు విశ్లేషణ అవుతుంది. మేము లోపాలను తొలగించగలమన్న నమ్మకం మాకు ఉంది. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ఆదర్శవంతంగా పని చేసింది. ఉదాహరణకు, సామాజిక భద్రతా పింఛన్లను నెలకు రూ.600 నుంచి రూ.2000కు పెంచింది. కేవలం హామీలు నెరవేర్చడమే కాకుండా.. వాటిని మించి ముందుకు వెళ్లే ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందుతారని నేను అనుకోవడం లేదు.



