చిత్రాడ కిషోర్ కుమార్ గారు 2014 – 22 లలో రాసిన 74 కవితలను ”నిశ్శబ్ద స్వప్నం” మనముందుంచారు. తన కవిత్వం గురించి ఇలా చెపుతారు-
”నా స్నేహం నిశ్శబ్దం కావొచ్చు కానీ/ నా అక్షరాలు స్నేహాన్ని కాంక్షించే వారికి/ వెచ్చని స్నేహపు జల్లులవుతాయి/ నా యుద్ధం నిశ్శబ్దం కావొచ్చు కానీ/ నా అక్షరాలు నిశ్శబ్దంగా యుద్ధంచేస్తూ/ ప్రపంచమంతా వ్యాపిస్తాయి ” 44,45
మాట గురించి చెపుతూనే అది మనసా వాచా కర్మణా ఆచరించాలని సూచించారిలా-
”మంచి మాట జీవిత గమ్యానికి మార్గమై/ చరిత్ర పుటల్లో కీర్తి పతాకాన్ని ఎగురవేసి/ మనీషిని చేస్తుంది.
మాటంటే మన మనస్సాక్షి/ మాటంటే మనసా వాచా కర్మణా ” 26
అంతటితో సరిపుచ్చుకొనకుండా మన మాటలను అక్షరాలలో కాకుండా, స్పర్శతో కూడా వ్యక్తీకరించవచ్చని అంటారు-
”స్పర్శ/ నిస్పహకు లోనైనప్పుడు/ నమ్మకాన్ని కలిగిస్తూ/ ఆత్మ విశ్వాసాన్ని నింపేది/ స్పర్శ మాటలకందని మనో భాష/ స్పర్శ భావోద్వేగమైన దేహభాష!!” 63
కిషోర్ కుమార్ కవిత్వంలో అద్దేపల్లి, సినారె, విశ్వనాథ, రావూరి భరద్వాజ లను పలుకరించారు. సినారె, అద్దేపల్లి లపై మంచి నివాళిని చెప్పారు. ఈ పుస్తకంలో రైతు, పనమ్మాయి, కూతురు, వెలయాలు, అమ్మ, అవయవదానం, చరవాణి ఇలా అనేకాంశాలపై కవిత్వం చెప్పారు.
”అమ్మ” ను జీవనదిగా అభివర్ణించారు. అమ్మ తన పిల్లల కోసం ఎంతగా భరిస్తుందో, త్యాగం చేస్తుందో ఈ కవితలో ఉటంకించారు.
”ప్రాణాన్ని ఫణంగా పెట్టి/ సష్టికి మూలమయి/ దేహాన్నిచ్చిన దేవతై/ చల్లని రాగంలా, కమ్మని కావ్యంలా/ మన రక్తంలో ప్రవహించే జీవనది!!/ జన్మజన్మలకు తీర్చలేని ఋణాను/ బంధం అమ్మ/ అనంతవిశ్వంలో అంతులేని కమనీయ/ కావ్యం అమ్మ. పుట 52
అంతర్మథనం, కూతురు శీర్షికలలో కూడా అమ్మ (తల్లి)ను గుర్తు చేసుకున్నారు.
కిషోర్ కుమార్ కవిత్వం నిర్మలంగా, సామాజిక చేతనతో మదుమధురంగా, సరళమైన భావాలతో, భాషతో, భావోద్వేగాలతో సాగుతుంది. కిషోర్ గారు ముందుముందు మరింత కవిత్వం అందిస్తారని ఆశిద్దాం. అభినందనలు.
– టి.శ్రీరంగస్వామి, 9949857955
నిశ్శబ్ద స్వప్నం
- Advertisement -
- Advertisement -