తనికెళ్ల మైనారిటీ కళాశాలలో ఘటన
బాధిత విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
నవతెలంగాణ-కొణిజర్ల
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం పంచాయతీ పరిధిలో గల మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు దాడికి పాల్పడ్డారు. గురుకులంలో కల్లూరుకి చెందిన చింతలపూడి నాగచైతన్య, కొణిజర్ల మండలం అమ్మపాలెంకి చెందిన జమీల్ అక్తర్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 31న జూనియర్లు, సీనియర్లు డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు ఉపాధ్యాయులు అనుమతి ఇచ్చారు. ఈ డ్యాన్స్ చేసే సమయంలో జూనియర్, సీనియర్ల మధ్య వివాదం ఏర్పడింది. మళ్లీ ఈనెల 25న రాత్రి నాగచైతన్య, జమీల్ అక్తర్‌కు.. సీనియర్ విద్యార్థులకు మధ్య వివాదం మొదలైంది. అదే సమయంలో కరెంటు పోవడంతో సీనియర్ విద్యార్థులు ఆ ఇద్దరు విద్యార్థులపై దాడి చేశారు. ఆ సమయంలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు అక్కడే ఉన్నట్టు సమాచారం.
విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించడంతో ఆ విద్యార్థులు ఎవరికీ చెప్పలేదు. అయితే, జమీల్ అక్తర్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకి చెప్పాడు. వారు కళాశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కళాశాలకు వచ్చి పూర్తి స్థాయిలో విచారణ జరిపి సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు సమాచారం. ఉపాధ్యాయులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండటంపై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారని, ఒకటి, రెండ్రోజుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేసే అవకాశం ఉందని వినికిడి. కళాశాల వద్ద బుధవారం మరోసారి నాగచైతన్య కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటనా స్థలానికి వచ్చి బాధితులతో మాట్లాడారు. లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలని సూచించడంతో నాగచైతన్య తల్లిదండ్రులు సీనియర్ విద్యార్థులపై కేసు పెట్టారు.
దాడి జరిగింది వాస్తవమే..
మైనార్టీ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.జితేష్ షాహిల్ ఈనెల 25న తమ కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసింది వాస్తమే. బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.



