పిల్లలు, పువ్వులు, పిట్టలు, పావురాలు సున్నితము, సుకుమారము పసినవ్వుల పరిమళాలకు పరవసించని హృదయముంటుందా! ”పాపం పుణ్యం, ప్రపంచమార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పూవు ల్లారా! ఐదారేడుల పాపల్లారా!” అని మహాకవి ఆలపించిన శైశవగీతికలో పాల నురగలను పల్లవిస్తాడు. పిల్లలను చూడగానే జాలి, దయ, కరుణ, ప్రేమ తప్ప మరేమీ తలపులోకి రాదు. పసిబుగ్గలు కనపడగానే ప్రేమ పూర్వక ముద్దునీయడంలో వున్న తీయదనం మరెందులో వుంటుంది. పిల్లలు దేవుడి రూపాలని చెప్పుకోవడం మనందరికీ తెలుసు. అట్లాంటి పిల్లలను శత్రువులుగా పేర్కొనే మనస్తత్వాన్ని మనుషుల్ని ఏ దుర్మార్గాలతో పోల్చవచ్చో ఇంకా వెతుక్కోవాల్సి వుంది. ఎందుకు పిల్లలు శత్రువులవుతున్నారు! ‘ ఏ ఉన్మాదం తలకెక్కిందో ఎందుకు ఈ హంగామా! అంటే అది కచ్చితంగా యుద్ధోన్మాదమే. సామ్రాజ్యవాదపు యుద్ధోన్మాదం మనుషులను రాక్షసుల కన్నా దుర్మార్గంగా తయారు చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ.
ఇజ్రాయిల్ పార్లమెంటు మాజీ సభ్యుడు మోషే ఫైగ్లిన్ ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మా శుత్రువు హమాస్ కాదు. హమాస్ మిలటరీ వింగ్ కూడా కాదు, గాజాలో ప్రతి చిన్నారే మాకు శత్రువు. గాజాను మేము పూర్తిగా ఆక్రమించి అక్కడ స్థిరపడాలి. అక్కడ ఒక్క గాజా చిన్నారి కూడా మిగలకూడదు. దీనికంటే మరో విజయం లేదు’ అని మాట్లాడిన మాటలు ప్రపంచ మానవ హృదయాలకు దిగ్భ్రాంతి కలిగించాయి. యుద్ధోన్మాది రాక్షస మనస్తత్వం ఎంత దారుణంగా ఉంటుదో ఫైగ్లిన్ రూపంలో దర్శనమిచ్చింది. ఉగ్రవాదులు సైతం పిల్లల్ని, మహిళల్ని వొదిలేసారే! కానీ ఈ దుష్టత్వం పిల్లలపైనే గురి పెట్టింది. గాజాలో చిన్నారులు మిగలకూడదని ప్రకటించడం ఎంతటి అమానుషత్వం! ఇజ్రాయిల్ పాలస్తీనాపై చేస్తున్న దాడులు రెండేండ్ల నుండి కొనసాగూనే ఉన్నాయి. ప్రపంచమంతా చూస్తూనే ఉంది. హమాస్ దాడి చేసిందనే నెపంతో ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాన్నే లేకు ండా చేయాలని దాడులు చేస్తూ మానవ హననానికి పాల్పడుతోంది. పాలస్తీనాలోని గాజాలో ఎక్కడచూసినా శిథిల దృశ్యాలే కనపడతాయి.
యుద్ధానికి కూడా ఒక నీతి, న్యాయం ఉంటుంది.ఇది యుద్ధం కాదు. యుద్ధమంటే ఇరుపక్షాలూ తలపడాలి. ఇక్కడ ఏకపక్షంగా దాడి జరుగుతూనే ఉంది. అంతర్జాతీయ సంస్థలు, దేశాలు ఈ దాడిని ఆపాలని చేసిన ప్రయ త్నానికి ఇజ్రాయిల్ స్పందించడమే లేదు. ఫైగ్లిన్ మాటలు అతని వ్యక్తిగతమైనవేమీ కాదు. ఇజ్రాయిల్ ఆలోచనలే ఆయన వెల్లడించాడు. ప్రపంచమంతా చూస్తుండగానే అంతటి అమా నవీయంగా మాట్లాడటం ఎంతో నేరపూరిత మైనది. తమ దేశంలోనే గాజా ప్రజలు పరాయిగా బతుకుతున్నట్లు ప్రతిక్షణం భయ కంపితుల వుతున్నారు. ఎక్కడ యుద్ధం వచ్చినా బలయ్యేది పిల్లలు, స్త్రీలే. గాజా నేలపై కూడా చివురుల్లాంటి పిల్లలు బాంబుల దాడుల్లో రక్తం చింది స్తున్నారు. పిట్టల్లా రాలి పడుతున్నారు. ”అస్థిమూల పంజ రాలు, ఆర్తరావమందిరాలు, ఏ దేశం తల్లీ! ఇది ఎన్నో ఇట భాష్పజలాలు” అని యుద్ధ బీభత్సాన్ని కవి వర్ణించిన విధంగానే గాజా రోధిస్తున్నది. గతవారం లోనే గాజాపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో నూట నలభై మంది చనిపోవడం, ఆహారం దొరక్క ఆకలితోనూ మరణిస్తుండటం మనసును కలచివేస్తున్నది.
ఇది కేవలం ఇజ్రాయిల్ దుర్మార్గమే కాదు, ఇజ్రాయిల్‌కు, దాని పాలకుడు నెతన్యాహుకు పూర్తి మద్దతుగా నిలిచిన దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదపు సహకారంతోనే ఇంత మానవ హననం జరుగు తున్నది. ప్రపంచంలోని అనేక దేశాలు ఇంత దారుణం జరుగుతున్నా మాట్లా డకపోవడం అన్యాయం. ఎప్పటినుండో పాలస్తీనాకు మనకు స్నేహ సంబం ధాలు ఉండేవి. కానీ అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామిగా మారాక భారత దేశం కూడా ఇజ్రాయిల్ పక్షం వహించడం, ఈ మారణకాండనూ ఖండించక పోవడం అమానవీయతే అనిపించుకుంటుంది. ఇక్కడి మతో న్మాద ఆలోచనలకు యుద్ధోన్మాద ఆలోచనలకు సఖ్యత ఏర్పడుతోంది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ప్రపంచశాంతిని, స్వేచ్ఛను కోరుకునే వాళ్లందరూ ఇజ్రాయిల్ దమనకాండను ఖండించాలి. పసిపిల్లలను కసితో చంపుతున్న హంతక చర్యలను వ్యతిరేకించాలి. గాజాకు ఆహార పదార్థాలను సైతం రానీయకుండా, ఆసుపత్రుల్లో మందులు, వైద్య సదుపాయాలు లేకుండా హాహాకారాలు చేస్తున్న పిల్లలు, జనుల దృశ్యాలు మనుషులైన వారినందరినీ తీవ్రమనోవేదనకు బాధకు గురిచేస్తున్నది.
పసితనంపై పగ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES