నవతెలంగాణ – పరకాల
హన్మకొండ జిల్లా పరకాల మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరిష్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించిన ఆమె, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లను తనిఖీ చేసి, అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల దాఖలుకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి, ప్రతి అభ్యర్థి వివరాలు పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు, వారి వెంట వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ప్రక్రియ కొనసాగాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్, ఇతర రెవెన్యూ ఆర్డిఓ డాక్టర్ కె నారాయణ, మున్సిపల్ కమిషనర్ ఎస్ అంజయ్య, తహసిల్దార్ విజయలక్ష్మి, ఎంఈఓ సంపతి రమాదేవి, ఎన్నికల విభాగం అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. నామినేషన్ల స్వీకరణలో ఎక్కడా జాప్యం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను కోరారు.



