నవతెలంగాణ – బల్మూరు
విద్య వైద్యం సాగునీరు ప్రాజెక్టుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులను ప్రారంభించి కొత్త పనులకు శంకుస్థాపన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. బాణాల గ్రామంలో 70 లక్షలతో నిర్మించిన గిరిజన ఆశ్రమ పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మించేందుకు ఐటిడిఏ ఆధ్వర్యంలో కోటి రూపాయలతో నిర్మించే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో మంచి జీవితాలను అందుకోవాలని అన్నారు.
ప్రభుత్వపరంగా విద్యార్థులకు మౌలిక వసతులను అదనపు తరగతి గదులను మంచి ప్రదేశాలను వాతావరణాన్ని కల్పిస్తున్నదని ఇన్ని చేస్తున్న ప్రభుత్వానికి మీరు ఇచ్చే బహుమతి చదువుకోవడం ఒక్కటే అని అన్నారు. పాఠశాల ఆవరణలో ప్లే గ్రౌండ్ నిర్మాణానికి మరియు ప్రహరీ గోడ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు.పాఠశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య ప్రగతి నివేదిక చదివి వినిపించారు. అనంతరం అనంతవరం గ్రామంలో అంగన్వాడి భవన నిర్మాణానికి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. కొత్తపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ భావన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.



