– కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వానికే అవమానం
– కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ డ్రామాలు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– వేల్పూర్ లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయని, కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వానికే అవమానమని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ డ్రామాలని ఆయన పేర్కొన్నారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ సాధకుడు కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయని వారు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే కాళేశ్వరం కమిషన్లని, సిట్ అని, ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల పేర్లతో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ను వేధిస్తున్నారని ఆరోపించారు.ప్రస్తుత మంత్రివర్గాన్ని దండుపాళ్యం బ్యాచ్ గా అభివర్ణిస్తూ, వారు రోజుకో కుంభకోణానికి పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దొరికింది దొరికినట్టు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే బొగ్గు స్కామ్, సోలార్ పవర్ స్కామ్, సింగరేణి డీజిల్ స్కామ్, మరియు ఎక్సైజ్ (మద్యం) స్కామ్‌లను బయటపెట్టారని గుర్తుచేశారు. ఈ స్కామ్‌ల నుండి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి కేసీఆర్ కు నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు పెన్షన్లను 200 నుండి 2000 చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు.
రైతులకు 24 గంటల కరెంట్, సాగునీరు, ఎరువులు, రైతుబంధు అందించి రైతులను ఆదుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కోట్లాది మంది ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న నాయకుడిని, పోలీసులను అడ్డం పెట్టుకొని అవమానించడం దారుణమన్నారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు పనిచేయకుండా, కేసుల చుట్టూ తిరిగేలా చేయాలనే కుట్రతోనే రేవంత్ రెడ్డి ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.కేసీఆర్ ను వేధిస్తే ఆ ఉసురు ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి తగలకుండా పోదని హెచ్చరించారు. న్యాయం, ధర్మం తమ వైపే ఉన్నాయని, ఈ కక్ష సాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వెంటే ఉంటుందని తెలియజేశారు.



