Friday, January 30, 2026
E-PAPER
Homeమానవిమాపై జోకులు వేసేవారు

మాపై జోకులు వేసేవారు

- Advertisement -

అన్నపూర్ణమ్మ… అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఓ యోగం, నవ్వకపోవడం ఒక రోగం’ అన్న జంధ్యాల అంటే తెలియని వారు ఈ తెలుగు నేలపై ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. వీరి జీవిత భాగస్వామే అన్నపూర్ణమ్మ. ఎన్నో హస్య చిత్రాలకు మాటలు అందించిన భర్త హఠాత్‌ మరణం తర్వాత పిల్లలు, అత్తమామల బాధ్యత చూసుకుంటూ జీవిస్తున్న ఆమె జనవరి 14న జంధ్యాల జన్మదినోత్సవం సందర్భంగా మానవితో తన జ్ఞాపకాలను పంచుకున్నారు.

నా పెండ్లి అయ్యే నాటికి నా వయసు పదిహేను. జంధ్యాల గారికి ఇరవైరెండు. మా మామగారు రేడియోల వ్యాపారం చేసేవారు. మావారు బి.కాం పూర్తి చేసిన తర్వాత సీఏ చేద్దామని గుంటూరు వెళ్లారు. అయితే అప్పుడు మా మామయ్య ఒక్కరే వ్యాపారం చూసుకోలే తనకు తోడుగా ఉండమని అడిగారు. దాంతో తండ్రి మాట కాదనలేక వ్యాపారం కొనసాగించారు. వ్యాపారం చేస్తున్నా ఆయన మనసు ఎప్పుడూ నాటకాల చుట్టు తిరుగుతుండేది.

మద్రాసు ప్రయాణం
జంధ్యాలగారు తన పదవ ఏట నుండే కథలు రాసేవారు. పద్దెనిమిదేండ్ల నుంచి నాటకాలు, రేడియో నాటికలు రాసేవారు. అవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. పెండ్లి తర్వాత మద్రాసులో కళాసాగర్‌ సంస్థ నుండి శుభాన్‌గారు నాటకం వేయడానికి పిలిపించారు. అందులో నటించే వాళ్ళని అందరిని తీసుకుని మద్రాసు వెళ్లారు. ఆ నాటకం పేరు సంధ్యా రాగంలో శంఖారావం. అది చూడటానికి పి.పుల్లయ్య,శాంతకుమారి, గుమ్మడి, కె.విశ్వనాధ్‌ వచ్చారు. నాటకం అయ్యాక వాళ్ళు మా వారిని కలిసి అభినందించారు. మద్రాసు వచ్చేయమని అడిగారు. వెంటనే వెళ్ళాలంటే కుటుంబంతో కష్టం కదా! అందుకే ఆయన ఆలోచనలో పడ్డారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ముందు ప్రయత్నంగా ఆయన వెళ్లి తన స్నేహితుడు ఎం.వి రఘుతో(అప్పటికే మద్రాసు వెళ్ళిపోయాడు) మద్రాసులో ఉండేవారు. కొన్నాండ్ల తర్వాత మమ్మల్ని మద్రాసుకు తీసుకెళ్లారు.

క్షణం తీరికలేకుండా…
మద్రాసులో మా ఇల్లు విశ్వనాధ్‌ గారి ఇంటి ఎదురిల్లు. మేము అద్దెకు ఉన్న ఇంటి యజమానికి విశ్వనాధ్‌ గారికి బాగా పరిచయం. జంధ్యాలగారిని కూడా తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేసారు. అప్పుడే విశ్వనాధ్‌ గారు ‘సిరిసిరి మువ్వ’ సినిమాకు జంధ్యాల గారితో మాటలు రాయించారు. రాఘవేంద్రరావుతో పరిచయం ఏర్పడిన తర్వాత అడవి రాముడు, వేటగాడు సినిమాలకు మాటలు రాయించారు. ఇక అప్పటి నుండి క్షణం తీరికలేదు ఆయనకు. మేము హైద్రాబాద్‌కి వచ్చే వరకు ఇదే పరిస్థితి. మొదటి సారి మద్రాసులో కాపురం పెట్టినప్పుడు ఆయనకు క్షణం తీరిక ఉండేది కాదు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. మాతో పాటు అత్తయ్య, మామగారు ఉండేవారు. చుట్టూ పక్కల అందరూ సినీ రంగానికి చెందిన వారే. ఏడిద నాగేశ్వరరావు, చంద్రమోహన్‌, సంగీత దర్శకుడు చక్రవర్తి ఇలా అందరూ తెలుగువారు ఉండటం వల్ల భాష సమస్యలతో పాటు ఇతర ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. మేమున్న ప్రాంతం ఎప్పుడూ సందడిగా ఉండేది.

స్రిప్ట్‌కాపీ రాసిచ్చేదాన్ని
షూటింగ్‌కి ముందుగా ఆయన వెళ్లిపోయేవారు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు చెందిన ఆడవాళ్ళం అందరం వెళ్ళేవాళ్ళం. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ ఎక్కువ కాపీలు కావాల్సి వచ్చినప్పుడు నన్ను రాయమని అనేవారు. ఆ రోజుల్లో జిరాక్స్‌లు తయించుకోవడం లేదు. అందుకే ఎన్ని కాపీలు కావాలన్నా చేత్తోనే రాయాలి. తనకు ఏదైనా బాగా నచ్చిన కథ ఉంటే మాకు వినిపించేవారు. అంతా విన్నాక ఎలా ఉందని అడిగేవారు. ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి రాసుకునేవారు. ఆ సమయంలో ఆయన్ని ఎవ్వరం డిస్టర్బ్‌ చేసేవాళ్ళం కాదు. ఎప్పుడైనా కాఫీ కావాలి అని అడిగితే చేసి పట్టుకెళ్లి ఇచ్చిరావడం తప్ప మాట్లాడేవాళ్ళం కాదు. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవారు. నా మీద, మా అత్తగారి మీద బాగా జోక్స్‌ వేస్తూ ఉండేవారు. మమ్మల్ని ఏదో ఒకటి ఆటపట్టించేవారు. నేను తెలుగు పదాలు సరిగా మాట్లాడలేకపోతే ‘వత్తులు సరిగా పలుకు లేదా వత్తుల డబ్బా పెట్టుకో’ అని ఆటపట్టిస్తుండేవారు. తెలుగు భాష ఉచ్చారణ సరిగా లేకపోతే అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఆయనకు అసలు కోపం ఉండేది కాదు. షూటింగ్‌ సమయంలో కెమెరా మాన్లు, లైట్‌ బార్సు సరిగా పని చేయకపోతే కొంచం కోప్పడే వారు కానీ వెంటనే మర్చిపోయేవారు.

ఆయన మరణంతో…
మాకు పెండ్లయిన 25 ఏండ్లకు ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు. వాళ్లకు నాలుగేండ్లు ఉన్నప్పుడు ఆయన వెళ్లి పోయారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన వల్ల నేను చాలా కుంగిపోయాను. ఒక వైపు చిన్న పిల్లలు. మరోవైపు వృద్ధులైన అత్తయ్య, మామయ్య. అందరికోసం బాధను దిగ మింగుకున్నాను. అత్తయ్య, మామయ్య పిల్లలను చాలా ప్రేయగా చూసుకునే వారు. నన్ను కూడా సొంత కూతురిలా చూసుకు న్నారు. హైదరాబాద్‌ లో మా ఇంటి ఎదురుగా మా అక్క వాళ్ళు ఉండేవారు. మా అన్నయ్య కూడా హైదరాబాద్‌లో ఉండటం వల్ల ఈ సంఘటన జరిగిన తర్వాత తరచుగా అక్క, అన్నయ్య, వాళ్ళ పిల్లలు ఇంటివి వస్తుండేవాళ్లు. అందరూ ఇచ్చిన ధైర్యంతో త్వరగానే కోలుకున్నాను.

ఆయనతో జ్ఞాపకాలు అనేకం
వంట చేస్తున్నపుడు ఆయనకు ఇష్టమైనవి గుర్తుకు వస్తాయి. ఆయనకు రోటీ పచ్చళ్ళు, వంకాయ కూర, కొబ్బరి మామిడి పచ్చడి, కొత్త ఆవకాయ, కొత్త చింతకాయ, గోంగూర వంటివి ఎంతో ఇష్టం. మద్రాసులో ఉన్నప్పుడు షూటింగ్‌ స్పాట్‌కి ఇంటి నుండి క్యారెజ్‌ పంపేదాన్ని. రోజూ షూటింగ్‌కి వెళ్ళేటప్పుడు ‘ఈ రోజు షూటింగ్‌లో కోట, నరేష్‌, బ్రహ్మానందం ఉన్నారు. వాళ్లకు ఫలనావి ఇష్టం చేసి పంపించు’ అనే వారు. ప్రతి ఒక్కరినీ అంత ప్రేమగా చూసుకునేవారు. ఎదుటి వారికి ఇష్టమైనవి చేయించి, తినిపించడం ఆయనకు చాలా ఇష్టం. వాళ్లకు వడ్డించి వాళ్లు తిన్న తర్వాతనే తాను తినేవారు. ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా వంటల మెనూ వారే చెప్పేవారు.

అంగరంగ వైభవంగా చేశారు
మా పిల్లల మొదటి పుట్టినరోజు పండుగ హైదరాబాద్‌ లోనే చేసాము. దాదాపు ఎనిమిది వందల మంది దాకా వచ్చారు. ఎంత ఆర్భాటంగా చేశారంటే ఎర్ర తివాచీ వేసి, ఊర్ల నుండి ఏనుగులు, గుర్రాలు తెప్పించి ఊరేగించి హంగామా చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారైతే ‘మీ పిల్లల పెండ్లి చేస్తున్నావా? పుట్టినరోజు చేస్తున్నావా? అని సరదాగా అడిగారు. ఇంటికి రాగానే పిల్లలతో సదరాగా గడిపేవారు. వాళ్ళతో ఆడుకునేవారు. కానీ పిల్లల అచ్చట ముచ్చట చూడకుండానే వెళ్లిపోయారు. ఆయన్ని ఇప్పటికీ సినీ పరిశ్రమ, ప్రేక్షకులు గుర్తు పెట్టుకుని అభిమానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వెళ్ళిపోయి పాతికేండ్లు అయ్యింది. ఆయనతో గడిపిన ప్రతిక్షణం ఒక మధురమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలే నా ఊపిరి.

  • పాలపర్తి సంధ్యారాణి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -