Friday, January 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమేడారంలో కొలువుదీరిన వనదేవతలు

మేడారంలో కొలువుదీరిన వనదేవతలు

- Advertisement -

నేడు దర్శనానికి పోటెత్తనున్న భక్తులు
ముగిసిన సమ్మక్క ఆగమన ఘట్టం
మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యవేక్షణ

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి/ములుగు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’ మహా ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో వనదేవతలందరూ కొలువుదీరినట్టయింది. ముందుగా సమ్మక్కను సాయంత్రం 7:15 గంటలకు ప్రధాన పూజారి కొక్కర్ల కిష్టయ్య తీసుకొస్తూ చిలకలగుట్ట దిగగానే జిల్లా ఎస్పీ సుధీర్‌రామ్‌నాథన్‌ కేకన్‌ గాలిలో కాల్పులు జరిపి స్వాగతం పలికారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివాకర్‌, అధికార యంత్రాంగం ఆదివాసీ ప్రజా ప్రతినిధుల మధ్య, పోలీసులు భారీ బందోబస్తు నడుమ సమ్మక్క ఆగమనం ప్రారంభమైంది. సమ్మక్కను వడ్డెలు తీసుకొస్తుండగా మహిళల నృత్యాలు, శివసత్తుల పూనకాల నడుమ ఈ కార్యక్రమం కొనసాగింది.

రహదారికి అడ్డంగా కోళ్లు, గొర్రెలను బలిస్తూ స్వాగతం పలికారు. కాగా, నేడు(శుక్రవారం) తల్లుల దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరడం తో భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర మంత్రులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. పొంగులేటి, అడ్లూరి గురువారం ఉదయం బైక్‌లపై ప్రయాణించి జాతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివాకర్‌తో కలిసి జంపన్న వాగు వద్ద భక్తుల స్నాన ఘట్టాలను, పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.

అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు తగు సూచనలు చేస్తూ పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. అలాగే, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్‌ ఓరం మేడారం చేరుకున్నారు. వారికి రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ డోలు, డప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు తులాభారం వేయించుకున్నారు. కిషన్‌ రెడ్డి 75 కేజీలు, జువల్‌ ఓరం 86 కేజీల బంగారాన్ని అమ్మవార్లకు మొక్కుగా సమర్పించుకున్నారు.

నేటి రద్దీ నేపథ్యంలో ముందస్తు చర్యలు
జాతరలో భక్తులకు తక్షణ వైద్యం అందేలా ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. పోలీస్‌, రెవెన్యూ, ఎండోమెంట్స్‌, అగ్నిమాపక శాఖలు మూడంచెల భద్రతతో అప్రమత్తంగా ఉన్నాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా కన్నెపల్లి సర్కిల్‌ వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. క్యూలైన్లలో క్రమశిక్షణ పాటించి వనదేవతలను దర్శించుకోవాలని అధికారులు కోరుతున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం వేలమంది సిబ్బందిని నియమించింది. భక్తులు వ్యర్థాలను నిర్ణీత ప్రాంతాల్లోనే వేయాలని, ఎవరికైనా అనారోగ్యం కలిగితే వెంటనే అందుబాటులో ఉన్న మెడికల్‌ క్యాంపులను సంప్రదించాలని, చిన్నపిల్లలు లేదా వృద్ధులు తప్పిపోతే వెంటనే అనౌన్స్‌మెంట్‌ సెంటర్లకు లేదా పోలీస్‌ హెల్ప్‌ డెస్క్‌లను సంప్రదించాలని మంత్రి పొంగులేటి సూచించారు. మహా జాతర చివరి అంకానికి చేరుకుంటున్న తరుణంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా కన్నెపల్లి సర్కిల్‌ వంటి కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -