Friday, January 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇది విచారణ కాదు.. ప్రతీకారం

ఇది విచారణ కాదు.. ప్రతీకారం

- Advertisement -

న్యాయం కాదు రాజకీయ దురుద్దేశం
కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు దుర్మార్గం : కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఫోన్‌ ట్యాపింగ్‌ విచారణ పేరుతో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్‌ నోటీసులివ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది విచారణ కాదనీ, ప్రతీకా రమని తెలిపారు. ఇది న్యాయం కాదనీ, రాజకీయ దురుద్దేశమని పేర్కొన్నారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్‌ అని వివరించారు. పదేండ్ల పాలనతో ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు.

సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. అనేక పథకాలతో తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్‌ అని వివరించారు. అడ్డగోలు హామీలు, అబద్ధాల పునాదుల మీద అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నోటీసులిస్తున్నదని విమర్శించారు. కేసీఆర్‌ ప్రజల్లో గుండెల్లో నిలిచిన నాయకుడనీ, నోటీసులు, బెదిరింపులో చరిత్రను చెరిపేయలేరని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండించారు. ప్రజలపక్షాన వారి గొంతుక గా ఈ అన్యాయపాలనపై పోరాటం కొనసాగిస్తా మని తెలిపారు. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదనీ, ప్రజల తీర్పుతోనే రాస్తారని స్పష్టం చేశారు.

కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం : తలసాని
కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దురార్గమని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. కేసీఆర్‌ నోటీసులివ్వడం అత్యంత దుర్మార్గమని మాజీమంత్రి జి జగదీశ్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కు నోటీసులివ్వడమంటే తెలంగాణకు నోటీసులివ్వడమేనని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. రేవంత్‌రెడ్డి అభద్రతాభావానికి నిదర్శనమే ఈ సిట్‌ నోటీసులని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు శిక్ష తప్పదని హెచ్చరించారు. సిట్‌ విచారణ పేరుతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగబోదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారని మాజీమంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. కేసీఆర్‌కు నోటీసులివ్వడం కాంగ్రెస్‌ పిచ్చికి పరాకాష్ట అని విమర్శించారు. కాంగ్రెస్‌ చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసీఆర్‌కు నోటీసులిచ్చారని మాజీ ఎంపీ బి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీలు ఎల్‌ రమణ, శంభీపూర్‌ రాజు పేర్కొన్నారు. కేసీఆర్‌కు మరక అంటించేందుకే సిట్‌ నోటీసులను ఇచ్చిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, కార్పొరేషన్ల మాజీ చైర్మెన్లు జి దేవీప్రసాద్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కిశోర్‌గౌడ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజా పాలన కాదనీ, ప్రజా వ్యతిరేక పాలన, ప్రతీకార పాలన అని బీఆర్‌ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు విమర్శించారు.

కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి కుతంత్రాలు : హరీశ్‌రావు
కేసీఆర్‌పై రాజకీయ కక్షతో సీఎం రేవంత్‌రడెఇ్డ సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్‌ను టచ్‌ చేయడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్‌ చేయడమేనని పేర్కొన్నారు. చారిత్రాత్మక నాయకుడు కేసీఆర్‌పై బురద చట్టాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మడి వేయడమే అవుతుందని తెలిపారు. పాలనలో చాతకాని తనంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేం దుకు సిట్‌ పేరుతో నోటీసులు జారీ చేసి చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. రాజకీయ వేధింపులతో మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం రేవంత్‌రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని తెలిపారు. అధికారం శాశ్వతం కాదనీ, అహంకారం అంతకంటే కాదని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్‌ వెంటే ఉందనీ, రాజకీయ వేధింపులకు భయ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -