Friday, January 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి

12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి

- Advertisement -

కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌పై ఫిబ్రవరి 12న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుప్‌ అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల సంయుక్త సమావేశాన్ని ఆయా సంఘాలు నిర్వహించాయి. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ, కార్యదర్శి జె. వెంకటేష్‌, నగర అధ్యక్షులు ఎం. దశరథ్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌. బాల్రాజు, ఐఎన్‌టీయూసీ ఉపాద్యక్షులు విజయ్ కుమార్‌ యాదవ్‌, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు, టీయూసీఐ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎల్‌. పద్మ, ప్రవీణ, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌, బీఆర్‌టీయూ అధ్యక్షులు జి. రాంబాబు యాదవ్‌, ఏఐయూటీయూసీ నాయకులు భరత్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా దీర్ఘకాలికంగా కార్మికులు ఆందోళన చేస్తున్నా .. మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాలకు, కార్పొరేట్‌ శక్తులకు లాభాలు చేకూర్చడానికే పెద్దపీట వేస్తున్నదని విమర్శించారు. కార్మిక, రైతు, గ్రామీణ వ్యవసాయ కార్మికులపై భారాలు వేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌కోడ్‌లను తీసుకొచ్చిందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే బ్రిటీష్‌ వారితో కొట్లాడి సాధించుకున్న అనేక చట్టాలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని విమర్శించారు. ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటల పనిదినంగా మార్చేందుకు చూస్తున్నదని పేర్కొన్నారు. యూనియన్లను గుర్తించే విషయంలో అనేక మార్పులు తెచ్చిందని తెలిపారు. సామాజిక భద్రతపై దాడి చేస్తున్నదన్నారు.

పీఎఫ్‌, ఈఎస్‌ఐ చట్టాల్లో అనేక మార్పులు చేసి యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై కార్మికులు ఆధారపడేలా చేస్తున్నదని అన్నారు. మహిళలతో ప్రమాదకరమైన పనుల్లో, రాత్రివేళల్లో పనులు చేయించొ ద్దని గత చట్టాల్లో ఉన్నప్పటికీ ఈ హక్కులన్నింటినీ కాలరాస్తోందని విమర్శించారు. విదేశీ, స్వదేశీ బహుళజాతి సంస్థలకు ఊడిగం చేసే చర్యలను కార్మికవర్గం ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఎస్‌. బాల్రాజు మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి క్షీణిస్తున్నదని అన్నారు. నిరుద్యోగం పెరుగుతున్నదని, ప్రజాస్వామ్య హక్కులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా సంఘాలు ఏర్పరుచుకునే స్వేచ్ఛను, భావ వ్యక్తీకరణ, అసమ్మతిని, నిరసన తెలిపే హక్కులతో సహా ప్రజాస్వామ్య సంస్థలపై దాడులు చేస్తున్నదని తెలిపారు.

విజయ్ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రెబ్బా రామారావు మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేటీ కరించడానికి ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను తీసు కొచ్చిందని గుర్తు చేశారు. రైతుల పోరాటం వల్ల ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకున్నప్పటికీ, ఇతర రూపాల్లో ఆ చట్టాలను కొనసాగిస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు, విద్యుత్‌ సవరణ చట్టం-2025, ఇన్సూరెన్స్‌ రంగంలో 100శాతం ఎఫ్‌డీఐలు, మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం రద్దు తదితర డిమాండ్లపై వచ్చే నెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్రంలోని కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, సకల జనులు పెద్దఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -