మేడారంలో కేంద్రమంత్రులు జోయల్ ఓరం, కిషన్‌రెడ్డి
మహా జాతరకు ‘జాతీయ’ హోదా కల్పించాలి : కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రుల వినతి
రూ.890 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం.. త్వరలో భూమి పూజ
రాష్ట్ర కృషి అభినందనీయం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి/ములుగు
గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం స్పష్టం చేశారు. గురువారం మేడారం మహా జాతరకు కేంద్ర మంత్రి జోయల్ ఓరం, కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాగా, వారికి రాష్ట్ర మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతం పలికారు. వారు అమ్మవార్లను దర్శించుకొని వారి నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జోయల్ ఓరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి జోయల్ ఓరం ప్రత్యేకంగా అభినందించారు. దేశ అభ్యున్నతిలో 10 కోట్ల మందికి పైగా ఉన్న ఆదివాసీలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు మేడారం జాతర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులందరూ మేడారం విశిష్టతను తెలుసుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో రూ. 890 కోట్లతో సమ్మక్క-సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే ప్రధాని చేతుల మీదుగా భూమి పూజ నిర్వహిస్తామని తెలిపారు. రామప్ప దేవాలయ అభివృద్ధికి రూ.140 కోట్లు కేటాయించామన్నారు. అలాగే, రూ. 24 వేల కోట్లతో దేశంలోని 20 వేల గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రంలో 23 ఏకలవ్య పాఠశాలల కోసం రూ. 500 కోట్లు వెచ్చిస్తున్నామని వివరించారు. మేడారం జాతర ఏర్పాట్ల కోసం కేంద్రం రూ. 3.70 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పీ శబరిష్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మేడారం జాతరకు ‘జాతీయ’ హోదా కల్పించాలి : రాష్ట్ర మంత్రుల వినతి
సమ్మక్క-సారలమ్మ మహా జాతరను ‘జాతీయ పండుగ’గా గుర్తించాలని రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మేడారం పర్యటనకు వచ్చిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిలను రాష్ట్ర మంత్రులు ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. కుంభమేళాను తలపించే ఈ జాతరలో భక్తుల కోసం శాశ్వత కట్టడాలను నిర్మించామని, మేడారంను జాతీయ పండుగగా గుర్తించి మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. కేవలం 9 నెలల స్వల్ప కాలంలోనే గద్దెల పునర్నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని అన్నారు. భక్తుల సౌకర్యార్ధం రోడ్ల విస్తరణ, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ దీపాలంకరణలో మెరుగైన వసతులు కల్పించామని వివరించారు.



