నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌జీటీకి షోకాజ్ నోటీసు..
మధ్యాహ్న భోజన కార్మికురాలి తొలగింపు
నవతెలంగాణ-నారాయణఖేడ్ రూరల్
మధ్యాహ్న భోజనం తిని 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురై కడుపునొప్పితోపాటు వాంతులు చేసుకున్నారు. గమనించిన ఉపాధ్యాయులు, విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్.. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా. వసంతరావును ఆదేశించారు. ఈ నేపథ్యంలో నారాయణఖేడ్‌కు చేరుకున్న అధికారి వసంతరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, వారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని తెలిపారు.
ఎస్‌జీటీకి షోకాజ్ నోటీసులు
వెంకటాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో విధులో నిర్లక్ష్యం వహించిన ఎస్‌జీటీ కాశీనాథ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. అలాగే, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు ఎస్.నాగమణిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాం. -వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి



