టాటా గ్రూపు 30 విమానాలకు ఆర్డర్
నవతెలంగాణ – బిజినెస్ బ్యూరో
హైదరాబాద్‌లో జరుగుతోన్న వింగ్స్ ఇండియా ప్రదర్శనలో భారీగా ఒప్పందాలు జరుగుతున్నాయి. రెండో రోజూ ప్రదర్శనలో అనేక కంపెనీలు తమ విస్తరణలో భాగంగా ఇతర కంపెనీలతో భాగస్వామ్యాలను ప్రకటించాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో కొన్ని ఒప్పందాలు జరగ్గా.. మరికొన్ని కంపెనీలుగా భాగస్వామ్యాలను ప్రకటించాయి. ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. పర్యావరణ అనుకూలమైన సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్‌ఎఎఫ్) సరఫరా కోసం ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని ఐఒసిఎల్ కంట్రీ హెడ్ శైలేష్ ధర్ పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్‌తో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఒప్పందం కుదర్చుకుంది. ఇరు సంస్థలు రాబోయే ఐదేండ్లలో 115 మంది విమానయాన నిపుణులకు శిక్షణ ఇవ్వనున్నాయి.
టాటా గ్రూపు కొత్త ఆర్డర్లు
టాటా గ్రూపులోని ఎయిర్ ఇండియా ఏకంగా 30 విమానాలను కొనుగోలు చేయడానికి బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంధన సమర్థవంతమైన నారోబాడీ విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఎయిర్ ఇండియా మొత్తం ఆర్డర్ల సంఖ్య ప్రపంచంలోనే 600 విమానాలకు చేరుకుంది. అదే విధంగా బోయింగ్ 787 ఫ్లీట్ నిర్వహణ కోసం ‘బోయింగ్ గ్లోబల్ సర్వీసెస్’తో దీర్ఘకాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరోవైపు ఎయిర్‌బస్‌కు చెందిన 15 ఎ321 నియో విమానాలను అత్యాధునిక ఎ321ఎక్స్‌ఎల్‌ఆర్ వేరియంట్‌లుగా మార్చడానికి అంగీకారం కుదిరింది. ఇవి సుదూర అంతర్జాతీయ ప్రాంతాలకు నాన్ స్టాప్ విమాన సర్వీసులను అందించడానికి తోడ్పడతాయి.
ఓమ్నిపోల్‌తో శక్తి గ్రూప్ జట్టు..
దేశీయ విమానయాన రంగంలో ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరిచే దిశగా ఓమ్నిపోల్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు శక్తి ఏవియేషన్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ (ఎస్‌ఎడిఎస్‌పిఎల్) తెలిపింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఓమ్నిపోల్ గ్రూపునకు చెందిన ఎల్410 ఎన్‌జి 10 సీటర్ల విమానాలను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఒప్పందం మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో జరిగింది. కేవలం విమానాల కొనుగోలుకు మాత్రం పరిమితం కాకుండా భారత్‌లో తుది తయారీ యూనిట్‌ను నెలకొల్పే యోచనలో ఉన్నామని ఆ కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు.
పవన్‌హాన్స్‌కు 10 హెచ్‌ఎఎల్ హెలికాప్టర్లు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఎఎల్) నుండి 10 ధ్రువ్ నెక్ట్స్ జనరేషన్ (ఎన్‌జి) హెలికాప్టర్ల కొనుగోలు కోసం పవన్ హన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది దేశీయ హెలికాప్టర్ రంగంలో కీలక మైలురాయని హెచ్‌ఎఎల్ పేర్కొంది.
స్కైపోర్ట్జ్, వర్టిపోర్ట్స్ వ్యూహాత్మక ఒప్పందం
మౌలిక సదుపాయాల కల్పనల సంస్థ స్కైపోర్ట్జ్ సంస్థ కొత్తగా గోమ్సన్స్ ఏవియేషన్ అనుబంధ విభాగమైన వర్టిపోర్ట్స్ ఇండియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సాధారణ విమానాలకు రన్‌వేలు అవసరమైనట్లుగా నిలువుగా టేక్-ఆఫ్, ల్యాండింగ్ అయ్యే విద్యుత్ విమానాల కోసం ప్రత్యేకంగా నిర్మించే కేంద్రాలనే ‘వర్టిపోర్ట్‌లు’ అంటారు. భారత్‌లోని టైర్ 1, టైర్ 2 నగరాలతో పాటు వేగంగా అభివద్ధి చెందుతున్న ప్రాంతాలలో సురక్షితమైన, స్థిరమైన వర్టిపోర్ట్ నెట్‌వర్క్‌లను ఈ భాగస్వామ్యం అభివృద్ధి చేయనుందని స్కైపోర్ట్ సిఇఒ క్లెమ్ న్యూటన్ బ్రౌన్ తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా వర్టిపోర్ట్‌లను నిర్మిస్తామని వర్టిపోర్ట్జ్ ఇండియా సిఇఒ రవి ముసుకు పేర్కొన్నారు.
యూఏసీతో ఫ్లెమింగో ఏరోస్పేస్ జట్టు
భారత విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ఫ్లెమింగో ఏరోస్పేస్ గురువారం హైదరాబాద్‌లో రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (యూఏసీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఐఎల్-114-300కు సంబంధించిన ఆరు ప్రాంతీయ విమానాల కొనుగోలుకు ఇరు సంస్థలు సంతకాలు చేశాయి. 68 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానాల కొనుగోలుకే పరిమితం కాకుండా, దశలవారీగా ఈ విమానాల సంపూర్ణ తయారీని భారత్‌లోనే చేపట్టేలా ప్రణాళికలు రూపొందించామని ఫ్లెమింగో ఏరోస్పేస్ ఫౌండర్, సీఈఓ సుభాకర్ పప్పుల తెలిపారు. ఈ ఒప్పందం దేశంలోని చిన్న నగరాల మధ్య విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుందన్నారు.
వింగ్స్ ఇండియాలో భారీగా ఒప్పందాలు..
- Advertisement -
- Advertisement -



