Friday, January 30, 2026
E-PAPER
Homeబీజినెస్గగనతల రంగంలో విస్తృతావకాశాలు

గగనతల రంగంలో విస్తృతావకాశాలు

- Advertisement -

చిన్న స్టార్టప్‌లకూ మద్దతిస్తాం..
గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌గా భారత్‌
బారామతి ప్రమాద బ్లాక్‌ బాక్స్‌ విశ్లేషణ : కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

నవతెలంగాణ – బిజినెస్‌ బ్యూరో
భారతదేశం ప్రపంచ విమానయాన రంగానికి కేంద్ర బిందువుగా మారుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతోన్న వింగ్స్‌ ఇండియా ఎక్స్‌పోనూ వరుసగా రెండో రోజూ సందర్శించిన మంత్రి అవార్డుల ప్రదానోత్సవం, సదస్సులో పాల్గొన్నారు. కేపీఎంజీ-ఫిక్కీ సంయుక్తంగా రూపొందించిన ”పావింగ్‌ ద ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ ఇన్‌ వికసిత్‌ భారత్‌-2047” నివేదికను విడుదల చేశారు. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్‌ ఎకోసిస్టమ్‌గా ఎదగడానికి అవసరమైన తొమ్మిది వ్యూహాత్మక మార్గాలను ఈ నివేదిక సూచించింది. ఈ సందర్బంగా మంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. విదేశీ సంస్థలు మన దేశాన్ని తయారీ ఎగుమతుల హబ్‌గా గుర్తిస్తున్నాయని అన్నారు. భారత గగనతలం అపరిమితమైన అవకాశాలు ఉన్నాయన్నారు.భారత పౌర విమానయాన రంగం సాధించిన ఈ విజయం కేవలం ఒక వ్యక్తిదో లేదా ఒక సంస్థదో కాదన్నారు.

ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేటు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల సమిష్టి కృషి ఫలితమని మంత్రి కొనియాడారు. ఈ విజయాన్ని అందరూ కలిసి వేడుకగా జరుపుకోవాలన్నారు. ఈ రంగంలో మహిళల భాగస్వామ్యంపై మంత్రి ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. ”ప్రపంచవ్యాప్తంగా మహిళా పైలట్ల సగటు కేవలం 5 శాతంగా ఉంటే, భారతదేశంలో అది 15 శాతంగా ఉండటం గర్వకారణం. భవిష్యత్తులో విమాన సిబ్బందిగా, పైలట్లుగా, ఇతర కీలక బాధ్యతల్లో మహిళల సంఖ్యను మరింత పెంచడమే మా లక్ష్యం.” అని ఆయన స్పష్టం చేశారు. విమానయాన రంగం మరింత వైవిధ్యంగా సమ్మిళితంగా ఉండాలన్నారు. చిన్నప్పటి నుంచే విమానాలపై ఆసక్తి పెంచుకునే పిల్లల అభిరుచిని గుర్తించి, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విమానయాన రంగంలో పైలట్లు, ఇంజనీర్లు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు వంటి అనేక కెరీర్‌ అవకాశాలు ఉన్నాయని వివరించారు.

కొత్త ఆలోచనలతో వచ్చే స్టార్టప్‌లకు, యువతకు మంత్రిత్వ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారి ఆలోచన చిన్నదైనా పెద్దదైనా తగిన మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.విమానాల పనితీరుపై లోతైన అవగాహన కలిగి ఉండటం, అత్యవసర సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం విమానయాన నిపుణులకు అత్యంత ముఖ్యమని మంత్రి గుర్తు చేశారు. భవిష్యత్తులో రాబోయే కొత్త టెక్నాలజీలు, ఆటోమేషన్‌, వినూత్న విమాన నమూనాలు ఈ రంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్‌ పవార్‌ మృతి పట్ల మంత్రి రామ్మోహన్‌ నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బారమతి ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. బ్లాక్‌బాక్స్‌ విశ్లేషణ జరుగుతోందన్నారు. సురక్షిత ప్రయాణం కోసం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. ఈ ప్రమాదం చాలా విచారకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -