Sunday, May 25, 2025
Homeప్రధాన వార్తలుగోకరాజు రంగరాజు ఇంజినీరింగ్‌ కాలేజీ మోసం

గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్‌ కాలేజీ మోసం

- Advertisement -

సమాచారాన్ని తారుమారు చేసిన యాజమాన్యం
సిబ్బంది, పరిశోధనలపై తప్పుడు వివరాలు
జేఎన్టీయూహెచ్‌కు ఉద్యోగుల ఫిర్యాదు.. సమగ్ర విచారణకు డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో టాప్‌ కాలేజీల్లో ఒకటిగా పేరుగాంచిన గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్‌ కాలేజీ మోసం బయట పడింది. సిబ్బంది, పరిశోధనలకు సంబంధించి తప్పుడు వివరాలతో సమాచారాన్ని తారుమారు చేసినట్టు తెలుస్తు న్నది. అధ్యాపకుల అంచనాల్లో అవకతవకలు జరిగినట్టు సమాచారం. అధ్యాపకులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కూడా ఆ యాజమాన్యం తిరస్కరించినట్టు తెలిసింది. ఇంకోవైపు పరిశోధన నిధులు ప్రశ్నార్థక వినియోగంతో సహా పరస్పర సహకారాలు అనే ముసుగులో పరిశోధన ప్రచురణల్లో మోస పూరిత పద్ధతులను అనుసరించిందని ఆరోపణలు వస్తు న్నాయి. నేషనల్‌ అసెస్‌మెంట్‌ అక్రిడిటేషన్‌ అండ్‌ కౌన్సిల్‌ (న్యాక్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌), జేఎన్టీయూ హైదరాబాద్‌ నిజనిర్ధారణ కమిటీ వంటి తనిఖీ బృందాలకు నియామకాలు, అధ్యయనాలు, ఇతర విభాగ గణాంకాలకు సంబంధించి మోసపూరితమైన సమాచారాన్ని సమర్పించినట్టు సమాచారం. సిఫారసులు లేదా అనైతిక మార్గాల ద్వారా తనిఖీ అధికారులపు ప్రభావితం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. తప్పుడు సమాచారం ఆధారంగా డీమ్డ్‌ టు బి విశ్వవిద్యాలయం (ప్రయివేటు విశ్వవిద్యాలయం) హోదా కోసం ఆ కాలేజీ దరఖాస్తు చేసినట్టు తెలిసింది. ఈ అంశాలకు సంబంధించి జేఎన్టీయూ హైదరాబాద్‌కు ఆ కాలేజీ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. తనిఖీ బృందాలు ఆ కాలేజీని సందర్శించాయి. కానీ అక్కడ ఉండే సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. అయితే రాష్ట్రంలో ఎక్కువ ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ వంటి కాలేజీల్లో ఇదే విధమైన అక్రమ పద్ధతులను పాటిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
జేఎన్టీయూహెచ్‌ను ప్రశ్నించిన ఫిర్యాదు దారులు
జేఎన్టీయూ హైదరాబాద్‌ను ఫిర్యాదు దారులు పలు అంశాలపై ప్రశ్నలను సంధించారు. తనిఖీ బృందాలు ఆ కాలేజీని సందర్శించినపుడు మొత్తం అధ్యాపకుల సంఖ్యను పరిశీలించారా? వారి బయోమెట్రిక్‌ హాజరును ధృవీకరించారా?అని అడిగారు. కొన్ని విభాగాల్లోని అధ్యాపకుల్లో ఎక్కువ మంది పేరు కోసమే ఉన్నారనీ, దానిపై ఎలాంటి సందేహం లేకుంటే వారి నెలవారీ బయోమెట్రిక్‌ హాజరుతోపాటు జీతం స్టేట్‌మెంట్‌ను పరిశీలించాలని కోరారు. తనిఖీల సమయంలో కొంత మంది గైర్హాజరు కావడం, మరికొంత మంది డమ్మీలను తీసుకొచ్చినట్టు తెలుస్తున్నదని అన్నారు. కానీ కెమెరా రికార్డింగ్‌ ప్రయోజనాల కోసం రెగ్యులర్‌ ఫ్యాకల్టీలో కొంత మంది ఇతరుల స్థానంలో వారి బృందం ముందు పదేపదే తిరిగి కనిపించారని వివరించారు. తనిఖీ తర్వాత వీడియో రికార్డును పరిశీలించాలని సూచించారు.
ల్యాబ్‌ పరిస్థితులను పరిశీలిస్తే చాలా ఏండ్లుగా సరైన మౌలిక వసతుల్లేవనీ, పరికరాలు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. కానీ తనిఖీ బృందాలు సందర్శించినపుడు సరైన తనిఖీల్లేకుండా జాగ్రత్తలు పడతారని ఆరోపించారు. డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదా కోసం నిర్వహించిన మాక్‌ వర్చువల్‌ టూర్‌ నిర్వహించడానికి కూడా ఆ కాలేజీ వద్ద సరైన ఇంటర్నెట్‌ సౌకర్యం లేదని వివరించారు. ఈ విషయాలను పున:పరిశీలించాలని కోరారు. సమర్పించిన ఆరోపణలపై నిష్పాక్షికమైన, సమగ్రమైన విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పారదర్శకమైన, జవాబుదారీతనం పాటించడం అత్యవసరమని కోరారు. తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -