– చివరి రోజు నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు
నవతెలంగాణ – కామారెడ్డి
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, బారికేడ్లు, క్యూ లైన్ల నిర్వహణను స్వయంగా పర్యవేక్షించారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో పనిచేస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) అమలులో ఎలాంటి రాజీ లేదని, నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయం వైపు వచ్చే రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపివేయాలని, ప్రధాన కూడళ్ల వద్ద నిరంతర నిఘా కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో స్వేచ్ఛాయుత, శాంతియుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు.
ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌వో నరహరి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



