పింఛన్ల లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ
ఏ ఊరు వారైతే ఆ ఊర్లోనే ఫేస్ రికగ్నేషన్ టెస్ట్
మరణిస్తే తొలగించి.. కొత్తవారికి ఇచ్చే లక్ష్యం
2న కొత్త పింఛన్లు ఇచ్చేందుకు మొదలైన హడావుడి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పెన్షన్ల పంపిణీలో అనర్హుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం అధికారులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. లబ్దిదారుల తనిఖీ నిమిత్తం ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టమ్- ముఖ గుర్తింపు విధానం)ను చేపట్టారు. లబ్దిదారు ఏ ప్రాంతానికి చెందిన వారైతే అక్కడికే వెళ్లి ఎఫ్‌ఆర్‌ఎస్ చేపించుకోవాలి. దీనికి ఈనెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఎండల తీవ్రత నేపథ్యంలో దీనిని ఈ నెలాఖరు వరకూ పొడిగించాలని నిర్ణయించుకున్నారు. జూన్ 2వ తేదీ నాటికి పింఛన్లపై స్పష్టత వస్తే కొత్త వాటిని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియను ఈనెల 27, 28వ తేదీల్లోపే పూర్తి చేయాలనే యోచనతో ప్రభుత్వం ఉంది. గ్రామీణ, మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ ఏకకాలంలో సాగుతోంది. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా ఆధార్ నంబర్ సహా లబ్దిదారుల లైవ్ ఫొటోను నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 42 లక్షల మందికి పైగా ఆసరా / చేయూత పింఛన్లు పొందుతున్నారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు వంటి లబ్దిదారులు ఉన్నారు.
కొత్తగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన సుమారు 2 లక్షల మందిపై ఈ ఫేస్ రికగేషన్ ప్రక్రియతో స్పష్టత వస్తుంది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 1,76,950 మందికి చేయూత పెన్షన్ల ద్వారా ప్రభుత్వం నెలకు రూ.42 కోట్లు విడుదల చేస్తోంది.
పకడ్బందీగా ఎఫ్‌ఆర్‌ఎస్
చేయూత పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోనూ అమలు చేస్తారు.
ఈ విధానం ద్వారా పింఛన్ల పంపిణీలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సెర్ప్ ఆఫీసర్లు భావించారు. జిల్లా సమన్వయకర్తలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రాజెక్టు మేనేజర్లు, వార్డు అధికారులకు ఈ విధానంపై సమగ్ర శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన సంబంధిత అధికారులు జిల్లాల్లోని సిబ్బందికి శిక్షణ ఇచ్చి, క్షేత్రస్థాయిలో ఈ విధానాన్ని పకడ్బందీగా అమల్లోకి తెచ్చారు.
బ్యాంక్ అకౌంట్ లబ్దిదారులపై దృష్టి
రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో బ్యాంక్ అకౌంట్ ద్వారా చేయూత పింఛన్ డబ్బులు తీసుకుంటున్న లబ్దిదారుల వివరాలను ఫేషియల్ రికగ్నిషన్‌తో గుర్తిస్తున్నారు. దీని వల్ల లబ్దిదారులు వేలిముద్రలతో పనిలేకుండా యాప్ ద్వారా తమ గుర్తింపును నమోదు చేసి సులభంగా పింఛన్ తీసుకోవచ్చు. ఈ కొత్త టెక్నాలజీతో లబ్దిదారులు జీవించి ఉన్నారా? వలసవెళ్లారా? అనే విషయాలు తెలిసిపోతాయి. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోని వారిని గుర్తించడం, చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం వంటివి జరుగుతున్నాయి. దీనివల్ల అర్హులకే లబ్ది అందేలా చూడటం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
2 నుంచి కొత్త పింఛన్లు ఇచ్చే ఛాన్స్..!
ప్రస్తుతం అధికారులు, సిబ్బంది చేస్తున్న హడావిడిని బట్టి జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కొత్త పింఛన్లపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. అనర్హులతోపాటు చనిపోయిన వారి పెన్షన్లు తొలగిస్తే కొత్త వారికి చోటు కల్పించొచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత సర్వే ద్వారా మృతుల వివరాలు గుర్తించి కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.



