– కేక్ కట్ చేసి, నామకరణం చేసిన సర్పంచ్ హారిక అశోక్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్ట సమీపంలో కన్యక పరమేశ్వరి ఆలయం ముందు ఉన్న మర్రి చెట్టుకు శుక్రవారం పుట్టిన రోజు వేడుకలు చేశారు. స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ఆధ్వర్యంలో మర్రిచెట్టును పూలతో అందంగా అలంకరించి, కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు చేశారు.ఈ సందర్భంగా మర్రి చెట్టుకు పంచాక్షరి వృక్షం అని సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఈ మర్రిచెట్టుకు సంబంధించిన ప్రత్యేకతను అ చెట్టు సంరక్షకుడు ముద్రవేణి హన్మాండ్లు తెలిపారు. గతంలో మండల కేంద్రంలో రోడ్డు వెడల్పుల భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను తొలగించారు. దశాబ్దాలుగా ఉన్న చెట్లను తొలగించడం చూస్తూ మనస్సు ఒప్పని గ్రామానికి చెందిన పలువురు వాటిని రీప్లాంటేషన్ చేయాలని సంకల్పించారు.
అందులో భాగంగా కొన్ని చెట్లను ఎంపిక చేసి జెసిబి సహాయంతో వేళ్ళతో సహా పెకిలించి ట్రాక్టర్లలో పలుచోట్లకు తరలించారు. చెట్లకు అనువైన స్థలాలను సేకరించి నాటించారు. ఎంతో శ్రమకోడిసి పదుల సంఖ్యలో చెట్లను రీప్లాంటేషన్ చేస్తే కాలం కలిసి రాక చెట్లని చనిపోయాయి. కానీ రీప్లాంటేషన్ చేసిన చెట్లలో కన్యకా పరమేశ్వరి ఆలయం ముందు నాటిన ఒక్క మర్రిచెట్టు నేనున్నానంటూ బ్రతికి చిగురించింది. దీనికి గ్రామానికి చెందిన మూద్రవేణి హన్మాండ్లు సంరక్షణ బాధ్యతలు తీసుకొని సంరక్షించారు. ప్రస్తుతం చెట్టు కొమ్మలు ఊడలతో అందర్నీ ఆకట్టుకుంటుంది. దారిన పోయే పదిమందికి నీడనిస్తుంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, కమ్మర్ పల్లి అడవి రేంజ్ అధికారి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో మర్రి వృక్షానికి పుట్టినరోజు పండుగ చేయాలని సంకల్పించారు.
అందులో భాగంగా చెట్టును పూలతో అలంకరించి, పంచాక్షరి వృక్షమని నామకరణం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఆహుతులకు అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ అధికారి ఎర్రం వరుణ్, స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగా రామస్వామి, కోశాధికారి నూకల బుచ్చి మల్లయ్య, గేయ రచయిత్రి మగ్గిడి లక్ష్మి, పేర్ని శివతాండవం కళాకారుడు ముద్రవేణి హన్మాండ్లు, వార్డు సభ్యులు లోలం సురేష్, బోల్గం నవీన్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



