నవతెలంగాణ – జుక్కల్
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో దేశ స్వాతంత్ర్య సాధనకు నాయకత్వం వహించి, సత్యం, న్యాయం, సమానత్వం, గ్రామ స్వరాజ్యం వంటి విలువలను దేశ ప్రజలకు అందించిన మహానీయుడని కొనియాడారు.
పేదలు, గ్రామీణ ప్రజల అభ్యున్నతే గాంధీజీ కల అని గుర్తుచేశారు .గాంధీజీ ఆశయాలకు ప్రతీకగా తీసుకువచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) ద్వారా గ్రామీణ పేదలకు ఏడాదికి కనీసం 100 రోజుల ఉపాధి హామీ కల్పించి, వారి జీవన భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారించిందన్నారు. ఈ చట్టం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందని తెలిపారు.
అయితే గ్రామీణ పేదల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం – వీబీజీ రామ్‌జీను తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్యే గారు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం (MGNREGA) వంటి ప్రజా అనుకూల చట్టాలను బలహీనపరిచే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



