నవతెలంగాణ – ఉప్పునుంతల
ఇకపై యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉప్పునుంతల మండల కేంద్రంలో రైతులతో ముఖాముఖి మాట్లాడి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రతి రైతుకూ అవసరమైన యూరియా అందేలా నూతన విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా రైతులు తమకు అవసరమైన యూరియాను సులభంగా పొందవచ్చని చెప్పారు.
యూరియా కావలసిన రైతులు స్లాట్ బుక్ చేసుకుని ఎకరాల ప్రకారం అవసరమైన యూరియా బస్తాలను పొందవచ్చని, స్లాట్ బుక్ చేసిన 24 గంటల్లో రైతుకు యూరియా అందేలా ఈ విధానం రూపొందించబడిందన్నారు. ఈ విధానం వల్ల యూరియా పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, అక్రమాలు, మధ్యవర్తుల జోక్యం తగ్గుతుందని అన్నారు.
యాప్ వినియోగంలో రైతులకు ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే మండల వ్యవసాయ అధికారి కొర్ర రమేష్ , ఆయా క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని సమయానికి యూరియా పొందాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపునిచ్చారు.



