నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని) ను టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉప్పునుంతల పర్యటనలో భాగంగా ఆసుపత్రికి చేరుకున్న ఆయన, ఆసుపత్రిలోని సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సిబ్బంది సమయానికి విధులకు రావాలని అన్నారు. దీనిపై ఆయన అధికారులను నిలదీశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని, డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్యం రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేసిన ఎమ్మెల్యే, ప్రజల ఆరోగ్యం ముఖ్యమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.



