న్యూఢిల్లీ : విద్యా, ఆర్థిక సాధికారతలతో సామాజిక స్థాయి పెరుగుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యా నించింది. వెనుకబడిన తరగతుల్లోని ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల్లోని పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఇంకా కొనసాగుతుండడాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం ప్రశ్నించింది. తల్లిదండ్రు లిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు లైనందున పిటిషనర్‌ను రిజర్వేషన్ నుంచి మినహాయించడాన్ని సమర్ధిస్తూ కర్నా టక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. ‘‘తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులు, అటువంటపుడు వారికి ఎందుకు రిజర్వేషన్లు కల్పించాలి? విద్యా, ఆర్థిక సాధికారతలతో సామాజిక స్థాయి పెరుగుతుంది. అటువంటపుడు, మళ్ళీ వారి పిల్లలకు ఎందుకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. ఇలా అయితే ఈ రిజర్వేషన్ వ్యవస్థ నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేం’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. విద్యార్ధుల తల్లిదండ్రులు మంచి ఉద్యోగాల్లో వుండి, ఆకర్షణీయమైన వేతనాలు పొందుతుంటే, అటువంటి సంపన్న వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాల పరిధి నుండి బయటకు తీసుకురావాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ విషయంలో అటువంటి సంపన్న వర్గాలకు రిజర్వేషన్లు మినహాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అనేక ఉత్తర్వులు జారీ చేసిందని బెంచ్ పేర్కొంది. కానీ వాటిని ఇప్పడు సవాలు చేస్తున్నారని పేర్కొంది.
‘‘ఆర్థికంగా బలహీన వర్గాలకు, వెనుకబడిన గ్రూపులకు సామాజిక వెనుకబాటుతనం అంటూ ఏమీ వుండదు, కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే వుంటుంది. ఇక్కడ కొంత సమతుల్యత పాటించాల్సి వుంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబాటుతనం వుంటుంది, నిజమే, కానీ, రిజర్వేషన్ ప్రయోజనాలను అవకాశంగా తీసుకుని తల్లిదండ్రులు ఒక స్థాయికి చేరుకున్నారు.’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది.
రిజర్వ్‌డ్ కేటగిరీ కింద కర్నా టక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పిటిషనర్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)గా నియామకానికి సెలక్ట్ అయ్యాడు. అయితే జిల్లా కులాలు, ఆదాయాల నిర్ధారణ కమిటీ పిటిషనర్‌కు కుల ధ్రు వీకరణ సర్టిఫికెట్‌ను ఇవ్వడానికి నిరాకరించింది. క్రీమీ లేయర్ పరిధిలోకి పిటిషనర్ వచ్చినందున తాము సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పిటిషనర్ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులని, వారిద్దరి ఆదాయం నిర్దేశిత క్రీమీ లేయర్ పరిధి రూ.8లక్షలను కూడా దాటి పోయిందని అధికారులు తెలిపారు. దాంతో కురుబ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా పేర్కొంటూ ఇచ్చిన కుల సర్టిఫికెట్‌ను రద్దు చేశారు.
విద్యా, ఆర్థిక సాధికారతలతో సామాజిక స్థాయి మెరుగు : సుప్రీంకోర్టు
- Advertisement -
- Advertisement -


