Saturday, January 31, 2026
E-PAPER
Homeమానవిసెల్లుకి బానిసలైతే...

సెల్లుకి బానిసలైతే…

- Advertisement -

ఈ మధ్య కాలంలో చాలామంది సోషల్‌ మీడియాకు బానిసలవుతున్నారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్లు విపరీతంగా వాడుతూనే ఉన్నారు. దీనివల్ల రహస్యాలంటూ ఏమీ ఉండడం లేదు. వ్యక్తిగత విషయాలు కూడా ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. జీవితాలే గల్లంతు అయిపోతున్నాయి. మన అనుకున్న వారికి దూరమైపోతున్నారు. ఇలా సెల్‌ఫోన్‌కు బానిసైతే జీవితం ఎలా ఉంటుందో తెలియజేసే కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌(ఐలమ్మ ట్రస్ట్‌) ఆధ్వర్యంలో మీకోసం మానవిలో…

దీప్తికి 26 ఏండ్లు ఉంటాయి. ఏడాది కిందట దీపక్‌తో పెండ్లి జరిగింది. ఇద్దరూ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇద్దరి కుటుంబ సభ్యులు గ్రామాల్లో ఉంటారు. అయితే కుటుంబ బాధ్యతల గురించి వీరికి పెద్దగా తెలియదు. కనీసం వంట చేసుకోవడం, ఇంట్లో పనులు చూసుకోవడం కూడా రాదు. దీప్తి నెమ్మదిగా అన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టింది. అలాగే వంట చేయడం కూడా మొదలుపెట్టింది. అయితే సెల్‌ఫోన్లో యూటూబ్‌ చూస్తూ వంట చేసేది. అలా ఆమె ఉద్యోగం నుండి రాగానే కొత్త వంటల కోసం ఫోన్‌ చూడడం మొదలుపెట్టేది. ఆమె చూస్తుందని దీపక్‌ కూడా తన ఫోన్‌తో బిజీగా ఉండేవాడు.

ఆరు నెలల్లో దీప్తి వంట నేర్చుకుంది. ఇంట్లో సహాయం కోసం ఓ అమ్మాయిని పెట్టుకుంది. ఆమె ఇంట్లో బట్టలు ఉతకడం, గిన్నెలు కడగటం, ఊడవడం చేస్తుంది. వీళ్లు ఆఫీస్‌కు వెళ్లక ముందే వచ్చి ఆమె పని చేసుకొని వెళ్లేది. సాయంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ పని ఉండేది కాదు. దీప్తి ఫోన్‌ పక్కన పెట్టి ఇంటిపక్క వాళ్లతో కలిసి ఆటలు, ఆడటం వాళ్లతో సరదాగా కబుర్లు చెప్పుకోవడం లాంటివి చేసేది. కానీ దీపక్‌ మాత్రం ఫోన్‌కు బాగా అలవాటు పడిపోయాడు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ఇదే పని. ఫోన్‌ అస్సలు వదలడు. దీప్తి చాలా సార్లు చెప్పి చూసింది. కానీ లాభం లేకుండా పోయింది.

‘ఇద్దరం కలిసి టీవీ చూద్దాం లేదా ఏదైనా పుస్తకం చదువుదాం, మన ఏరియాల్లో చాలా మంది గేమ్స్‌ ఆడతున్నారు, మనం కూడా వెళ్లి ఆడదాం’ అంటూ దీప్తి ఎంత చెప్పినా అతనిలో మార్పు లేదు. ఆమె మాత్రం అప్పుడప్పుడు గేమ్స్‌ ఆడుతుండేది. ఏడాదిలోనే అపార్ట్‌మెంట్‌లోని అందరితో బాగా కలిసిపోయింది. కానీ దీపక్‌ ఎలా ఉంటాడో కూడా పక్క వాళ్లకు తెలియదు. అతనికి ఫోన్‌ తప్ప మరో ప్రపంచమే లేదు. కనీసం భార్యతో కూడా సరిగ్గా మాట్లాడడు. ఫోన్‌ చూస్తూనే తింటాడు, ఫోన్‌ చూస్తూనే పడుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగిపోయింది.

వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇరు కుటుంబాల పెద్దలు పిల్లల కోసం ఒత్తిడి మొదలుపెట్టారు. దాంతో ‘దీపక్‌ నన్ను పట్టించుకోవడం లేదు, ఎప్పుడూ ఫోన్‌ చూస్తూ ఉంటాడు’ అని దీప్తి అందరికీ చెప్పేసింది. దానికి వాళ్లు ‘ఫోన్‌ చూడడం తప్పెలా అవుతుంది. మేము అడిగిన దానికి ఫోన్‌ చూడటానికి సంబంధం ఏంటీ’ అన్నారు. ఆమె సమస్యను అర్థం చేసుకోలేకపోయారు. వాస్తవానికి అతను భార్య లేకపోయినా ఉంటాడు కానీ ఫోన్‌ లేకుండా ఉండలేని స్థితిలో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో తెలిసిన వాళ్లు చెబితే న్యాయం చేయమంటూ ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.

మేము దీపక్‌కి ఫోన్‌ చేసి పిలిపిస్తే ‘ఆమె ఫోన్‌ చూసినప్పుడు ఎలాంటి తప్పు లేదు. కానీ నేను చూస్తే మాత్రం ఇంట్లో అందరికీ చెప్పేసింది. చివరకు మీ వరకు వచ్చింది. ఆమె అర్థం చేసుకోవడం లేదు. ఫోన్‌ చూడడం అంత పెద్ద తప్పా! ఆఫీసు నుండి వచ్చిన తర్వాత ఆమె కూడా చూస్తుంది. కావాలంటే ఆమెనే అడగండి’ అన్నాడు. దానికి దీప్తి ‘నేను ఫోన్‌ చూస్తాను కానీ రోజు మొత్తంలో ఒక గంట మాత్రమే. అంతకంటే ఎక్కువ చూడకూడదు అని నేను స్కీన్‌ టైం పెట్టుకున్నాను. నేను చూడాలి అనుకున్నా నా ఫోన్‌ ఆగిపోతుంది. ఆ గంట కూడా నాకు అవసరమైనవి మాత్రమే చూస్తాను. అంతేకానీ ఉపయోగం లేని వాటి జోలికి వెళ్లను. ఫోన్లో చూసే నేను వంట నేర్చుకున్నాను. మరి ఫోన్‌ చూసి ఆయన ఏం నేర్చుకున్నాడో చెప్పమనండి. నేను మా చుట్టుపక్కల అందరితో సరదాగా ఉంటాను. ఆయన ఫోన్‌ చూస్తూ తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోడు. ఒకసారి రోడ్డుపైన ఒకామె పడిపోతే లేపకుండా వీడియో చూస్తూ కూర్చున్నాడు. అంతెందుకు నాకు జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నా పట్టించుకోలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఫోన్లో మందులు వెతుకుతున్నాడు. మా పక్కింటి ఆవిడ వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లింది.
ఒక పక్క మా కుటుంబాల్లో వాళ్లు పిల్లల గురించి అడుగుతున్నారు. ఇలా ఈయన రోజు మొత్తం ఫోన్‌తో గడుపుతుంటే నేనేం చేయాలి? అసలు నాకు జీవితంపైనే విరక్తి పుడుతుంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఇద్దరి మాటలు విన్న తర్వాత ‘చూడు దీపక్‌.. నువ్వు ఫోన్‌ మాయలోపడి నీ భార్యను మర్చిపోతున్నావు. నిజజీవితంలో పొందాల్సిన ఆనందానికి దూరమవుతున్నావు. కనీసం నీ చుట్టు పక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. ఫోన్‌ పక్కన పెట్టి నలుగురితో ఆప్యాయంగా మాట్లాడి చూడు. అప్పుడు అర్థమవుతుంది అందులోని మాధుర్యం ఎలాంటిదో. నువ్వు ఇలాగే ఉంటే ఆరోగ్య పరంగా కూడా అనేక సమస్యలు వస్తాయి. మెల్లగా స్క్రీన్‌ టైం తగ్గించకపోతే రేపు నీకంటూ ఎవ్వరూ మిగలరు. మనుషులందరికీ దూరమై నువ్వు కూడా ఓ యంత్రంలా తయారవుతావు. ఇద్దరూ ఒకరితో ఒకరు సమయం గడపండి. పెండ్లయి ఏడాదే అయ్యింది. కానీ మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ దూరంగా ఉంటున్నారు. ఈ ఫోన్‌ వల్ల మీ జీవితాలనే కోల్పోతున్నారు. దీప్తి తగ్గించుకున్నట్టు నువ్వు కూడా ఫోన్‌ వాడకం తగ్గించుకో. అప్పుడు నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో వచ్చి చెప్పు’ అని పంపించాము.
రెండు వారాల తర్వాత దీపక్‌ వచ్చి ‘మేడమ్‌ మీరు చెప్పింది నిజమే. మీ మాటలు విన్న తర్వాత నేను చేస్తున్న తప్పేమిటో అర్థమయింది. ఇన్నేండ్లు నేనేం కోల్పోయానే తెలుసుకున్నాను. ఇకపై అవసరం అయితేనే ఫోన్‌ చూస్తాను. అనవసరంగా దాని జీలికి వెళ్లను’ అని చెప్పాడు.

– వై వరలక్ష్మి, 9948794051

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -