ప్లేటో రిపబ్లిక్ నుంచి నేటి వరకూ రిపబ్లికనిజం సుదీర్ఘ ప్రస్థానం సాగించింది. ఫ్రెంచి విప్లవ క్రమంలో అది సుసంపన్నమై స్వేచ్ఛ, సమానత, సౌహార్ద్రత అనే నినాదాలిచ్చింది. వీమర్ రిపబ్లిక్ పతనం, ముస్సోలినీ హిట్లర్‌ల కుత్సితపు ఫాసిజం పుట్టుకలతో ఆ ప్రయాణం తీవ్రమైన ఒత్తిళ్లకు గురైంది. ఫాసిజం ఓటమి, రీచ్ స్టాగ్‌పై ఎర్రజెండా ఎగరేయడంతో రిపబ్లికనిజం నూతన జీవం పోసుకుంది. ఆ విధంగా ఫాసిస్టు వ్యతిరేక పోరాట విజయం శిథిలాలపై ప్రపంచ శక్తుల బలాబలాల నూతన పొందిక జరిగింది. ఆ విధంగానే ప్రపంచం నానాజాతి సమితిని పునర్నిర్మించుకుని అందరి చేరికతో ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేసుకుంది.
ప్రచ్ఛన్న యుద్ధ దశలో ఆ ప్రస్థానం మలుపులు కుదుపులూ ఎదుర్కోలేదని కాదు. అయితే రిపబ్లికనిజం అనే భావన మాత్రం మరింతగా గుర్తింపబడి ఆమోదం పొందింది. దార్శనికతల్లో రూపాల్లో తేడాలున్నప్పటికీ ఒక చట్టబద్దమైన క్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నదే మూలసూత్రమైంది. అంతర్జాతీయ ఒప్పందాలు, సంప్రదాయాలు నిలదొక్కుకోవడం జరిగింది. అయితే ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి, ప్రతిశక్తిగా వున్న సామ్యవాద శిబిరం లేకుండా పోవడం అదే సమయంలో సామ్రాజ్యవాద నేతృత్వంలోని ప్రపంచీకరణ విపరీతంగా పెరగడం వల్ల అంతర్జాతీయ వ్యవస్థలో ప్రధానమైన మార్పులకు ఆస్కారం కలిగింది. దేశాలకు తగినట్టు నయా ఉదారవాద ప్రభుత్వాలు వెలిశాయి.
రిపబ్లికనిజంపై దాడి
సహజంగానే ఈ నూతన మితవాద మొగ్గు వల్ల ప్రపంచ స్థాయిలో రిపబ్లికనిజం అనే భావన తీవ్రమైన ఒడుదుడుకులకు గురైంది. ప్రచ్ఛన్న యుద్ధ దశలో అదేపనిగా చెప్పుకున్న శాంతి వాగ్దాన ప్రయోజనం గప్ చుప్‌గా భూస్థాపితం చేయబడింది. ఏకధృవ ప్రపంచం వైపుగా నడిచేందుకు దుందుడుకుగా అడుగులేయడం మొదలైంది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అపహరించుకుపోవడం, ఆ దేశ చమురు సంపదలతో సహా దేశ సార్వభౌమత్వాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంతో అది పరాకాష్టకు చేరింది. ఇప్పుడు కెనడా, గ్రీన్‌లాండ్ కోసం పాకులాటతో రిపబ్లికనిజం ఇచ్చిన ఉత్తేజంతో చట్టబద్దమైన వ్యవస్థ ముగింపుకు వచ్చింది. దీన్నే కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ చిదిమివేతగా అభివర్ణించారు. అమెరికా చర్యలనూ తన వ్యక్తిగత దృష్టిలోని నైతిక భావననూ అడ్డుకోగల నిబంధన ఏదీ లేదని డోనాల్డ్ ట్రంప్ చెప్పేశాక ఇక ఊహించవలసిన అవసరమేమీ లేకుండాపోయింది.
ఇలాంటి ప్రపంచ పరిస్థితులలో భారత దేశంలో రిపబ్లికనిజం కూడా తీవ్రమైన ఒత్తిడికి గురికావడం పెద్దగా ఊహించలేని విషయమేమీ కాదు. భారత దేశంలో రిపబ్లికనిజం ప్రధానంగా దేశ స్వాతంత్య్రం కోసం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట క్రమంలో పదునెక్కిందే. కనుక ఇది మరింతగా జరుగుతుంది. అది పాశ్చాత్య దేశాలలో రిపబ్లికనిజం కంటే పూర్తి భిన్నమైంది. ఈ క్రమంలోనే అది చాలా వైవిధ్యాన్ని సామాజిక సంప్రదాయాలనూ సాంస్కృతిక పౌర లక్షణాలను సంతరించుకుంది. దేన్నయినా స్వీకరించడం సహనం వంట పట్టించుకుంటుంది. సార్వభౌమత్వం, స్వాతంత్య్రం, సమానత అనే భావాలను సర్వసమ్మిళితం చేసే సుసంపన్న వైవిధ్యాన్ని గుర్తించే క్రమంలోనే భారత దేశంలో రిపబ్లికనిజం వర్థిల్లింది. ఉమ్మడి పౌరసత్వాన్ని పెంపొందించింది. అయితే మన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వారసత్వంలో భాగం పంచుకునేవారు మాత్రమే ఈ ప్రాథమిక సూత్రాలకు విలువనిస్తారు. ఆ పోరాట వారసత్వంతో ఏ సంబంధం లేని రాజకీయ శక్తులు దాని నుంచి దూరంగా పోవడమే కాదు, తమదైన భావనను బలవంతంగా రుద్దేందుకు కూడా ప్రయత్నం చేస్తారు.
అస్తిత్వాలపై వేటు
అంతర్జాతీయంగా కుహనా మితవాద శక్తుల పెరుగుదలకు తోడు భారతీయ కార్పొరేట్లు అంత ర్జాతీయ నయా ఉదారవాద వ్యవస్థతో చేతులు కలుపుతారు. దేశ సరిహద్దుల్లో అంతర్గతంగా వుండే శక్తులకు కూడా ఇది చాలా విస్తారమైన అవకాశం కల్పిస్తుందని చెప్పనవసరం లేదు. ఇన్ని సంవత్సరాలుగా కళ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్న ఆరెస్సెస్ ప్రస్తుతం తన శతజయంతిని జరుపుకుంటున్నది. దాని సైద్ధాంతిక సంతకం లాంటి హిందూత్వ వైవిధ్యభరిత వాస్తవం అనేదాంతో స్వతహాగానే రాజీపడదు. అయితే స్వాతంత్య్రా నికి, సమానతకు ‘భారత ప్రజలమైన మేము’ అనే భావనకు తప్పనిసరి పునాదిగా వుండేది అదే.
కనుక గత పదకొండేళ్లలో భారత దేశంలో రిపబ్లికనిజం తీవ్ర దాడికి గురైంది. దేశంలో మతపరమైన మైనార్టీలపై ఈ స్థాయిలో దుర్మార్గమైన దాడులు జరగడం గతంలో ఎప్పుడూ చూడలేదు. గత నెలలో జాతీయ మెడికల్ కమిషన్ జమ్మూలోని శ్రీమాతా వైష్ణోదేవి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్‌కు గుర్తింపును రద్దు చేసింది. ఇందుకేవో సాంకేతిక కారణాలు పేర్కొన్నప్పటికీ హిందూత్వ శక్తుల ఒత్తిడికి తలొగ్గడమే అసలు కారణం. ప్రవేశపరీక్ష ద్వారా అందులోవున్న యాభై సీట్లలోనూ 42 సీట్లు కాశ్మీరీ ముస్లింలు తెచ్చుకోవడమే ఇందుకు కారణమైంది. ఇది మునుపెన్నడూ జరగని విషయం. విద్య ప్రత్యేకించి ఉన్నత విద్య కేంద్రీకృతం చేయ బడి, వాణిజ్యీకరణ, మతతత్వీకరణ చేయబడుతున్న వందలాది సందర్భాలకు ఇదొక మచ్చుతునక మాత్రమే. ఈ క్రమంలో ప్రత్యేకించి చరిత్ర, సైన్స్ ప్రత్యక్ష దాడికి గురవుతున్నాయి.
పరాకాష్టగా ‘సర్’
రిపబ్లికనిజానికి ప్రతిరూపంగా వుండే ఉమ్మడి పౌరసత్వం అనే భావననే విచ్ఛిన్నం చేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రజాస్వామిక, లౌకిక, సమాఖ్యతత్వంతో కూడిన రిపబ్లిక్‌గా భావ ప్రకటనా స్వేచ్ఛను సమిష్టి సమాజంలోని విభిన్న సమూహాలనూ గుర్తించడం జరుగుతుంది. ‘భారత ప్రజలమైన మేము’ అంటే భాష, సంస్కృతి, గుర్తింపు, ప్రాంతం వంటి అస్తిత్వాలన్నిటిపైనా దాడి జరుగుతున్నది. ఓటు వేసేందుకుగల రాజ్యాంగ హక్కుపై, ఒక వ్యక్తి ఒక ఓటు అనే సూత్రంపై దాడి అన్నది బహుశా ఈ క్రమంలో చివరి వేటు కావచ్చు. ఎన్నికల నిర్వహణ కోసం స్వతంత్రంగా వ్యవహరించవలసిన రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల సంఘం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఆదేశాల మేరకు వారి వారి అస్తిత్వ నేపథ్యాలను బట్టి ప్రత్యేకంగా మత పరమైన గుర్తింపులను బట్టి ఓటు హక్కు లేకుండా చేయడం జరుగుతున్నది.
ఓటరు జాబితాలపై అభ్యంతరాలు తెలిపేందుకు ఉద్దేశించిన ఫారం 7 ఉపయోగించి అస్సాంలో ఓటర్ల పేర్లు తొలగిస్తున్న బీజేపీ నాయకులు కన్నంలోనే దొరికిపోయారు. అయినా సరే ఈ.సి గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. వాస్తవానికి బీజేపీ అగ్ర నాయకుడైన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ ముస్లింలను తొక్కిపట్టి వుంచాలని నిస్సంకోచంగా ప్రకటించారు కూడా. అందువల్ల రిపబ్లికనిజానికి ఎదురవుతున్న సవాళ్లు నిజమైనవే. అంతర్జాతీయ రంగంలో బహుళ ధృవత ఆవిర్భవిస్తున్న మేరకు ఈ దేశ ప్రజలు కూడా రిపబ్లిక్‌పై జరిగే ఈ దాడిని ఆమోదించి పడిఉండేేందుకు సిద్ధంగా లేరు. 1950 జనవరి 26న ఆమోదించుకున్న రాజ్యాంగంలో పొందుపర్చుకున్న రిపబ్లిక్‌ను కాపాడుకోవడానికి పోరాటాలు జరుగుతున్నాయి. రాజ్యాంగం ఆమోదం 76వ వార్షికోత్సవ సమయంలో ‘భారతీయులమైన మేము’గా అన్ని జీవన రంగాలలోని ప్రజానీకం ఆ భావాలనూ రిపబ్లిక్‌నూ కాపాడుకోవడానికి పునరంకితం కావాలి. రాజ్యాంగాన్ని, దేశాన్నీ రక్షించుకోవాలి.
(జనవరి 28 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
బహుళధృవ ప్రపంచంలో ఏకపక్ష దాడి చెల్లదు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



