Saturday, January 31, 2026
E-PAPER
Homeబీజినెస్బడ్జెట్‌కు ముందు మార్కెట్ల వెలవెల..!

బడ్జెట్‌కు ముందు మార్కెట్ల వెలవెల..!

- Advertisement -

జనవరిలో 3.5 శాతం పతనం
2021 తర్వాత అత్యంత పేలవం
కానరాని సానుకూలాంశాలు..
ముంబయి :
కేంద్ర బడ్జెట్‌పై దలాల్‌ స్ట్రీట్‌ నీళ్లు వదులుకున్నట్లు ఉంది. ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్‌కు ముందు కూడా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహారించడం గమనార్హం. నిరుద్యోగ సమస్య, మందగించిన కార్పొరేట్‌ లాభాలు, అంతర్జా తీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, ట్రంప్‌ చిచ్చుల భౌగోళిక ఆందోళనలు, భారత జిడిపి పతనం అంచనాలు తదితర అంశాలు మార్కెట్లకు ప్రధాన సవాళ్లుగా మారాయి. ఇవన్నీ ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోన్నాయి. ఈ నేపథ్యంలో వరుస అమ్మకాల ఒత్తిడితో ఈ ఏడాది జనవరిలో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ దాదాపు 3.43 శాతం పతనమయ్యింది. జనవరి 1న 85,188 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ 30న 82,270కి పడిపోయింది. నెలవారి పనితీరును విశ్లేషిస్తే 2021 జనవరి తర్వాత ఇదే అత్యంత పేలవతీరు కావడం గమనార్హం. రూపాయి ఆల్‌టైం రికార్డ్‌ పతనంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా తమ పెట్టుబడులను తరలించుకుపోతున్నారు.

ఫిబ్రవరి 1న మోడీ సర్కార్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థలో పలు ప్రమాద ఘంటికలు మోగు తోన్నాయి. బడ్జెట్‌ నిరాశజనకంగా ఉండొచ్చనే అంచనాలు మదుపర్లను ఆందోళనకు గురి చేస్తోన్నాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ద్వితీయార్థంలో దేశ జీడీపీ అంచ నాలను చేరకపోవచ్చని పలు సంస్థలు విశ్లేషణలు ఆర్థిక వ్యవస్థ తీరు పట్ల అనుమానాలను పెంచింది. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 90-92 మధ్య నమోదు కావడం విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురి చేస్తొంది. ఈ నేపథ్యంలోనే విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఒక్క జనవరిలోనే రూ.43,000 కోట్ల పైగా విలువ చేసే పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

ఒక్క పూటలో రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
నెల చివరి రోజూ, వారాంతం సెషన్‌లో మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. ఆదివారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయినప్పటికీ అమ్మకాల వెలువ కొనసాగడం గమనార్హం. శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 296.59 పాయింట్లు లేదా 0.36 శాతం నష్టపోయి 82,269.70కి పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 98 పాయింట్లు లేదా 0.39 శాతం కోల్పోయి 25,320.65 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 625 పాయింట్ల పతనంతో 81,941 కనిష్టాన్ని తాకింది. ముఖ్యంగా ఐటీ, మెటల్‌ స్టాక్స్‌లో విక్రయాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీనికితోడు రూపాయి విలువ పతనం, ఎఫ్‌ఐఐల విక్రయాలు కొనసాగు తుండడం కూడా మార్కెట్‌ విశ్వాసాన్ని దెబ్బతీ శాయి. ఒక్క పూటలో బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ దాదాపు రూ.4 లక్షల కోట్లు తుడుచుకు పెట్టుకుపోయి రూ.455.73 లక్షల కోట్లుగా నమోదయ్యింది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్బీఐ, ఐటీసీ, బీఈఎల్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు లాభపడిన వాటిలో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -