బ్రిటన్‌ను హెచ్చరించిన ట్రంప్
వాషింగ్టన్ : చైనాతో వాణిజ్యం నెరిపితే చర్యలు తప్పవని బ్రిటన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌లు తమ సంబంధాలను పున: ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది.
ట్రంప్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియని ఒక అనిశ్చితిని ఇటీవల పశ్చిమ దేశాలు ఎదుర్కొంటుండడంతో బ్రిటన్ నేత తాజాగా చైనా వైపు దృష్టి సారించారు. మెరుగుపరిచిన మార్కెట్ సౌలభ్యంతో, తక్కువ టారిఫ్‌లు, పెట్టుబడుల ఒప్పందాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకున్నట్లు స్టార్మర్ వ్యాఖ్యానించారు.
ఈ పరిస్థితుల్లో చైనాతో బ్రిటన్ వాణిజ్య సహకారాన్ని గురించి విలేకర్లు ప్రశ్నించగా, ”అది వారికి చాలా ప్రమాదకరమని” హెచ్చరించారు. కెనడా కూడా చైనాతో వ్యాపారం చేయాలని చూస్తోందనుకుంటా అని వ్యాఖ్యానించారు.
ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు ఆర్థిక వృద్ధిని సాధించడంలో ఇబ్బందులు పడుతున్న స్టార్మర్ ప్రభుత్వం చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకున దిశగా చర్యలు చేపడుతోంది. చైనానా లేక అమెరికానా అని బ్రిటన్ ఎంపిక చేసుకోబోదని స్టార్మర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చైనాకు వెళుతూ విమానంలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. అమెరికాతో తమది సుదీర్ఘకాల బంధమని వ్యాఖ్యానించారు.



