ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఇదే స్థాయిలో కనిపించని వీరి వాటా : డీఓపీటీ నివేదిక
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్-సీ క్యాటగిరీకి చెందిన పారిశుధ్య కార్మికుల్లో (సఫాయి కర్మచారులు) 66 శాతానికి పైగా మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారేనని కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ విభాగం (డీఓపీటీ) 2024-25 వార్షిక నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం… గ్రూప్-సీ ఉద్యోగాల్లో సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఉన్నతస్థాయి ఉద్యోగాలైన గ్రూప్-ఏ పోస్టుల్లో మాత్రం ఈ ప్రాతినిధ్యం గణనీయంగా తక్కువగా ఉన్నది. గ్రూప్-ఏలో కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఎస్సీలు 14.2 శాతం, ఎస్టీలు 6.54 శాతం, ఓబీసీలు 19.14 శాతం మాత్రమే ఉన్నారు.కేంద్ర ప్రభుత్వంలో నేరుగా నియామకాలకు సంబంధించిన డీఓపీటీ నిబంధనల ప్రకారం..ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది. అయితే, గ్రూప్-ఏ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యం వారికి కల్పించిన మొత్తం రిజర్వేషన్ శాతానికి కూడా తక్కువగా ఉన్నది. గ్రూప్-బీ పోస్టుల్లో ఎస్సీలు 16.2 శాతం, ఎస్టీలు 7.63 శాతం, ఓబీసీలు 21.95 శాతం ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. మొత్తంగా చూస్తే 80 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో పని చేస్తున్న 32.52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీల ప్రాతినిధ్యం 16.84 శాతం, ఎస్టీలది 8.7 శాతం, ఓబీసీలది 26.32 శాతంగా ఉన్నది. అయితే, ఈడబ్ల్యూఎస్ ఉద్యోగుల ప్రాతినిధ్యంపై ఎలాంటి డేటానూ నివేదిక వెల్లడించలేదు. దిగువస్థాయి ఉద్యోగాల్లో సామాజిక న్యాయం కొంత వరకు ప్రతిబింబించి నప్పటికీ… ఉన్నతాధికార స్థాయిల్లో మాత్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రాతినిధ్యం ఇంకా తక్కువగానే కొనసాగుతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
పారిశుధ్య కార్మికుల్లో 66 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే
- Advertisement -
- Advertisement -



