Saturday, January 31, 2026
E-PAPER
Homeజాతీయంపరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కే !

పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కే !

- Advertisement -

– స్కూళ్ళలో ఉచితంగా శానిటరీ పాడ్స్‌
– లేదా చర్యలు తప్పవు : ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ :
నెలసరి పరిశుభ్రత కూడా ప్రాధమిక హక్కేనని, రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద గౌరవంగా జీవించే హక్కులో అది భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో రుతుక్రమ సమయంలో పరిశుభ్రతకు అవసరమైన చర్యలు (ఎంహెచ్‌ఎం) తీసుకోవడం కూడా అందులో భాగమేనని పేర్కొంది. స్కూళ్ళలో బాలికలకు శానిటరీ పాడ్స్‌ను ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సదుపాయాలను అమలు చేయడంలో ప్రైవేటు స్కూళ్ళు విఫలమైతే వాటి గుర్తింపు రద్దు అవుతుందని హెచ్చరించింది. ”గౌరవాన్ని ఒక రూపమంటూ లేని ఆదర్శంగా కుదించలేం. ఎలాంటి అవమానాలు, బహిష్కరణలు, నివారించదగిన ఇబ్బందులు లేకుండా వ్యక్తులు జీవించగలిగే పరిస్థితుల్లో ఆ గౌరవమనేది వ్యక్తీకరించబడాలి.” అని జస్టిస్‌ జె.బి.పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన బెంచ్‌ తీర్పులో వ్యాఖ్యానించింది. రుతుస్రావమయ్యే బాలికలకు అందుకు అవసరమైన చర్యలు, సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో వారు సమాజంలో ఒక రకమైన కళంకానికి, అవమానాలకు గురవుతున్నారని పేర్కొంది. విద్యాసంస్థల్లో బాలికలకు ఇలాంటి సమయాల్లో అవసరమైన సౌకర్యాలేవీ అందుబాటులో లేనప్పుడు వారు స్కూలును మానేయడం లేదా ఏ మాత్రమూ సురక్షితం కాని పద్ధతులను అవలంబిస్తున్నారని హెచ్చరించింది. డాక్టర్‌ జయా థాకూర్‌ వేసిన రిట్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా గల స్కూళ్ళలో ఎంహెచ్‌ఎం చర్యలు కొరవడిన విషయాన్ని ఆ పిటిషన్‌ ప్రముఖంగా ప్రస్తావించింది. దీనివల్ల స్కూళ్ళలో ఆబ్సెంట్‌లు ఎక్కువవుతున్నాయని తెలిపింది. ఒకోసారి ఈ పరిస్థితులు ఆడపిల్లలు స్కూలు మానే సందుకు దారి తీస్తోందని పేర్కొంది. గౌరవంగా వుండడమా లేక చదువును కొనసాగించడమా వీటిలో ఏది ఎంచుకుంటారనే పరిస్థితిని బాలికలపై ప్రభుత్వం రుద్దలేదని కోర్టు పేర్కొంది. అలాంటి ఎంపిక ఏ రకంగానూ న్యాయం కాదూ, సమర్ధనీయం కాదని వ్యాఖ్యానించింది. అలాగే నెలసరి సమయాల్లో వున్న బాలికల పట్ల పురుషులు పోషిం చాల్సిన పాత్ర గురించి కూడా విడిగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి బాలికలను ఏ రకంగానూ వేధించకుండా లేదా అసభ్యంగా ప్రశ్నించకుండా వుండేలా ముందుగా పురుష ఉపాధ్యా యులను, విద్యార్ధులను చైతన్య పరచడం కూడా కీలకమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు సంబం ధించి వరుసగా పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో, పట్టణ లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఇలా ప్రతి చోటా పనిచేసేటువంటి, ఆడ పిల్లలకు, మగపిల్లలకు విడివిడిగా టాయిలెట్లు వుండేలా చూడాలని, ఇందుకు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం ఆదేశించింది. విద్యార్ధినులకు అందుబాటులో వుండేలా బయో డీ గ్రేడబుల్‌ శానిటరీ నాప్‌కిన్‌లను సిద్ధంగా వుంచాలని ఆదేశించింది. అవి కూడా టాయిలెట్‌ ఆవరణలోనే శానిటరీ నాప్‌కిన్‌ వెండింగ్‌ మెషిన్‌ల ద్వారా అందచేయాలని స్పష్టం చేసింది. అలాగే అదనపు ఇన్నర్‌వేర్‌, అదనపు యూనిఫారం, డిస్పోజబుల్‌ బ్యాగ్స్‌,ఇలా ఆ ప్రత్యేక పరిస్థితులకు అవసరమైన ప్రతీదీ అందుబాటులో వుంచాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలు ఇవి అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీ అవుతుందని కోర్టు పేర్కొంది. అలాగే ఒకవేళ ప్రైవేటు పాఠశాలలు విఫలమైతే వాటి గుర్తింపును కోల్పోతాయని హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -