Saturday, January 31, 2026
E-PAPER
Homeక్రైమ్గంజాయి సాగులో తరిస్తున్న సాధువు

గంజాయి సాగులో తరిస్తున్న సాధువు

- Advertisement -

పూజారి ముసుగులో అమ్మకాలు
కటకటాల్లోకి నెట్టిన ఎక్సైజ్‌ పోలీసులు
17.741 కేజీల గంజాయి స్వాధీనం
దానివిలువ రూ.70 లక్షలు పైనే..
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ఆయనో సాధువు…కాషాయ వస్త్రధారి…గుడిలో పూజారి. అందరూ సదరు వేషధారికి సాష్టాంగ నమస్కారాలు చేసేవారే. ఉన్న గ్రామంతో పాటు చుట్టు పక్కల పది గ్రామాల ప్రజలకు గురు మహారాజ్‌గా చెలామణి అవుతున్నారు. గుడికి వచ్చే భక్తులకు నాలుగు మంచి మాటలు చెప్పడం మానేసి, గంజాయి సాగు చేస్తూ, అమ్మకాలకు దిగారు. సదరు సాధువుపై అనుమానంతో నిఘా పెట్టిన డీటీఎఫ్‌ ఎక్సైజ్‌ పోలీసులు ఆధారాలతో సహా ఆయన్ని పట్టుకొని కటకటాల వెనక్కి నెట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం పంచాగామ్‌ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే…పంచాగామ్‌ గ్రామంలో పంట చేను, పత్తి చేన్లల్లో గంజాయి సాగు చేస్తుండటం సర్వసాధారణం. ఇక్కడ తనిఖీలకు వెళ్లే ఎక్సైజ్‌ సిబ్బందిపై గతంలో పలుమార్లు దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇటీవల ఎక్సైజ్‌కానిస్టేబుల్‌పై గంజాయి స్మగ్లర్లు కారుతో తొక్కించి హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీనితో ఎక్సైజ్‌ పోలీసులు తమ దాడుల్ని ముమ్మరం చేశారు. దానిలో భాగంగా పంచాగామ్‌ గ్రామంలో గంజాయి సాగు జరుగుతుందనే సమాచారం మేరకు డీటీఎఫ్‌ సీఐ దుబ్బాక శంకర్‌, ఎస్సైలు హన్మంతు, అనుదీప్‌, అంజిరెడ్డి, అరుణ జ్యోతి, శివకష్ణ, రాజేష్‌లు ఈ గ్రామంలో దాడులు చేశారు. అక్కడి దేవాలయ ప్రాంగణంలో బంతిపూల తోటలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్టు గుర్తించారు. నిందితుడు చాల కాలంగా సాగు చేసిన గంజాయిని ప్యాకెట్లుగా తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారనే విషయం విచారణలో వెల్లడయ్యింది. పంచాగామ్‌ గ్రామంలో శుక్రవారం డీటీఎఫ్‌ ఎక్సైజ్‌ సిబ్బంది చేసిన దాడుల్లో 685 గంజాయి మొక్కలు, 17.741 కేజీల గంజాయి, 0.897 గ్రాముల గంజాయి విత్తనాలు, రూ.30 వేల నగదు, గంజాయిని తూకం వేసి వేయింగ్‌ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.70 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. గురు మహారాజ్‌గా, గుడి పూజారిగా చెలామణి అవుతున్న అవుంటి నర్సయ్యకు భార్య చనిపోయింది.
ఇద్దరు అడ పిల్లలకు పెండ్లిండ్లు చేశాడు. అనంతరం కొంతకాలం ఒక ఆశ్రమంలోఉండి వచ్చి గ్రామంలో గుడి పూజారిగా అవతారం ఎత్తాడు. పూజ కోసం పూలు పెంచాల్సిన స్ధలంలో పూల మొక్కలతోపాటు గంజాయి మొక్కలు సాగు సాగు చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నర్సయ్యను ఆరెస్టు చేసి, ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలు, విత్తనాలను తదుపరి విచారణ కోసం నారాయణఖేడ్‌ ఎక్సైజ్‌స్టేషన్‌లో అప్పగించారు. గంజాయిని పట్టుకున్న డీటీఎఫ్‌ సిబ్బందిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ఖాసీం, మెదక్‌ డిప్యూటీ కమిషనర్‌ జే హరికిషన్‌, అసిస్టెంట్‌ కమిషన్‌ శ్రీనివాసరెడ్డి, ఈఎస్‌ నవీన్‌చంద్ర, ఏఈఎస్‌ మణెమ్మ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -