Saturday, January 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఆర్‌తో గుండెపోటు మరణాలు తగ్గించొచ్చు

సీపీఆర్‌తో గుండెపోటు మరణాలు తగ్గించొచ్చు

- Advertisement -

ప్రథమ చికిత్సకు ప్రాణాలను కాపాడే శక్తి
సీపీఆర్‌పై శిక్షణా కార్యక్రమంలో గడ్డం దయాకర్‌, హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేశ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సీపీఆర్‌ చేయడం ద్వారా గుండెపోటు మరణాలను తగ్గించొచ్చని సీపీఆర్‌ శిక్షకులు గడ్డం దయాకర్‌ చెప్పారు. ప్రథమ చికిత్సా పద్ధతుల గురించి అవగాహన ఉంటే కుటుంబ సభ్యులను, స్నేహితులను రక్షించుకోవచ్చుననీ, డాక్టర్‌ దగ్గరికి చేరేలోపు ఒక ప్రాణాన్ని కాపాడే శక్తి ప్రథమ చికిత్సకు ఉంటుందని తెలిపారు. శుక్రవారం సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో సయాన్‌ క్యాన్సర్‌ క్లినిక్‌ ఆధ్వర్యంలో సీపీఆర్‌, ఇతర ప్రాథమిక చికిత్సలపై జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్‌ మాట్లాడుతూ…అత్యవసర పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులు కూడా ఇతరుల ప్రాణాలు ఎలా కాపాడవచ్చునో స్పష్టంగా వివరించారు. ఔత్సాహిక జర్నలిస్టులు, వారి పిల్లలతో సీపీఆర్‌ డిమానిస్ట్రేట్‌ చేయించారు. గొంతులో ఏదైనా ఇరుక్కుపోవడం, నీటిలో మునగడం, రక్తస్రావాన్ని ఆపడం, ఎముకలు విరగడం, కాలిన గాయాలు, మూర్ఛ-ఫిట్స్‌, అపస్మారకం, విద్యుత్‌ షాక్‌, కంటి గాయాలు, ముక్కు నుంచి రక్తం కారడం వంటి సందర్భాల్లో అందించాల్సిన ప్రాథమిక చికిత్సల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి రమేశ్‌ వరికుప్పల మాట్లాడుతూ..ప్రతి ఒక్క జర్నలిస్టుకు కూడా ప్రథమ చికిత్సలపై కనీస అవగాహన అవసరమని ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రాథమిక అవగాహన ఉంటే కుటుంబ సభ్యుల ప్రాణాలే కాకుండా, తమ చుట్టూ ఉండే వాళ్ల ప్రాణాలు కూడా కాపాడగలుగుతారని తెలిపారు. ప్రెస్‌ క్లబ్‌ను కేవలం సమావేశాల వేదికగా కాకుండా, ఆరోగ్య అవగాహనకు కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రెస్‌క్లబ్‌ ఈసీ మెంబర్‌ రచన ముడుంబైని ఆయన అభినందించారు. ప్రెస్‌క్లబ్‌ కోశాధికారి రమేశ్‌ వైట్ల మాట్లాడుతూ.. ప్రథమ చికిత్సలపై అవగాహన అనేది కేవలం శిక్షణ మాత్రమే కాదనీ, సామాజిక బాధ్యత అని చెప్పారు. అవగాహన కల్పించిన దయాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ సంయుక్త కార్యదర్శులు చిలుకూరి హరిప్రసాద్‌, బాపూరావు, ఈసీ మెంబర్‌ అమిత్‌ భట్టు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -