Saturday, January 31, 2026
E-PAPER
Homeజాతీయంమహిళలకు మద్దతిచ్చేనా..?

మహిళలకు మద్దతిచ్చేనా..?

- Advertisement -

పారిశ్రామికవేత్తలుగా వృద్ధి చెందేలా నిర్ణయాలుండాలి
హామీలు ప్రకటనలకే పరిమితం కావొద్దు
ఎంఎస్‌ఎంఈలకు సహకారం అందించాలి
మహిళలకు రుణపరిమితిని పెంచాలి
ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
పన్ను రాయితీలు కల్పించాలి.. సామాజిక అడ్డంకులు తొలగించాలి
సాంకేతికత, ఇతర నైపుణ్యాలను కల్పించాలి
ఈ సారి బడ్జెట్‌లో ఇవి ప్రతిబింబించాలి
మహిళా పారిశ్రామికవేత్తలు, నిపుణులు

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ 2026కు కొన్ని గంటల సమయమే మిగిలి ఉన్నది. ఈ సారి కూడా ఇది హామీల బడ్జెట్‌గానే మిగలనున్నదా? లేక నిజంగా మహిళా వ్యాపారవేత్తలను దేశ ఆర్థిక వృద్ధిలో కీలక భాగస్వాములుగా మార్చే బడ్జెట్‌గా నిలవనున్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని మహిళల సంక్షేమానికి, పలు రంగాల్లో వారి వ్యాపారాల అభివృద్ధికి బడ్జెట్‌లో పలు సూచనలు చేస్తున్నారు నిపుణులు. కేంద్రం ప్రకటనలు నీటి మీద రాతల్లా కాకుండా.. వారి వ్యాపారాలను విస్తరించేందుకు మద్దతు ఇచ్చే విధానాలను ప్రభుత్వం తీసుకురావాలని పలువురు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆశిస్తున్నారు. రుణ సౌలభ్యం, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, మార్కెట్‌ యాక్సెస్‌ వంటి అంశాల్లో బడ్జెట్‌లో స్పష్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మహిళా వ్యాపారులు బడ్జెట్‌లో ఎంఎస్‌ఎంఈ రంగానికి అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకురావాలని చెప్తున్నారు. భారతీయ యువ శక్తి ట్రస్ట్‌ (బీవైఎస్‌టీ) వ్యవస్థాపక, మేనేజింగ్‌ ట్రస్టీ లక్ష్మీ వెంకటరమణ్‌ వెంకటేశన్‌ మాట్లాడుతూ… గత బడ్జెట్‌ స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు కల్పించిందని చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో ఎంఎస్‌ఎంఈలకు మరింత మద్దతు, పెట్టుబడి, టర్నోవర్‌ పరిమితుల పెంపు, క్రెడిట్‌ గ్యారంటీ పరిమితిని రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పెంచడం, స్టార్టప్‌లు, ఎగుమతిదారులకు అధిక కాల రుణాలు వంటివి పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు మరింత ఊతం లభిస్తుందని వివరిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారులపై దృష్టి పెట్టాలి
పారిశ్రామిక రంగంలో మహిళలకు అవకాశాలు ఆశించినంతగా లేవు. ఇక అందులోనూ ఎస్సీ, ఎస్టీ మహిళల వాటా చాలా తక్కువ. ఈ బడ్జెట్‌లో వీరిపై దృష్టిని సారించాలనీ, వారికి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ తొలి తరం మహిళా వ్యాపారవేత్తలకు రుణాలు అందిస్తామని చెప్పినా.. బ్యాంకింగ్‌ వ్యవస్థలోని కఠిన నిబంధనలు ఇప్పటికే పెద్ద అడ్డంకిగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.

మహిళలు చిన్న వ్యాపారాలకే పరిమితం కావాలని అనుకోవడం లేదని అంటున్నారు. భారత్‌లోని ప్రముఖ వ్యాపార సంఘం పీహెచ్‌డీసీసీఐ మహిళా వ్యాపారుల ప్రతినిధి బృందం ప్రకారం… ప్రస్తుత తరం మహిళలు స్టార్టప్‌ స్థాయిలోనే కాకుండా.. పెద్ద పరిశ్రమలు నిర్మించాలనీ, ఉపాధి అవకాశాలు సృష్టించాలని, పారిశ్రామిక వృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. దీనికోసం మహిళలు అధికంగా పని చేస్తున్న రంగాలను గుర్తించి, ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని మహిళలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లక్షల ఉద్యోగాలు సృష్టించే సామర్థ్యం ఉన్న మహిళా నేతృత్వంలోని సంస్థలకు అవసరమైన రంగాలవారీ ప్రోత్సాహకాలు ఇప్పటికీ లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాంకేతికత, భవిష్యత్‌ నైపుణ్యాలపై దృష్టి
బడ్జెట్‌ 2026లో మహిళలకు ఆధునిక సాంకేతిక రంగాల్లో మద్దతు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), డీప్‌టెక్‌ రంగాల్లో మహిళల కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు, పాలిటెక్నిక్‌లు, మహిళా కళాశాలల విద్యార్థినులకు ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌, ఇంక్యుబేషన్‌ సదు పాయాలు, స్టెమ్‌, భవిష్యత్‌ నైపుణ్యాల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు వంటి విషయాలపై దృష్టిని పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

సామాజిక అడ్డంకులు, చిన్న పట్టణాల్లో సవాళ్లు
భారత్‌ వంటి దేశంలో సామాజిక అడ్డంకులు అతిపెద్ద సమస్యగా పరిణమించాయి. ముఖ్యంగా, టైర్‌-3, టైర్‌-4 పట్టణాల్లో మహిళలు ఇంకా సామాజిక పరిమితులను ఎదుర్కొంటున్నారని పీహెచ్‌డీసీసీఐ పేర్కొన్నది. మహిళా విద్య, ఉపాధిపై అవగాహన కార్యక్రమాలు, కుటుంబ, సమాజ మద్దతు పెంచే ప్రచారాలు, తక్కువ ఖర్చుతో సాంకేతిక సదుపాయాలు పొందేందుకు సామూహిక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అలా చేస్తే మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక రుగ్మతలను రూపమాపవచ్చని అంటున్నారు.

పన్ను రాయితీలు, ఆరోగ్య సంరక్షణపై డిమాండ్‌
మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు నిపుణులు ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తున్నారు. మహిళల నేతృత్వంలోని సంస్థల నుంచి కొనుగోళ్లపై పన్ను రాయితీలు, స్వయం సహాయక గ్రూపులు (ఎస్‌హెచ్‌జీ) ఆధారిత ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడం, కొనుగోళ్లు అధికంగా జరపడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇక మహిళల ఆరోగ్యం విషయంలోనూ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలతో ముందుకు రావాలని వారు సూచిస్తున్నారు.

మహిళా ఉద్యోగుల కోసం క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, నివారక ఆరోగ్య సేవలతో కూడిన వర్క్‌ ప్లేస్‌ హెల్త్‌ స్కీమ్స్‌ వంటివి బడ్జెట్‌లో ఉండాలని మహిళలు కోరుతున్నారు. మొత్తంగా మహిళా వ్యాపారులు ఈసారి బడ్జెట్‌ నుంచి చాలా కోరుకుంటున్నారు. తమ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధానాలను ఆశిస్తున్నారు. సరైన రుణాలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక మద్దతు, సామాజిక మార్పు కలిస్తే భారత ఆర్థిక వృద్ధిలో మహిళల పాత్ర మరింత పెరుగుతుందని వారు విశ్వసిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -