Saturday, January 31, 2026
E-PAPER
Homeజాతీయంఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెకు జోరుగా సన్నాహాలు

ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెకు జోరుగా సన్నాహాలు

- Advertisement -

ఈ సమ్మె చారిత్రాత్మకం కానుంది : సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుదీప్‌ దత్తా,ఎలమారం కరీం
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సన్నాహాలు గతంలో కంటే మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయని సీఐటీయూ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుదీప్‌ దత్తా, ఎలమారం కరీం అన్నారు. శుక్రవారం ఢిల్లీ సీఐటీయూ కేంద్ర కార్యాలయం (బీటీఆర్‌ భవన్‌)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ ఉపాధ్యక్షులు తపన్‌ సేన్‌ తో కలిసి సుదీప్‌ దత్తా, ఎలమారం కరీం మాట్లాడారు. కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ సమ్మె విజయవంతానికి అందరూ పని చేయాలని పిలుపు ఇచ్చారు. సన్నాహాలలో భాగంగా రాష్ట్ర స్థాయి సమావేశాలు, యూనిట్‌ సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు. సమ్మె రోజున, సీఐటీయూ 2,000 కేంద్రాలలో ఉమ్మడి సమావేశాలను నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి ఉమ్మడి సమావేశంలో కనీసం 2,000 మంది పాల్గొంటారని అన్నారు. సీఐటీయూలో భాగంగా లక్షలాది మంది కార్మికులు సమ్మె రోజున వీధుల్లోకి వస్తారని, ఇతర సంఘాలు కూడా ఇదే విధంగా కార్మికులను నిర్వహించడంతో సమ్మె చారిత్రాత్మకం కానుందని తెలిపారు. గత సార్వత్రిక సమ్మెలో ఈ సమ్మెలో లేవనెత్తిన ప్రధాన నినాదం నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవడమని అన్నారు. అలాగే ఆ డిమాండ్‌ తో పాటు వీబీ-జీఆర్‌ఏఎంజీ చట్టం, విద్యుత్‌ బిల్లు, సబ్‌-కి సురక్ష సబ్‌-కి బీమా చట్టం, వికసిత్‌ భారత్‌ శిక్ష అధిష్ఠాన్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. ఈ సమ్మెకు వందలాది రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. బ్యాంకింగ్‌, బీమా రంగాల్లో పనిచేసే వారు, రక్షణ రంగ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్‌ రంగ ఉద్యోగులు కూడా ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఈ సమ్మెతో దేశ కార్మిక వర్గం కొత్త ప్రతిఘటన యుగం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. జర్నలిస్టులు కూడా సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. జర్నలిస్టులు కూడా లేబర్‌ కోడ్ల బాధితులేనని, కేరళలోని మాధ్యమం, మంగళం వార్తాపత్రికల ఉద్యోగులు యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని ఎలమరం కరీం అన్నారు. కార్మిక కోడ్‌లు ”కఠినమైనవి, తిరోగమనమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవి” అని పేర్కొన్నారు. కర్నాటక ప్రభుత్వం ఈ ”కార్మిక వ్యతిరేక” కార్మిక కోడ్‌లను అమలు చేయడానికి కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. కర్నాటక ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన కార్మిక కోడ్‌ల కింద రూపొందించిన ముసాయిదా నియమాలను తీవ్రంగా విమర్శిం చారు. ఈ నియమాలను రూపొందిం చడంలో ”తొందరపడటం” ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ, దాని కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ జాతీయ స్థాయిలో ఇదే కార్మిక కోడ్‌లను వ్యతిరేకిస్తుందని గుర్తు చేశారు. పరిశ్రమల మందగమనానికి కార్మిక సంఘాలే కారణమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలను సీఐటీయూ నేతలు ఖండించారు. ఆ వ్యాఖ్యలను ”రాజ్యాంగ విరుద్ధం” అని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు నయా ఉదారవాద విధానాలను, మోడీ ప్రభుత్వ రాజకీయ, ఆర్థిక విధానాలను పోలి ఉన్నాయని విమర్శించారు. బెంగళూరులోని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌)లో 1,050 మందికి పైగా కార్మికులను ”చట్టవిరుద్ధంగా” తొలగించడంపై తక్షణ జోక్యం కోరుతూ ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాసినట్లు గుర్తు చేశారు. ఈ తొలగింపు అన్యాయమని పేర్కొన్నారు. గిగ్‌ కార్మికుల సమస్యలపై మాట్లాడుతూ డెలివరీ సమయాలను 10 నుండి 15 నిమిషాలకు పెంచడం వల్ల దోపిడీ, నియంత్రణ వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించలేవని అన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని, గహ ఆర్థిక ఆస్తులలో గణనీయమైన తగ్గుదల నమోదు అయిందని అన్నారు. మరోవైపు గహ రుణాలు పెరిగాయని పేర్కొంటూ ఇటీవలి విడుదల అయిన నివేదికలను ఉదహరించారు. అయితే టాప్‌ 1 శాతం కార్పొరేట్ల వాస్తవ ఆదాయం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే ఉద్యోగులు, కార్మికులు, అసంఘటిత రంగం కార్మికులు, తక్కువ ఆదాయ కుటుంబాలు ఎదుర్కొంటున్న రోజువారీ ఆర్థిక ఒత్తిడిని ప్రతిబింబించడం లేదని పేర్కొన్నారు. ఉపాధి నాణ్యత, భద్రతను విస్మరించిందని, తక్కువ జీతం, అసంఘటిత రంగ, సామాజిక భద్రత లేని ఉద్యోగాల వాటా పెరుగుతోందని కూడా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -