హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరరాబాద్
కన్న తల్లిదండ్రులు కాకుండా మూడో వ్యక్తి ద్వారా తీసుకున్న దత్తతకు చట్టబద్ధత ఉండదని హైకోర్టు తీర్పు చెప్పింది. శిశువుల అక్రమ రవాణా కేసు ఎదుర్కొంటున్న వ్యక్తి ద్వారా పసికందును దత్తత పొందిన వారికి ఆ చిన్నారిని అప్పగించాలని ఆదేశాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. దత్తత ప్రక్రియ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (సీఏఆర్‌ఏ) మార్గదర్శకాల ప్రకారం లేకపోతే చెల్లదని తీర్పు చెప్పింది. నల్లగొండ జిల్లాకు చెందిన వెంకన్న, స్రవంతి దంపతులకు సంతానం లేకపోవడంతో యాదగిరి అనే వ్యక్తి ద్వారా ఒక చిన్నారిని దత్తత తీసుకున్నారు. చిన్నారి పుట్టినరోజును కూడా ఘనంగా నిర్వహించారు. అయితే, పిల్లలను విక్రయిస్తున్నాడని యాదగిరిపై కేసు ఉండటంతో పోలీసులు చిన్నారిని తీసుకుని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. ఈ చర్యను సవాల్ చేస్తూ వెంకన్న హైకోర్టులో వేసిన పిటిషన్‌ను జస్టిస్ మాధవీదేవి విచారించారు.
చిన్నారిని పిటిషనర్లు చాలా ఆప్యాయంగా, ప్రేమగా కన్నబిడ్డగా చూసుకుంటున్నారనీ, వారికే ఆ చిన్నారిని అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రాపోలు భాస్కర్ వాదించారు. పిల్లలు లేకపోవడంతో అనాధ పిల్లల్లో ఒకరిని దత్తత ఇవ్వాలంటూ పిటిషనర్లు చేసుకున్న దరఖాస్తు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందనీ, ఈలోగా ఈ చిన్నారిని దత్తత తీసుకున్నారని వివరించారు. దీనిపై నల్లగొండ జిల్లా సంక్షేమ, బాలల పరిరక్షణ అధికారి తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, యాదగిరి పిల్లల అక్రమ రవాణా ముఠాలో సభ్యుడని, అనేక మంది నుంచి డబ్బులు తీసుకుని చిన్నారులను విక్రయించినట్టు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. ఈ మేరకు పోలీసుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, చిన్నారిని కన్న తల్లిదండ్రుల నుంచి కాకుండా, ప్రతిఫలం ఇచ్చి యాదగిరి ద్వారా దత్తత పొందినందున దత్తత చెల్లదని తీర్పు చెప్పారు. కాబట్టి పోలీసులు చిన్నారిని జిల్లా బాలల సంక్షేమ కమిటీకి అప్పగించడం సబబేనని తేల్చారు. పిటిషన్‌ను కొట్టేశారు.
మూడో వ్యక్తి ద్వారా దత్తతకు చట్టబద్ధత లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



