కేంద్రంలో కార్పొరేట్‌మనువాదీ ప్రభుత్వం..అన్ని వర్గాలపై దాడులకు బరితెగింపు
స్వత్రంత్ర, ఐక్య, సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి : ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే పిలుపు
గుంటూరులో ఏఐకేసీ సమావేశాలు ప్రారంభం
గుంటూరు : మోడీ ప్రభుత్వం అత్యుత్సాహంగా కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) మన వ్యవసాయ రంగాన్ని, రైతులను తీవ్రంగా దెబ్బతీస్తాయని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షులు అశోక్ ధావలే హెచ్చరించారు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఎఫ్‌టీఏలు జరిగాయని, అమెరికాతోనూ చర్చలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ సమరశీల, స్వతంత్ర, ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు మూడు రోజులపాటు జరిగే ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ (ఏఐకేసీ) సమావేశాలు శుక్రవారం టీటీడీ కళ్యాణమండపంలో అశోక్ ధావలే జెండా ఆవిష్కరణతో మొదలయ్యాయి. సీకేసీ, ఏఐకేసీ సభ్యులు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు అశోక్ ధావలే అధ్యక్షత వహించి ప్రారంభోపన్యాసం చేశారు… ‘మన వ్యవసాయరంగాన్ని ఎఫ్‌టీఏలు సవాల్ చేస్తున్నాయి. ఒప్పందాలు అమల్లోకొస్తే రైతుల, కార్మికుల, ప్రజల పరిస్థితి దిగజారుతుంది. వారి ఉనికికి పెను ముప్పు వాటిల్లుతుంది.’ అని ఆయన అన్నారు. ‘కార్పొరేట్, మతోన్మాద కలయికలో ఆర్‌ఎస్‌ఎస్ నడిపిస్తున్న మనువాది, సంప్రదాయ, ఆధిపత్యీయుల చేతుల్లోని బీజేపీ సర్కార్ కేంద్రంలో పాలన చేస్తూ అన్ని వర్గాలపై దాడులకు దిగింది. ‘ అని చెప్పారు.’ఎఫ్‌టీఏలతో అమెరికా, సామ్రాజ్యవాద దేశాలకు మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను తాకట్టుపెట్టింది. లేబర్ కోడ్స్‌తో కార్మికవర్గంపై, విద్యుత్ సవరణ బిల్లు తెచ్చి రైతులు, కార్మికులు, చిన్న పరిశ్రమలు, పేదలపై, ఉపాధి హామీ చట్టాన్ని మార్చడం ద్వారా గ్రామీణ కార్మికులపై, విత్తన చట్టంతో రైతులపై దాడి ఎక్కుపెట్టింది. మహిళలు, దళితులు, ఆదివాసీలను టార్గెట్‌గా చేసుకుంది. జనవరి 30 మహాత్మాగాంధీ వర్ధంతి. ఆయనకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్య్రోద్యమం నడిపిన, లౌకికవాదంపై నిలబడ్డ గాంధీని నాడు హిందూ మతోన్మాదులు హత్య చేయగా, నేడు మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరును తొలగించింది..’ అని అన్నారు.
నిరసనోద్యమాలు
అంతర్జాతీయంగా అమెరికా సామ్రాజ్యవాదం, మితవాదులు పెట్రేగిపోతుండగా, ఇదే సమయంలో ప్రతిఘటనోద్యమాలూ ఊపందుకుంటున్నాయని అశోక్ ధావలే వివరించారు… ‘దేశంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ కాలంలో నిరసనోద్యమాలు, వాటిల్లో పాల్గంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. జులై 9న దేశ వ్యాప్త కార్మిక, కర్షకుల హర్తాళ్, నవంబర్ 26 రైతు ఉద్యమం లక్షలు కోట్ల మందిని కదిలించి చరిత్ర సృష్టించాయి. లేబర్ కోడ్స్, పాత ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ ప్రధాన డిమాండ్లుగా ఫిబ్రవరి 12 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె చరిత్రాత్మకం కాబోతోంది. దేశ స్థాయితో పాటు రాష్ట్ర, జిల్లా, ఆ కింది స్థాయిల్లో పోరాటాలను ఏఐకేఎస్ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి నిధులివ్వకుండా, ఇబ్బంది పెడుతున్నా దేశానికి ప్రత్యామ్నాయం చూపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన ఏకైక రాష్ట్రంగా కేరళ నిలవడానికి ఎల్డీఎఫ్ విధానాలే కారణం…’ అని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల సవాల్
కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు మన ముందున్న అతిపెద్ద సవాల్ అని అశోక్ ధావలే చెప్పారు. రైతు అనుకూల ప్రభుత్వాల గెలుపు లక్ష్యంగా ఉండాలన్నారు. కోటి 53 లక్షల సభ్యత్వం కలిగిన ఏఐకేఎస్‌ను మరింతగా విస్తరించేందుకు, సంఘటితం చేసేందుకు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఏఐకేసీ సమావేశాల ఆహ్వానసంఘం చైర్మెన్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తొలుత మాట్లాడుతూ రైతాంగ పోరాటాలకు గుంటూరు జిల్లా పురిటిగడ్డన్నారు. ఏఐకేఎస్ వ్యవస్థాపకులలో ఒకరైన ఎన్‌జి రంగా ఇక్కడి వారేనని గుర్తు చేశారు. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. మరణించిన విఎస్ అచ్యుతానందన్, సురవరం సుధాకర్‌రెడ్డి తదితరులకు ఏఐకేసీ సమావేశం నివాళులర్పించింది. సంతాప తీర్మానాన్ని మనోజ్ కుమార్ ప్రతిపాదించగా సమావేశం ఆమోదించింది. సభా వేదికపై ఏఐకేఎస్ ఆఫీస్‌బేరర్లు అమ్రారాం, అవేదేశకుమార్, ఇంద్రజీత్‌సింగ్, వలసన్ పనోలి, రవీంద్రన్, టి సాగర్, కృష్ణప్రసాద్, రాష్ట్ర నాయకులు వి క్రిష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి, ఎం హరిబాబు ఆశీనులయ్యారు.
‘స్వేచ్ఛా’ ఒప్పందాలు సేద్యానికి ముప్పు
- Advertisement -
- Advertisement -



