నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో శనివారం నిర్వహించిన పల్లెబాట కార్యక్రమం సందర్భంగా గ్రామంలో నెలకొన్న వివిధ విద్యుత్ సమస్యలను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో పాతబడి శిథిలావస్థకు చేరుకున్న కరెంటు స్తంభాలు, లూస్ వైరింగ్, ట్రాన్స్ఫార్మర్ లోపాలు వంటి సమస్యలను గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కలిసి విద్యుత్ శాఖ ఏఈకి వివరించారు. సమస్యలపై వెంటనే స్పందించిన ఏఈ నూకల నర్సిరెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్‌కు బదులుగా హెవీ ట్రాన్స్ఫార్మర్‌ను తెప్పించి తక్షణమే అమర్చారు. దీంతో గ్రామ ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న విద్యుత్ ఇబ్బందులు తక్షణమే పరిష్కారమయ్యాయి.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏసి రెడ్డి మంజుల మహేందర్ రెడ్డి విద్యుత్ శాఖ ఏఈ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. గ్రామంలో మిగిలి ఉన్న ఇతర విద్యుత్ సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్ భైరపాక ఇసాక్,మార్పు జయేందర్, మేకల భాను గౌడ్ పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



