నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మండలంలోని జాతర్ల క్రీడా ప్రాంగణంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ 2026 క్రీడా పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు నిర్వహించనున్న ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్ పోటీలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య తో కలిసి మండల అధికారులు ప్రారంభించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పోటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు.
విద్యతో పాటు క్రీడలు సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. క్లస్టర్ స్థాయిలో ప్రతిభ కనబర్చిన తర్వాత మండల జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్యాంసుందర్, ఎంపిడిఓ శ్రీనివాస్, ఎంపీ ఓ మహేందర్ రెడ్డి, ఎంఈఓ రాంకిషన్, స్థానిక డాక్టర్ భీమ్రావు తదితరులు పాల్గొన్నారు.



