నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామం దురదృష్టం కొద్దీ అనారోగ్యం పాలై, ఇల్లు పూర్తి చేసుకోలేక ఇబ్బంది పడుతున్న ఒక నిరుపేద కుటుంబానికి గర్జనపల్లి గ్రామ ఉప సర్పంచ్ న్యాత మోహన్ అండగా నిలిచారు. గ్రామానికి చెందిన దోమకొండ భారతీ –పోచయ్య (55) కుటుంబానికి ప్రభుత్వ పథకం కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పోచయ్య రెండు కిడ్నీలు పాడై తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. వైద్య ఖర్చులకే డబ్బులు సరిపోకపోవడంతో, మొదలుపెట్టిన ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.
పోచయ్య కుమారుడు హర్షవర్ధన్ 5వ తరగతి చదువుతుండగా, కుమార్తె లహరి హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతోంది.ఈ దీనస్థితిని గమనించిన ఉప సర్పంచ్ న్యాత మోహన్, తన ఉదారతను చాటుకుంటూ ఇంటి నిర్మాణ పనుల కోసం 20 సిమెంట్ బస్తాలను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజు, వార్డు సభ్యులు గోవర్ధన్, నర్సయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజఎల్లయ్య, గ్రామస్తులు మల్లేశం, రాజు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
దాతలకు విజ్ఞప్తి:
అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ, ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్న ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం, ఇతర స్వచ్ఛంద సంస్థలు, దాతలు పెద్ద మనసుతో ఆదుకోవాలని ఈ సందర్భంగా గ్రామస్తులు వేడుకుంటున్నారు.



