Sunday, May 24, 2026
E-PAPER
Homeకథరిస్ట్‌ వాచ్‌

రిస్ట్‌ వాచ్‌

- Advertisement -

ఆకాశమే హద్దుగా మంచి సంకల్పంతో మనసంతా నిండుకున్న కోరికతో రాత్రంతా నిద్రపోయినా శ్రీనును లే.. నాయినా! తెల్లారింది.! నీవు బడికి వెళ్ళే ‘టైం’ అవుతుంది అంటూ శ్రీను వాళ్ళ అమ్మ రాజ్యలక్ష్మి నిద్ర లేపుతుంది..!
గాఢ నిద్రలో ఉన్న శ్రీను ఎక్కడో మూలన అమ్మ అన్న మాటలు చెవులకు వినపడి నెమ్మదిగా… కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు.
‘టైం’ మాటను వినగానే ఆలోచన మొదలైంది శ్రీనుకు..!
‘రిస్ట్‌ వాచ్‌’ కొనుక్కోవాలనే ఆశ మనసులో దృఢంగా నాటుకుపోయింది శ్రీనుకు..!
ఆలోచన మనసులో తిరుగుతుండగానే గబగబా లేచి స్నానం చేసి స్కూల్‌ డ్రెస్‌ వేసుకొని బడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు శ్రీను. రాత్రి మిగిలిన సద్దన్నంలో టొమాటో తొక్కు వేసుకొని తిని, మధ్యాహ్నానికి అమ్మ పెట్టిన సద్ది తీసుకొని, పుస్తకాల సంచిలో పెట్టుకొని బడికి బయలుదేరాడు.
శ్రీను దోస్తులతో కలిసి వాళ్ళ ఊరు సింగరాజుపల్లి నుండి ఆరు కిలోమీటర్లు దూరంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత ప్రభుత్వ పాఠశాల- దామెరకు ప్రతి దినం పొద్దుమాపు నడుస్తూ వెళ్ళి వచ్చేవాడు. బాట మాత్రం మట్టితో కంకర తేలి ఉండడం వల్ల తలవెంట్రుకలకు, మొహానికి మెత్తటి దుమ్ము, ధూళి పౌడర్‌ పూసుకున్నట్టు పట్టేది. తొందర తొందరగా నడువు ‘టైం’ అవుతుంది అంటూ తన సోపతిగాడు రవి పురమాయించాడు శ్రీనును.
మళ్లీ ఆలోచనలో పడి నడుస్తూ నడుస్తూ ఆగిపోయాడు శ్రీను..!
”ఒరేరు ఏమైందిరా నీకు..! వెనకాలే ఆగిపోయావు ఎందుకు?” అడిగాడు రవి.!
టకామని తేరుకొని…! ”ఏం లేదురా…!” అంటూ ముందుకు సాగాడు శ్రీను.
దోస్తులతో కలిసి శ్రీను బడి ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. టన్‌ టన్‌ టన్‌ మంటూ రెండో బడి గంట మోగింది. అందరూ ఉరికి లైన్‌లో నిలబడడం మొదలుపెట్టారు. శ్రీను మాత్రం ఆలోచనలో మునిగిపోయాడు. ప్రార్థన ముగిసింది. తర్వాత ఎవరి క్లాస్‌కు వాళ్ళు వరుస క్రమంలో వెళ్ళారు.
మొదటి పీరియడ్‌లో సార్‌ వచ్చి కూర్చుని హాజరు తీసుకుంటున్నాడు. రూల్‌ నెంబర్‌ ఒకటి, రెండు, మూడు అని హాజరు తీసుకుంటున్నాడు ”రూల్‌ నెంబర్‌ పదిహేను… పదిహేను” పిలిచాడు సార్‌.
శ్రీను పలకలేదు. పక్కనే కూర్చున్న రవి నీదేరా… నీదేరా.. అంటూ చిన్నగా గిచ్చాడు. పరధ్యానంలో ఉన్న శ్రీను ”సార్‌….!” అంటూ చెయ్యి పైకెత్తి లేచాడు.
”ఏమైంది రా.. నీకు? వెధవ!” అంటూ తిట్ల పురాణం మొదలుపెట్టాడు సార్‌.
అలా చూస్తుండగానే ఏదో వినీ విననట్లు పీరియడు అయిపోయింది. రెండో పీరియడ్‌ తెలుగును బోధించే జనార్ధన్‌ సార్‌ వచ్చాడు.
అప్పటిదాకా ఏదో ఆలోచనలో ఉన్న శ్రీను తెలుగు సార్ను చూడగానే ఏదో తెలియని ఉత్సాహం..!
సార్‌ ‘భగీరథ ప్రయత్నం’ పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. పద్యాన్ని రాగయుక్తంగా చదువుతుంటే. శ్రీను చెవులకు వినసొంపుగా అనిపించి శ్రద్ధగా వినేవాడు. ఏ క్లాస్‌ విన్నా వినకపోయినా అమతం వంటి తెలుగు మాత్రం ఆసక్తితో శ్రద్ధగా వినేవాడు శ్రీను. ఇలా నాలుగు పీరియడ్ల తర్వాత మధ్యాహ్నం భోజన సమయం అయింది. దోస్తులతో కలిసి బడి పక్కన ఉన్న బోరింగ్‌ దగ్గరికి వెళ్లారు. బోరింగే బడి పిల్లలందరికీ దాహార్తిని తీర్చే ఊట చెలిమే అయ్యేది. బోరింగ్‌ చుట్టూరా అందరూ కూర్చొని తెచ్చుకున్న అన్నం బాక్సులను తెరుచుకొని తినడం మొదలుపెట్టారు.
ఇంతలో రవి ”ఒరేరు నీ చేతి గడియారం బాగుంది రా…” ఎంత అయింది? అని పక్కనే ఉన్న కన్నయ్యను అడిగాడు.
”ఇది మా నాన్న కొనిచ్చాడు రా..! 200 రూపాయలు అయింది” అన్నాడు కన్నయ్య.
అది గమనిస్తున్న శ్రీను మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. వీడికి వాచ్‌ విషయం చెప్తే చాలు..! మూగవాడిలా కదలని రాయిలా మారిపోతున్నాడు అన్నాడు రవి.
”ఎందుకు..? అలా అవుతున్నావ్‌ శ్రీను?” అడిగాడు కన్నయ్య..!
”ఏం లేదురా..! ‘వాచ్‌’ కొనుక్కొని చేతికి పెట్టుకోవాలని ఎప్పటినుండో నా మనసులో నాటుకుపోయిన బలమైన కోరిక రా..!” అన్నాడు శ్రీను.
అయితే కొనుక్కోరా.. అన్నారు రవి, కన్నయ్య.
”కొనుక్కుందామంటే నా చేతిలో డబ్బులు లేవు రా…! మరోవైపు రెక్కాడితే కానీ డొక్కాడని డొల్ల బతుకులు మా కుటుంబంలో పరిస్థితులు. అమ్మ, నాన్న.. అన్నయ్యలు, అక్కయ్యలు అందరూ కష్టపడితేనే కుటుంబ పోషణ జరుగుతుంది. అంటూ చెబుతుండగానే బడిగంట మోగింది. అందరూ గబగబా లేచి చేతులు కడుక్కొని కడుపునిండా మంచినీళ్లు తాగి, బాక్సులను పట్టుకొని, క్లాసులో కూర్చున్నారు. ఆ రోజు క్లాసులు అయిపోయాక మళ్ళీ తిరిగి బడి నుండి ఇంటికి బయలుదేరారు. దోస్తులందరూ కలిసి ఊరిలోకీ చేరుకునేసరికి పొద్దుపోయింది.
చేతి గడియారం ఎలా కొనుక్కోవాలో అనే ఆలోచనతో ఇంటికి వెళ్ళిన శ్రీనును చూసి వాళ్ళమ్మ ”ఏంది నాయినా..! ముఖం ఏదోలా ఉంద”ని అడిగింది.!
”ఏం లేదమ్మా” అంటూ… కొంచెం భయం భయంగా ”నా..కు చేతి గడియారం” కావాల”ని అడిగాడు.
అమ్మకు వెంటనే కోపం వచ్చి ”వెధవకాన.. బుద్ధి లేదు! సక్కగా బడికిపోయి రమ్మంటే పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నావా” అంటూ గదిరించింది.
”అది కాదమ్మా…” అంటుండగానే… ”నువ్వు నాకేం చెప్పద్దు..!” అంటూ ఇంట్లోకి వెళ్ళింది అమ్మ.
శ్రీను ఆశలు అడియాశలు అయినవి. ఇంకేమి చేసేది లేక అలిగి అన్నం తినకుండా ఇంట్లోకి వెళ్లి కాళ్లు దగ్గరికి ముడుచుకొని మంచం మీద పడుకున్నాడు.
శ్రీను పడుకోవడం చూసిన మాతహదయం తల్లడిల్లుతుంది. అసలే కొడుకంటే గారాబం ఎక్కువ. మంచం మీద పడుకున్న శ్రీను దగ్గరికి వెళ్ళి.. ”మా అయ్యగాదు. లే..బిడ్డ! రాతిరిపూట కూడు తింటే ఒంటికి పడతది” అంటూ లేపుతుంది.
”నాకు కూడు వద్దు.! ఏం వద్దు పో..!” తన్నుకొస్తున్న దుఃఖంతో ఏడుస్తున్నాడు శ్రీను.
”కాదు నాయనా! నా దగ్గర పైసలు లేవాయే. ఏం చేయమంటావు చెప్పు..! ఇంటిల్లిపాది కష్టపడితేనే తినటానికి ఇన్ని మెతుకులు దొరుకుతున్నాయి” పరిస్థితుల గురించి చెబుతూ… ”అయితే ఓపని చెయ్యి నాయనా..! నీ బడికి సెలవిచ్చినప్పుడల్లా కూలికిపోయి పైసలు కూడబెట్టుకో…. అలా రెండు నెలలు కష్టపడు. వచ్చిన పైసలతో నీకు నచ్చిన ‘చేతి గడియారం’ కొనుక్కోవచ్చు” అంది అమ్మ.
ఆ మాటలు వినగానే ఎక్కడలేని సంతోషంతో కన్నుల్లో నీళ్ళను తుడుచుకుంటూ లేచి కూర్చున్నాడు. అమ్మ తెచ్చిన బువ్వను ఆప్యాయంగా కలిపి నోట్లో పెట్టడం.. అమ్మ మమకారాన్ని బువ్వ ముద్దలతో తిన్నాడు శ్రీను. ఆ రాత్రి అమ్మ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఎప్పుడెప్పుడు కూలి పనికి వెళ్దామా..! అనే ఆలోచనతో నిద్రలోకి జారుకున్నాడు.
తెల్లవారితే ఆదివారం కూలికి పోవాలనే ఉత్సాహంతో అమ్మతోపాటు పత్తి తీయడానికి కూలికి వెళ్ళాడు. కష్టపడితే వచ్చే ప్రతిఫలం విలువను, సమయం వెచ్చించి చేసేటువంటి పని విలువను శ్రమకోర్చి, కష్టించి తెలుసుకున్నాడు.
ఎట్టకేలకు శ్రీను రెండు, మూడు నెలలు కూలికి వెళ్ళి డబ్బులు కూడబెట్టుకున్నాడు. ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళ అన్నయ్యతో కలిసి వరంగల్‌ వెళ్లి ‘రిస్ట్‌ వాచ్‌’ కొనుక్కోవాలనే కలను నెరవేర్చుకున్నాడు.
ఏదేమైనా ఆశయం ముందు ఏ పనైనా చిన్నది గానే తోస్తుంది.
శ్రీను వాచ్‌ కొనుక్కోవడంతో పెను మార్పులు చోటు చేసుకున్నాయి సమయానుకూలతను పాటిస్తూ.. చెయ్యాల్సిన పనుల్లో నిబద్ధతతో సమయాన్ని పాటిస్తూ ఏవేవో కొత్త ఆలోచనలతో ముందుకు సాగాడు.

కొలిపాక శ్రీనివాస్‌, 9866514972

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -