నవతెలంగాణ – కంఠేశ్వర్
పాత్రికేయ రంగంలో మల్లెపూల నరేంద్ర చిరస్మరణీయుడని నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డి. సాయిలు అన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో స్వర్గీయ జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర 35వ వర్ధంతి స్మారక క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర నిజామాబాద్ గ్రామీణ విలేకరిగా వీధిలో చేరి అనేక గ్రామీణ సమస్యలను వెలికి తీసారని అన్నారు. సాంకేతిక పరంగా నాడు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో వార్తలు రావాలి అన్న పట్టుదలతో హైదరాబాద్ కు బైక్ పై వెళ్లి వార్తలు ఇచ్చి వచ్చేవారని అన్నారు.
కమిట్మెంట్తో పట్టుదలతో వార్తలు రాసి ఎన్నో గ్రామీణ సమస్యలు పరిష్కరించేలా కృషి చేశారని అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెతికి తీసేందుకు ఖో ఖో పోటీలు నిర్వహించేలా ఎక్కువ ప్రోత్సహించారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఆకస్మిక మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు నరేంద్ర ప్రతిభను తెలుసుకున్న నాటి యూనియన్ పెద్దలు స్మారక పోటీలు పెట్టడం జరుగుతుందన్నారు. ఇలా ఇప్పటివరకు 35 సంవత్సరాల పాటు స్మారక పోటీలు నిర్వహించేదం జరిగిందన్నారు. 36వ వర్ధంతి పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు.
నేటి సమాజంలో జర్నలిజం వృత్తి కత్తి మీద సాములాగా తయారైందని, ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల పైన దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వర్గీయ జర్నలిస్ట్ మల్లెపూలు నరేంద్ర 1990 దశకంలో ఒకవైపు నక్సలైట్లు, మరోవైపు పోలీసులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సమయంలో అధికారులు వెళ్ళలేని గ్రామాలకు సైతం తానే ఒంటరిగా వెళ్లి వారి సమస్యలను వెలికి తీసేవాడన్నారు. అలాంటి సందర్భంలో వార్త సేకరణకై వెళ్లి నక్సలైట్ల పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించడం చాలా బాధాకరమన్నారు. నరేంద్ర ను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది యువకులు పాత్రికేయ రంగానికి వచ్చారని గుర్తు చేశారు. ఒక వ్యక్తి మరణిస్తే సంవత్సరమో రెండు మూడు సంవత్సరాలో సంస్మరణ నిర్వహిస్తారని కానీ మల్లెపూల నరేంద్ర మరణించి 35 సంవత్సరాలు గడుస్తున్నా జిల్లా జర్నలిస్టులు అతనిని స్మరించుకోవడం అభినందనీయమన్నారు.
అటాక్స్ కమిటీ చైర్మన్ బొబ్బిలి నరసయ్య మాట్లాడుతూ ప్రస్తుతం కుటుంబంలో ఎవరైనా మరణిస్తే కన్నా తల్లిదండ్రులే కొద్దిరోజుల తర్వాత మర్చిపోతారని, అలాంటిది జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర మరణించి 35 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా ఆయనను గుర్తు పెట్టుకొని ఇలాంటి క్రీడలు నిర్వహించడం నిజామాబాద్ జర్నలిస్టులకు సాధ్యం అయింది అని అన్నారు. ఇలాంటి స్మారక పోటీలు ముందు ముందు కూడా నిర్వహించాలని తెలిపారు దీనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సుభాష్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నరేంద్ర అన్న జిల్లా గుర్తుంచుకునేలా ప్రెస్ క్లబ్ లో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసేందుకు కమిటీ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులకు నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, ప్రెస్ల్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సుభాష్, ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజ్‌కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొచ్చ రాజు, ఐజెయు జనరల్ సెక్రెటరీ అరవింద్ బాలాజీ, ఫెడరేషన్ జర్నలిస్టుల సంఘం జిల్లా కార్యదర్శి రామచందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు పాకాల నర్సింలు, జర్నలిస్ట్‌లు ఫోటో జర్నలిస్టలు, నగర జర్నలిస్టులో పాల్గొన్నారు.



