Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్త పాలకవర్గాలతో ఉపాధి ఊపందుకునేనా.?

కొత్త పాలకవర్గాలతో ఉపాధి ఊపందుకునేనా.?

- Advertisement -

రెండేళ్లుగా నత్తనడకన పనులు..
నవతెలంగాణ – మల్హర్ రావు

రెండేళ్లుగా గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గాలు లేక ఉపాధిహామీ పనులు నత్తనడకన కొనసాగాయి. ఇటీవల నూతన పాలకవర్గాలు ఎన్నికై పంచాయతీల్లో కొలువుదీరగా ప్రధానంగా ఉపాధిహామీ పనులు ఊపందుకునే అవ కాశముంది. ఈ పథకం కింద పనులు చేపడితే గ్రామాల్లోని నిరుపేద కూలీలకు ఉపాధి లభించడంతోపాటు వివిధ అభివృద్ధి పనులు పూర్తయ్యే అవకాశముంది. 2006లో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పూజ్య బాపు ఉపాధిహామీ పథకంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం ద్వారా పంచాయతీలకు వచ్చే నిధులను సరిగా వినియోగిస్తే మౌలిక వసతులు సమకూరనున్నాయి.మండలంలో మొత్తం జాబ్ కార్డులు8,495, కూలీలా సంఖ్య 18,873,యాక్టివ్ కూలీలు10,633 ఉన్నారు.

సుమారు 50 పనుల కోసం..
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా ఉపాధిహామీ కింద కూలీలతో గుంతలు తవ్వించి ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు రూ.12 వేల చొప్పున ప్రభుత్వ సాయమందుతోంది. పల్లె ప్రకృతి వనాలతో పాటు ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో వనమహోత్స వంలో భాగంగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించే అవకాశముంది. గుంతలు తవ్వడం నుంచి రక్షించడం వరకు అన్నింటికీ ఉపాధిహామీ నిధులే వినియోగిస్తుండటం తెలిసిందే. రైతుల పొలం గట్లపై,రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించే పనులు కూడా ఉపాధిహామీ ద్వారా చేపట్టవచ్చు. సామాజిక ఇంకుడుగుంతల కోసం ఉపాధిహామీ నిధులు మంజూరవు తాయి.సాగు భూముల వద్ద కందకాలు, రాతి కట్టల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తోంది.గ్రామాల్లో చెక్ డ్యాంలు, ఊటకుంటలు,చేపల చెరువుల నిర్మాణం,కాలువల్లో పూడికతీత పనులు కూడా ఈ నిధుల ద్వారానే చేపట్టే అవకాశముంది.

మైదానాల చదును, సామూహిక మరుగుదొడ్లు, పశువుల పాకలు, వైకుంఠధామాలు, డంప్యార్డుల నిర్మాణం, పంట కాలువల తవ్వ కాలు, సంతల ఏర్పాటు..ఇలా సుమారు 50 వరకు గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. వచ్చే ఏడాదిలో చేపట్టనున్న పనుల కోసం గ్రామసభల తీర్మానాలు పంపాల్సి ఉంటుంది.

పనుల్లో పారదర్శకత పెంచుతాం…ఎపిఓ హరీష్
రెండేళ్లుగా సర్పంచులు లేక ఉపాధిహామీ పనులపై గ్రామీణులకు అవగాహన కొరవడింది.ఇప్పటినుంచి గ్రామసభల ద్వారా అవగాహన కల్పించి చేపట్టనున్న పనులును గుర్తిస్తాం. జాబ్కార్డులున్న వారందరికీ పని కల్పిస్తాం.వచ్చే ఆర్థికసంవత్సరంలో పనుల్లో మరింత పారదర్శకత పెంచేందుకు కృషి చేస్తాం..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -