Sunday, February 1, 2026
E-PAPER
Homeమానవిసర్వైవర్ నుంచి పద్మశ్రీ వరకు

సర్వైవర్ నుంచి పద్మశ్రీ వరకు

- Advertisement -

అమ్మాయిలందరూ జీవితాన్ని సరదాగా గడిపే సమయంలో ఆమె బతుకు పోరాటం చేసింది. టీనేజ్‌లో 37 సర్జరీలు చేయించుకుంటూ ఆరేళ్లపాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. అలాంటి ఆమె నేడు మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ అవార్డును అందుకుంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ఆమే మంగళ కపూర్‌. దేశంలో మొదటి యాసిడ్‌ బాధితురాలిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నేడు విజేతగా నిలిచిన ఆమె స్ఫూర్తిదాయక జీవితం పరిచయం నేటి మానవిలో…

ఇక బతకలేనేమో, ఇక జీవిత ప్రయాణం ముగిసిపోయిందన్న తీవ్రమైన ఇబ్బందుల నుంచి బతికి బట్టకట్టడమే కాదు, అత్యంత ఉన్నతంగా ఎదిగిన ధీర మంగళ. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి అడ్డంకులూ మనల్ని అడ్డుకోలేవు అనడానికి ఈమె జీవితమే ఓ చక్కని ఉదాహరణ. ఉత్తరప్రదేశ్‌ వారణాసికి చెందిన ఈమెపై 1965లో యాసిడ్‌ దాడి జరిగింది. బట్టల వ్యాపారంలో ఉన్న అసూయ కారణంగా కొంతమంది ప్రత్యర్థులు రాత్రి రెండు గంటల సమయంలో ఈ దాడికి పాల్పడ్డారు. యాసిడ్‌ అంటే ఏంటో తెలియని 12 ఏండ్ల వయసులో ఆమె నరకం అనుభవించారు. అరేండ్లపాటు ఆస్పత్రికే పరిమితం అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 37 ఆపరేషన్లు చేయించుకోవల్సి వచ్చింది. అందమైన ముఖం అందవికారమైంది. మరోవైపు సమాజం సూటిపోటి మాటలు. దీంతో చదువు కొనసాగించలేకపోయారు.

హాస్పిటల్‌ చుట్టూ తిరిగుతూ..
12 ఏండ్ల వయసంటే సాధారణంగా ఈ వయసులో ఒక ఆడపిల్ల హాయిగా చదువుకుంటూ, స్నేహితులతో సరదాగా గడుపుతూ, కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాల్సిన రోజులవి. అలాంటివి ఈమె జీవితంలో ఏమీ లేకుండా పోయాయి. లేడి పిల్లల గెంతుతూ ఉండాల్సిన టీనేజ్‌లో బతకడం కోసం హాస్పిటల్స్‌ చుట్టూ తిరిగారు. తలచుకుంటూనే గుండె తరుక్కుపోతుంది కదా? ఇక ఆమె పరిస్థితి, ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. జీవితంలో ఊహించని నష్టాన్ని కళ్ళారా చూస్తూ తీవ్రమైన బాధను అనుభవించారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు
బయటకు వెళ్లినపుడు సూటిపోటి మాటలు, ఎక్కిరింతలు. స్కూల్లో పిల్లలు ఈమెను చూసి భయపడేవారు. ముక్కు లేనిదని వెక్కిరించేవారు. దీంతో చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని, వెనక్కి తిరిగితే మరింత బలహీనమవుతామని చెప్పే తండ్రి గుర్తుకు వచ్చి ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్నారు. మరింత ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయటం అలవాటు చేసుకున్నారు. తాను పోగొట్టుకున్న జీవితాన్ని తలచుకుంటూ కుంగిపోలేదు. పదిమంది మెచ్చుకునేలా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు.

సంగీతంపై మక్కుంతో
సంగీతంపై ఉన్న మక్కువతో ఇంట్లోను ఉండి సంగీతం నేర్చుకుంది. శాస్త్రీయసంగీతం నేర్చుకోవడం మామూలు విషయం కాదు. అయితే సరైన గురువు చేతిలో పడి వాళ్ళు చెప్పినట్టు ప్రాక్టీస్‌ చేస్తే గమకాలు ఒక స్ట్రీమ్‌ లైన్‌లో పడతాయి. లేదంటే మొత్తం సంగీతమే గందరగోళం అయిపోతుంది. అలా మంగళ మంచి గురువుల వద్ద నేర్చుకుంటూ సంగీతంలో రాణించారు. దూరవిద్యలో పీజీ, తర్వాత మెరిట్‌ స్కాలర్‌ షిప్‌తో బనారస్‌ మిందూ విశ్వవిద్యాలయంలో సంగీతం, కళల విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అక్కడే శాస్త్రీయ సంగీతంలో ప్రొఫెసర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు.

కాశీ లతా మంగేష్కర్‌
పిల్లలకు పాఠాలు చెబుతూనే కచేరీలు కూడా ప్రారంభించారు. మంగళ స్వరమధుర్యానికి అందరూ ముగ్ధులయ్యేవారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేవారు. దేశంలో ఆమె కార్యక్రమాలు నిర్వహించని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. సంగీత ప్రపంచంలో ఆమె గాత్రం ఎంతో ఆదరణ పొందింది. అటు టీచర్‌గా అనేక మంది విద్యార్థులకు సంగీత జ్ఞానాన్ని అందించారు. అందుకే ఆమెను ‘కాశీ లతా మంగేష్కర్‌’ అని కూడా పిలుస్తారు. ఆమె కృషికి, అంకిత భావానికి అనేక అవార్డులు ఆమెను వెదుక్కుంటూ వచ్చి వరించాయి. తరంగ్‌ ఫౌండేషన్‌ ఆమెకు ‘కాశీ లత’ బిరుదును ప్రదానం చేసింది. రాజ్యసభ ఆమెకు ‘రోల్‌ మోడల్‌’ అవార్డును ఇచ్చింది. తాజాగా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఆమె చేసిన సేవకు, స్ఫూర్తిదాయక పోరాట ప్రస్థానానికి గాను కళారంగంలో 2026 ఏడాదికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

సామాజిక సేవలోనూ…
మంగళ సంగీత విద్వాంసురాలు మాత్రమే కాదు, సామాజిక సేవలో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఉచితంగా విద్యార్థులకు సంగీతం నేర్పిస్తున్నారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నారు. 2018లో ‘సీరత్‌’ పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఇది మరాఠీలో ‘మంగళ’ మూవీగా జనవరి 17, 2025న విడుదలైంది. ఈ చిత్రం జీవితంలో ఆమె చేసిన పోరాటాలు, అందుకున్న విజయాలను ప్రేక్షకుల కండ్లకు కట్టినట్టు చూపిస్తుంది.

బాధపడుతూ కూర్చోవద్దు
జీవితం సంకెళ్ళు, ముళ్ళ మధ్యలో ఉండిపోతే అవి దాటి మళ్ళీ బతకడం కోసం పోరాటం చెయ్యాల్సి వస్తే ఇదిగో మంగళ లాంటి వారి ప్రయాణం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అంతే తిరిగి జీవితాన్ని గాడిలో పెట్టుకోవచ్చు. ఏదైనా సాధించవచ్చు. సర్వైవర్‌ నుండి స్కాలర్‌ దాకా వెళ్ళిన మంగళ కపూర్‌ రోజూ అద్దంలో తన మొహం చూసుకుని నిజంగా బాధపడుతూ కూర్చుంటే ఇవన్నీ సాధించేవారా? జరిగిన నష్టం తలుచుకుంటూ కూర్చుంటే అసలు బతికేవారా? భవిష్యత్‌ మీద నమ్మకంతో, ఆశతో లేకపోతే ఇవాళ పద్మశ్రీ దాకా వెళ్ళేవారా? మంచి మనసు, సాధించాలనే తపన ఉన్న హృదయం, మంచి వ్యక్తిత్వం బాహ్య సౌందర్యాన్ని మించిన ఎవరెస్ట్‌ లాంటిది. వ్యక్తి శక్తిగా మారాలంటే సంకల్పంతో పాటు గట్టి పట్టుదల కావాలి. అందుకు మంగళకపూర్‌ నిదర్శనం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -