కాలింగ్ బెల్ విని ‘వస్తున్నా’ అంటూ తలుపు తీసిన మీనాక్షి. ఎదురుగా నిలబడిన కూతుర్ని చూసి, బాధ, కోపం, సంతోషం, మూడు భావాలు ఒకేసారి కమ్ముకోగా, అప్రయత్నంగా చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ నేల మీద కూలబడింది. పక్కనే ఉన్న సోఫాను ఆసరా కోసమా అన్నట్లుగా ఆనుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది.
కాలింగ్ బెల్ శబ్దం విని ”ఎవరూ” అంటూ హాల్లోకి వచ్చిన కుమార్, ఎదురుగా గుమ్మం బయట సూట్‌కేస్‌తో నిలబడిన కూతురు వైష్ణవిని చూసి, ఒక్క క్షణం షాక్ అయి నిలబడిపోయాడు. వెంటనే తేరుకొని ”రామ్మా వైషూ! రా” అంటూ భార్య వైపు చూస్తూ ”మీనాక్షిలే ఏంటి ఏడుపు? వైషూ వచ్చింది చూడు” అంటూ భార్యను లేవదీసి, వైష్ణవి పక్కన ఉన్న సూట్ కేస్ అందుకొని ”రారా” అంటూ కూతురు చేయి పట్టి లోపలికి తీసుకువెళ్లాడు.
తండ్రి చేయి తగలగానే అప్పటివరకు కూడగట్టుకుని ఉన్న ధైర్యం కరిగిపోయి, నాన్న అంటూ, తండ్రిని పట్టుకుని పెద్దగా ఏడ్చేసింది. కూతురు ఏడుపు చూసి తట్టుకోలేక తండ్రిని పట్టుకుని ఉన్న వైష్ణవిని వెనక నుండి పట్టుకుని ఏడ్చేసింది మీనాక్షి. తల్లి స్పర్శ తగలగానే ఏడుపు ఇంకా పెద్దదై తండ్రిని వదిలి తల్లిని పట్టుకుని ఏడవ సాగింది వైష్ణవి.
కుమార్ వీధి గుమ్మం తలుపు వేసి, ఇద్దరినీ వైష్ణవి బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టి, తాను వంటింట్లోకి వెళ్లి ఫ్రిజ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకొని గబగబా మంచినీళ్లు తాగాడు. ఒకసారి దీర్ఘ శ్వాస తీసి వదిలి, వాటర్ బాటిల్ పట్టుకొని వైష్ణవి రూమ్‌లోకి వచ్చాడు.
అక్కడ ఒకళ్ళనొకళ్ళు గట్టిగా పట్టుకుని ఏడుస్తున్న తల్లి కూతుర్లను చూసి, ”మీనూ… నువ్వు కూడా ఏంటి చిన్న పిల్లలా? వైషు ఊరుకోమ్మా ఇదిగో ఇద్దరు మంచినీళ్లు తాగండి” అంటూ వాటర్ బాటిల్ అందించాడు.
కాసేపటికి తేరుకున్న వైష్ణవి, ”అమ్మా! నాన్నా! నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాను. మీ నమ్మకాన్ని వమ్ముచేసి, మిమ్మల్ని అవమానాల పాలు చేసినందుకు నాకు తగిన శిక్ష పడింది. చచ్చిపోదాం అనిపించింది కానీ, నాతోపాటు ఇప్పుడే ఊపిరి పోసుకుంటున్న నా కడుపులోని ప్రాణాన్ని చంపకోలేకపోయాను. అక్కడ ఉండలేక మీ దగ్గరికి వచ్చేసాను” అంటూ మళ్ళీ ఏడవ సాగింది.
ఆ మాటలు విన్న కుమార్, మీనాక్షి ఒకరి మొహాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు.
”వైష్ణవీ! అసలేమైందమ్మా! లోహిత్ అనే వ్యక్తిని ఇష్టపడ్డాను. కులాలు వేరు, ఆస్తుల తారతమ్యం ఉంది కాబట్టి, మీరు చెబితే ఒప్పుకోరు. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోతున్న. అతన్నే పెళ్లి చేసుకుంటాను. నాకోసం వెతకద్దు. నన్ను వెనక్కి తీసుకురావాలని మీరే ప్రయత్నం చేసినా నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఉత్తరం రాసిపెట్టి వెళ్ళావు కదా?
అది చూసి మీ నాన్న నేను ఎంత ఏడ్చామో. చుట్టాలు, తెలిసిన వాళ్ళు సూటిపోటి మాటలు అన్నా, ఎలాగోలా తట్టుకుని బతికేసాం. అవమానం ఓ పక్క, నువ్వు ఎలా ఉన్నావో అని బెంగ ఓ పక్క” అంది మీనాక్షి.
”మీనాక్షీ! ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? అసలే పిల్ల బాధలో ఉంటే,” అని వైష్ణవి వైపు తిరిగి ”అమ్మా! ఏమైందిరా? లోహిత్ నువ్వు ఏమైనా గొడవపడ్డారా? అసలు ఏం జరిగింది రా?” అని కూతురు తల మీద చేయి వేసి అనునయంగా అడిగాడు కుమార్.
”నాన్నా! నేను రోజు బైక్ మీద ఆఫీస్‌కి వెళ్ళేదానిని కదా! లోహిత్ నన్ను చూసి ఇష్టపడి ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టాడు. ప్రొఫైల్ బాగుందని యాక్సెప్ట్ చేశాను. మీరు చాలా బాగుంటారు. నేను రోజు చూస్తూ ఉంటాను అంటూ మెసేజ్‌లు మొదలుపెట్టాడు. మొదట్లో పట్టించుకోలేదు కానీ రాను రాను మిమ్మల్ని ఫలానా చోటు చూశాను, పలానా డ్రస్ వేసుకున్నారు కదా! అంటూ తెగ మెసేజ్‌లు చేస్తుంటే నాకు తెలియకుండానే ఆకర్షణకి లోనయ్యాను. వాడు చెప్పిన కబుర్లన్నీ నమ్మాను. రోజు ఆఫీసుకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు తప్పనిసరిగా బైక్ మీద ఫాలో అయ్యేవాడు. తెగ పొగిడేవాడు. వాడి మాయలో పడి మీరు తెచ్చిన సంబంధాలు అన్నింటికి ఏవో ఒక వంకలు పెట్టేదాన్ని.
కొన్నాళ్లకి రోజూ క్రికెట్ ఆడుతున్నావు డ్యూటీకి వెళ్లట్లేదేంటి? అని అడిగితే, ఆ పని నాకు నచ్చట్లేదు. కంపెనీలో లేబర్ పని. ఫోన్ వాడటానికి కూడా ఉండదు. అయినా క్రికెట్ మీద బెట్టింగులు వేసి ఆ డబ్బులు తేలిగ్గా సంపాదించేస్తా అని అన్నాడు.
నాకు అంతా గందరగోళంలా అనిపించినా, వాడి మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఏమీ వాదించలేకపోయాను. తప్పుగా కూడా అనిపించలేదు.
ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అని చెబితే నాతో వచ్చేయి, మనిద్దరం సంతోషంగా ఉందాం. మీకు, మాకు చాలా తేడా ఉంది. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు. చెప్పకుండా వచ్చేరు. కొన్నాళ్లయితే వాళ్లే ఒప్పుకుంటారు అంటే నిజమే అనిపించి ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాను.
మా ఆఫీస్‌లో వాళ్ల సాయంతో నేనే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని నా దగ్గర ఉన్న డబ్బులతో అవసరమైన సరుకులు సామాను అమర్చాను. ఒక్క నాలుగు రోజులు సంతోషంగా ఉన్నాం. ఐదో రోజు నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్లావని ఫోన్ చేస్తే, అమ్మకి ఫ్రెండ్ పెళ్లి అని అబద్ధం చెప్పి వచ్చా. రేపు వస్తా నువ్వు జాగ్రత్త అని సమాధానం చెప్పాడు.
అదేంటి మీ అమ్మగారికి చెప్పలేదా?అని అడిగితే, చెప్తే ఇంకేమన్నా ఉందా? చంపేస్తుంది. వీలు చూసుకుని చెప్తానులే. సరే తర్వాత మాట్లాడతా బారు అని ఫోన్ పెట్టేసాడు.
తర్వాత నుండి రోజూ కాకుండా, ఎప్పుడన్నా రావడం మొదలుపెట్టాడు.
ఉన్న కాసేపు కూడా బెట్టింగ్‌లో ఓడిపోయాను, అది కట్టడానికి అప్పు చేశాను. చీటీ వేసా. అది కట్టలేదు. టెండర్ తీసుకున్న, వాళ్లు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు అంటూ ఇలా బాధలు ఏకరు పెట్టేవాడు.
నాకు వీలైనంతగా డబ్బులు ఇచ్చేదాన్ని. వాడి ఫోన్ రీఛార్జి కూడా చేసేదాన్ని నాన్నా. ఒక్కరోజు కూడా ఇంట్లోకి తన డబ్బులతో ఏమీ తేలేదు. నేను డబ్బులు ఇస్తే తెచ్చి పెట్టేవాడు. అదైనా అతను వస్తే, వచ్చినప్పుడు తేవాలనిపిస్తే. ఎనిమిది నెలల్లో నాకు ఒక్క మూర మల్లెపూలు కూడా కొనిపెట్టలేదు.
నేను ఒక్కదాన్నే ఉండలేకపోతున్నా అని కానీ, ఇంట్లో ఇబ్బందులు ఏమైనా చెప్పబోతే, మధ్యలోనే ఆపేసి, నీకేంటి ఉద్యోగం ఉంది. బోలెడు జీతం వస్తుంది. నాకేముంది? బోలెడన్ని అప్పులు ఉన్నాయి. ఫ్రెండ్స్ దగ్గర కూడా అప్పులు చేసా. అమ్మ ‘డబ్బులు ఇంట్లో ఇవ్వట్లేదు ఏం చేస్తున్నావ్? అని తిడుతోంది’ అంటూ మళ్ళీ మొదలు పెట్టేవాడు.
ఎప్పుడైనా ఒంట్లో బాగోలేదని ఫోన్ చేస్తే ‘అవునా జాగ్రత్త రెస్ట్ తీసుకో’ అని ఫోన్ పెట్టేసేవాడు.
ఎన్ని రోజులైనా, మళ్లీ నేను ఫోన్ చేస్తేనే, మాట్లాడేవాడు. ‘ఎలా ఉందని’ ఫోన్ కూడా చేసేవాడు కాదు. అదేంటి అని అడిగితే ‘నీకు తోడుగా ఉండాల్సిన సమయంలో నీ దగ్గర లేకుండా బాధపెట్టా కదా, మొహం చెల్లక రాలేదు’ అనేవాడు తప్ప, ‘ఏమైనా ఇబ్బంది అయిందా? ఎలా ఉన్నావ్? ఏం చేసావ్?’ అని మాట వరసకు కూడా అడిగేవాడు కాదు.
ఎప్పుడైనా గట్టిగా నిలదీస్తే ‘నిజమే సుఖంగా ఉండే నీ జీవితంలోకి వచ్చి నిన్ను కష్టాలు పాలు చేసా’ అంటూ మాట్లాడటం, రావటం తగ్గించేసేవాడు.
కడుపుతో ఉన్నాను అని తెలిసిన దగ్గర నుంచి అస్సలు రావటం, మాట్లాడటం మానేశాడు.
నేను ఫోన్ చేసి అదేంటని అడిగితే, ఇష్టమైతే ఫోన్ ఎత్తి ‘వస్తా వస్తా వచ్చి అన్ని తీరిగ్గా మాట్లాడుతా’ అంటాడు. లేకపోతే ‘ఇంట్లో ఉన్నా మళ్ళీ చేస్తా’ అనో, ‘మ్యాచ్‌లో ఉన్న’ అనో చెప్పి, ఫోన్ పెట్టేస్తాడు. అసలు నేను ఎందుకు ఫోన్ చేశాను? ఏదైనా అవసరమా? ఇబ్బందా? ఏమి కనుక్కోడు. మళ్లీ ఫోన్ కూడా చేయడు.
ఇంకా మారతాడు, ఇంకా మారతాడు అని ఎదురు చూసీచూపీ అలసిపోయాను, ఈ కడుపే లేకపోతే చచ్చిపోయేదాన్ని” అంటూ మళ్ళీ బావురుమంది వైష్ణవి.
కుమార్, మీనాక్షి ఇద్దరు ఒక్క నిమిషం స్తబ్దుగా ఉండిపోయారు.
కూతురి ఏడుపు చూసి తేరుకున్న మీనాక్షి ”వైషూ! నీకు మేమున్నాం. జరిగిందేదో జరిగిపోయింది. ఈ కడుపు తీయించేసుకో. కొన్నాళ్ళు అయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. ఏడవకు” అంది.
”లేదు మీనాక్షి! కడుపు ఉంచుకోవడం, తీయించుకోవడం, వైషు ఇష్టం. ముందు మనం ఆ లోహిత్ మీద కేసు పెట్టాలి. వాడిని ఊచలు లెక్క పెట్టేలా చేయాలి. లేకపోతే వాడు ఇలాగే బలాదూర్లు తిరుగుతూ, మనమ్మాయి లాగా ఎందరో అమ్మాయిల బతుకులు నాశనం చేస్తాడు. వాడికి, వాడి లాగా గాలికి తిరుగుతూ అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలి. మన అదష్టం బాగుంది అందుకే మన అమ్మాయి మన ఇంటికి వచ్చింది. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేక, ఆత్మహత్య చేసుకునే అమ్మాయిలు ఎందరో” అని కూతురు వైపు తిరిగి, ”వైషూ! పదరా కేసు పెడదాం. నిన్ను ఇంత మానసిక క్షోభకు గురి చేసిన వాడికి శిక్ష పడేలా చేయాలి” అన్నాడు.
ఆ మాటలు విన్న వైష్ణవి కళ్ళు తుడుచుకుని ”పదండి నాన్న! వాడిని వదలొద్దు” అంటూ లేచి తండ్రి వెంట నడిచింది.
– శశి, 9553809850



