మనిషి జన్మతోనే నిజాయితీగా పుడతాడు. కాని పెరుగుతూ పెరుగుతూ పాత్రలు ధరించడం నేర్చుకుంటాడు. ముఖం ఒకటి, మనసు ఒకటి. ఇదే మన సమాజం నేర్పే మొదటి నాటకం. ఈ ప్రపంచం అసలే ఒక పెద్ద థియేటర్. వేదిక మన రోజవారీ జీవితం. పాత్రలు మన చుట్టూ ఉన్న మనుషులు. మనం? పాత్రలు మార్చుకుంటూ జీవించే నటులం. కానీ ఈ నాటకం ఒక విషాదం, ఎందుకంటే నటన ఎక్కువ, దర్మం తక్కువ. మనిషి ఇల్లు వదిలి బయటకు రావడం ఒక వేదిక పైకి అడుగుపెట్టడమే.
నిజంగా మంచి మనిషి కావడం కష్టం కాదు. కష్టం ఏమిటంటే మనిషిలా కనిపించడం. మన సమాజంలో నిజాయితీగా వుండడానికి ప్రోత్సాహం లేదు. కానీ మంచి ముఖంతో నకిలీ చిత్రం చూపించడానికి ఎంతో అభిమానం. ఎప్పుడూ ‘నువ్వు గొప్పవాడివే’ అని చెప్పే నటన, ‘ఎంతో బిజీ’ అని చెప్పే అహంకారం, ‘నీ కోసం ఎంత కష్టపడుతున్నాం’ అని చెప్పే అబద్దం ఇవి అన్నీ మనం రోజూ వేసుకునే పాత్రలు. ధర్మం కోసం మనిషి పాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ తప్పు దాచడానికి మాత్రం వంద పాత్రలు.
ఈ థియేటర్‌లో నిజం చెప్పడం ఒక పెద్ద తప్పు. నిజం చెప్పేవాళ్లను మనుషులు ఇష్టపడరు. ఎందుకంటే నిజం మనస్సుల మీదున్న ధూళిని కడుగుతుంది. చాలా మంది నటులను ఇష్టపడతారు, నిజాలను కాదు. అందుకే నిజం చెప్పేవాళ్లు ఒంటరిగా వుంటారు. నటులు జనంతో నిండిపోతారు. నిజం మాట్లాడినవాడు శత్రువవుతాడు. అబద్ధం నటించినవాడు నాయకుడవుతాడు. ఇది మన సమాజపు ఘోర అపహాస్యం.
ఇప్పటి మనుషులు భవిష్యత్తు కోసం కాదు, ఓపిక కోసం కాదు, గౌరవం కోసం కాదు, కేవలం ఇమేజ్ కోసం జీవిస్తున్నారు. ఫేస్‌బుక్ ఫొటోలు, వాట్సప్ స్టేటస్‌లు, రీల్స్‌లో నటనలు… ఇవి ఇప్పుడు మన వ్యక్తిత్వాలు. మనసు కాన్సర్‌లా కుళ్లుతున్నా విడుదల మాత్రం ‘నాకు అన్నీ బాగానే వున్నాయి’ అనే నటన ముఖానికి తప్ప ఏదీ నిజం కాదు.
నేటి కాలంలో దయ కూడా ఒక పాత్ర. సేవ కూడా ఒక లైట్లు వేసిన సీన్, ప్రేమ కూడా ఒక స్క్రిప్ట్. ఎవరైనా ఏడిస్తే ధైర్యం చెప్పడం కాదు, ‘వీడియో తీస్తే ఎక్కువ లైక్స్ వస్తాయి’ అనే లెక్క. ఎవరైనా పేదవాడిని చూసినా సహాయం చేయడం కాదు, మీడియాలో చూపిస్తే పేరు పడతుంది అనే కోరిక. ధర్మం ఇవన్నీ చూస్తూ నెమ్మదిగా మూర్చపోయింది.
మన పూర్వీకులు మాటల్లోనే కాదు మనసులో కూడా నిజాయితీగా వుండేవారు. వారు నటులు కాకపోయినా వారి మాటలే సత్యం. ఇప్పుడు పరిస్థితి విరుద్ధం. ప్రతి ఒక్కరూ నటులే. నిజం చూడగలిగిన ప్రేక్షకులు మాత్రం అరుదు. ప్రేక్షకులు లేకపోతే నాటకం ఆగిపోతుంది. కానీ మన సమాజంలో అబద్ధాలు, ముసుగులు ఏవీ ఆగడం లేదు. ప్రతి ఒక్కరూ మరొకరిని మోసం చేసే నటులుగా మారిపోయారు.
ఈ నాటక ప్రపంచంలో ఒకే ఒక్క పాత్ర నటించలేనిది ధర్మం. ధర్మం ముసుగు వేసుకోదు. ధర్మం తప్పుడు నటనం చేయదు. ధర్మం అసత్య మాటలు పలకదు. అందుకే ఈ నాట్యంలో అది అసలు సెట్ కాలేదు. అందుకే అది బతకలేదు.
ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప మనిషి ఎవరు? అతడే పాత్రలు మార్చుకోకుండా, మనసు ఏదైతే అదే ముఖంగా చూపగలిగినవాడు. అలాంటి మనుషులు అరుదు. కానీ వారు వుంటే సమాజం కొద్దిగా వెలుగుతో నిండుతుంది. ధర్మం కొద్దిగా శ్వాస తీసుకుంటుంది. నటనతో నిండిన ప్రపంచంలో నిజంగా వుండడం అసలు ధైర్యం.
డా|| సూర్యదేవర రామకష్ణ, 9490754169



