తిరుపతి లడ్డూలో నెయ్యికల్తీపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ నెల్లూరు ఎసిబి కోర్టుకు చార్జిషీట్ సమర్పించింది. ఏ కేసులోనైనా సరే దర్యాప్తు సంస్థ అభియోగాలు నమోదు చేసి నిందితుల పేర్లు ఇవ్వడంతో విచారణ ప్రక్రియ మొదలవుతుంది. కానీ, విచిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లడ్డూ నెయ్యి కల్తీకేసులో మాత్రం కథ మొదటికొచ్చింది. అప్పటికంటే తీవ్రంగా పరస్పరం తిట్టుకోవడాలు కొట్టుకోవడాల వరకూ వెళుతున్నది. సిబిఐ స్వయంగా విడుదల చేసిన పరీక్షా నివేదికను అంగీకరించబోమంటూ టీడీపీ, బీజేపీ, జనసేన అధికార కూటమి, దాన్ని బలపర్చే మీడియా సంస్థలూ, నేతలూ చిందులు తొక్కుతున్నారు. అసలు కల్తీ తీవ్రతమైన సిబిఐ వెల్లడించిన విస్త్రతాంశాలను వదిలేసి ఒక్క అంశమే తీసుకుని తాము విజేతలమైనట్టు గత పాలకపక్షం వైసీపీ రెచ్చిపోతున్నది.ఈ రెండు పార్టీల కుమ్ములాటల్లో రాజకీయ పాలనాంశాలన్నీ పక్కదోవ పట్టడం రోజూ చూస్తున్నదేగాని, ఇక్కడ సున్నితమైన మతభావనలు మనోభావాలుగా చెప్పేవి కూడా గందరగోళానికి గురవుతున్నాయి.
ఏపీలో ఎవరు అధికారంలో వున్నా మరో పాలక పక్షం తిరుమలలో అవినీతి గురించి మాట్లాడటం పరిపాటి. గతంలోనూ నిర్మాణాలు, పింక్ డైమండ్లు, ఆలయ భూములు, పూజా పద్ధతులు, నియామకాలతో సహా చాలా సమస్యలు వివాదమయ్యాయి. విభజన తర్వాత వైసీపీ, టీడీపీ రాజకీయ ఘర్షణ, జనసేనాని పవన్‌కళ్యాణ్ బీజేపీ తరహాలో సనాతన రాజకీయాలు ఎత్తుకోవడం ఈ పరిస్థితిని ఇంకా జటిలం చేసింది. అన్యమత ముప్పు, తిరుమల పవిత్రతను దెబ్బతీయడం వంటి ఆరోపణలు ముందుకొచ్చాయి. ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ముస్లిం రాజ్యంగా, ఏపీ క్రైస్తవ రాజ్యంగా మారిపోయాయని ట్వీట్ పెడితే పవన్ దాన్ని రీట్వీట్ చేశారు. 2024 మేలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి తొలిసారి తిరుమల సందర్శనలోనే అన్నీ ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు.ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా శ్యామలరావును నియమించారు.2024 జులై 6,12 తేదీల్లో తమిళనాడు ఎఆర్ డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్లలో నెయ్యి నాణ్యంగా లేదని నిర్ధారించినట్టు ఈఓ ఆ నెల 24న వెల్లడించారు. వనస్పతి అంటే మొక్కల నుంచి నెయ్యిని అందులో వాడినట్టు ఎన్‌డిడిబి పరీక్షల నివేదికలో తేలిందని ఆయన చెప్పారు. ఆ నెయ్యి టాంకర్లను వెనక్కు పంపేశామనీ, అసలు వాడలేదని కూడా స్పష్టీకరించారు.
అలా మొదలైంది..
అనూహ్యంగా ఆతర్వాత సెప్టెంబర్ పది ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను దెబ్బతీయడం కోసం లడ్డూకోసం ఉపయోగించే నెయ్యిలో ‘జంతువుల కొవ్వును వాడే పరిస్థితికి వచ్చారని’ ఆరోపించడంతో దుమారం చెలరేగింది. ఈఓ శ్యామలరావు మళ్లీ సెప్టెంబర్ 25న మాట్లాడుతూ పరీక్షలలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసినట్టు తేలిందని ప్రకటించడమే గాక టిటిడి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై ప్రభుత్వం సిట్‌ను నియమించడం, నెలాఖరుకల్లా సిట్ రంగంలోకి దిగి దర్యాప్తు మొదలెట్టడం జరిగిపోయాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపచారం జరిగిందంటూ ఉపవాసదీక్ష చేపట్టి, కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగి, లౌకికవాదులు ఒకవైపునే మాట్లాడరాదని దాడిచేశారు.
వీటన్నిటి మధ్యనా మాజీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి చంద్రబాబు నియమించిన సిట్‌తో కాకుండా సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏ దర్యాప్తు లేకుండా లడ్డూలో కొవ్వు కలిసిందని ఆరోపించి భక్తుల మనోభావాలను దెబ్బతీయడ మేమిటని తీవ్రంగా ఆ క్షేపించింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని హితవు చెప్పింది. ఈ లోగా బిఆర్‌నాయుడు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం, కొద్దిరోజుల తర్వాత తొక్కిసలాటలో భక్తులు మరణించడం, గోశాలలో ఆవుల మృతిపై వివాదం, ఇలా తిరుమల వివాదాలమయమైంది. ఈ కాలమంతటా తిరుమలతో పాటు ఇంకా వివిధ ఆలయాలలో తొక్కిసలాట మృతులు, పరకామణి వివాదం, మరణాలు ఇలా రకరకాల వివాదాలు కొనసాగుతూనే వచ్చాయి.
కల్తీ నిజం,కొవ్వు నిరాధారం
సిబిఐ మొత్తం పన్నెండు రాష్ట్రాలలో అనేక మందిని విచారించింది.ఫైళ్లు రికార్డులు తనిఖీ చేసింది. మాజీ చైర్మన్లు, ఈఓలను ప్రశ్నించింది. పదిహేను నెలల దర్యాప్తు తర్వాత ఛార్జిషీటులో ముప్తై ఆరు మందిని నిందితులుగా పేర్కొంది. ఉత్తరాఖండ్‌లోని బోలేబాబా డెయిరీ నడిపే విపుల్‌జైన్, పోమిల్ జైన్‌లను ప్రధాన కారకులుగా తేల్చింది. ఎఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ యజమానులు వారిద్వారా అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించింది. 2019-24 మధ్య జగన్ పాలనా కాలానికి సంబంధించి ఈ దర్యాప్తు సాగినా నిందితులలో పలువురు 2014-19 మధ్య టీడీపీ హాయంలోనూ, మళ్లీ ఇప్పుడు కూడా కొనసాగుతుండడటం విశేషం. మరింత పెద్ద విశేషమేమంటే ప్రస్తుత ఈఓ అనిల్ సింఘాల్ కూడా ఆ కోవలో వారే కావడం, శ్యామల రావును మార్చిన కూటమి సర్కారు ఆయననే తెచ్చి నియమించడం విశేషం. ఇప్పుడైతే సిట్ అనిల్ సింఘాల్, మాజీ ఈఓ ధర్మారెడ్డిపై చర్య తీసుకోవాలని లేఖ రాసిందంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి సహాయకుడిగా పనిచేసిన సన్న అప్పన్న తప్ప మరే రాజకీయ నాయకుల పేర్లు ఇప్పటికి పొందుపర్చలేదు. ఆ అప్పన్న కూడా ప్రస్తుత టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల దగ్గర పనిచేసిన వ్యక్తికావడం గమనించదగింది..
బోలేబాబా ద్వారా సరఫరాలు చేసిన మూడు సంస్థలూ అంతకుముందు సుదీర్ఘకాలం నుంచి చేస్తున్నవేనని మరో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అంటున్నారు. పరీక్ష చేసి నాణ్యతకు కితాబునిచ్చిన అధికారులు కూడా టీడీపీ హయాంలోనే వారేనని, కొందరు ఇప్పటికీ కీలక స్థానాల్లో కొనసాగుతున్నారని కొన్ని పేర్లు వెల్లడిస్తున్నారు. మొత్తమ్మీద రాజకీయంగా పాలకపార్టీలు ఏవైనా కొండమీద అవినీతి సాగుతున్నదని దీన్నిబట్టి తెలుస్తున్నది. టీడీపీ, వైసీపీలను మించి బీజేపీ, ఆరెస్సెస్, సంఘపరివార్ వారి అనుకూల ముఠాలు, మతశక్తులూ తిష్టవేసుకునే వుంటున్నారు గనక వారికి తెలియంది ఏమీ వుండే అవకాశం లేదు. అందుకే ఆ వ్యవస్థల ప్రక్షాళన కంటే కొవ్వు కలవడంతో మతం దెబ్బతిన్నదనే ప్రచారం అధికంగా నడిచింది.
నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని, అసలది నెయ్యి కాదని తేల్చిచెబుతూనే కొవ్వు కలిపారనడానికి ఆధారం లేదని కూడా సిబిఐ నిర్ధారించడం ప్రచారాలకు పెద్ద షాక్ నిచ్చింది. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డ్(ఎన్‌డిడిబి) 210వ పేజీలోనూ, నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ల(ఎన్‌డిఆర్‌ఐ)209వ పేజీలోనూ పొందుపర్చిన పరీక్షల నివేదికలను ఇందుకు సిబిఐ ఆధారంగా చేసుకుంది. పరిశీలించిన నమూనాలలో నిజమైన నెయ్యి చాలా తక్కువగా వుందనీ, పామాయిల్, పామ్‌స్ట్రెయిన్, ఇతర కృత్రిమ పదార్థాలు రసాయనాలు కలిపారని స్పష్టం చేసింది. కొవ్వు కలిపినట్టు చెప్పే అవకాశాలు దాదాపు లేవని, పందికొవ్వు మాత్రం కలిపిన ఛాయలు అసలే లేవని పేర్కొంది. భోలేబాబా డెయిరీ పాలు నెయ్యి సేకరించిన దాఖలాలేలేవనీ, మొత్తం కల్తీ కృత్రిమ నెయ్యి తతంగమేనని దీంతో స్పష్టమవుతున్నది.
తిట్లూ పూజలూ ఫ్లెక్సీలు…
తమాషా ఏమంటే ఈ నివేదిక తర్వాత కూటమి అత్యున్నత నేతల స్థాయిలో వ్యూహాత్మక మౌనం పాటించింది. మరింత అధ్యయనం చేసి స్పందించాలని ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో చెప్పినట్టు మీడియా నివేదించింది. కొంతమంది మాత్రం దాడి కొనసాగించారు. మంత్రి లోకేశ్ కొవ్వు ఆరోపణ పునరుద్ఘాటించగా జాతీయ మీడియా దాన్ని సిబిఐ ప్రవేశానికి ముందు వచ్చిన నివేదికగా కొట్టి పారేసింది. అసలు సిబిఐ పొందుపర్చిన పరీక్షలే సరిగా జరగలేదని టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకుంది. స్థానికంగా ఫ్లెక్సీలతో ప్రత్యర్థులపై ఆరోపణలు కొనసాగిస్తున్నది. వైసీపీ నేతలైతే జగన్‌తో సహా తమ తప్పేలేదనట్టు మాట్లాడుతున్నారు. ప్రాయశ్చిత్త హోమాలు, ఆలయ సందర్శనలు చేస్తున్నారు. ఫ్లెక్సీల పంచాయితీలు తిట్లస్థాయికి దిగజారుతున్నాయి. కొవ్వులేదన్నది నిజమే గానీ అసలు రసాయనాలు కలిపి నెయ్యి పేరిట రెండు వందల కోట్ల రూపాయల పైన సరఫరా చేయడం మాత్రం నిజం. అవినీతి అసమర్థతతో కొండపై అస్తవ్యస్త పరిస్థితి నిజం. కనుక వైసీపీ ఎదురుదాడికి అవకాశమే లేదు. ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి మరోసారి సుప్రీంకోర్టుకు వెళతానంటున్నారు.దాని ఫలితమేమిటో చూడాల్సి వుంది.
దక్షిణాది ఆలయ ఫార్ములా?
ఏపీలో ఈ వివాదం ఏమవుతుందనేది ఒకటైతే అసలు దక్షిణ భారతదేశంలో ఆలయాలను, క్షేత్రాలను ఆధారం చేసుకుని చొరబడేందుకు బీజేపీ నడుపుతున్న మత రాజకీయం మరింత తీవ్రమైంది. కేరళలోని శబరిమలలో ఏదో పేరిట చిచ్చుపెట్టేందుకు కుట్రలు పన్నుతూనే వున్నారు. నెయ్యి కొనుగోలుపై అక్కడా గగ్గోలు పెట్టబోయి వెనక్కుతగ్గారు. గత యూడీఎఫ్ హయాంలో అక్కడ ఆలయ ద్వార పాలకుల విగ్రహాలకున్న బంగారుతాపడం తగ్గిపోతే ఆ నింద ప్రస్తుత వామపక్ష ప్రభుత్వంపై రుద్దేందుకు విఫల యత్నం చేస్తున్నారు. తమిళనాడులో తిరుప్పరంకుండలం కొండమీద ఆలయదీపం వెలిగించాలనే వివాదంపై చిచ్చుపెట్టింది. దానిపై మదురై హైకోర్టు బెంచిలో జస్టిస్ స్వామినాథన్ దగ్గర సానుకూల ఉత్తర్వు రావడంతో రాజకీయ వివాదంగా మార్చింది. పవన్ కళ్యాణ్ ఆ జడ్జికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం కూడా ఇందులో భాగమే. ఆ జడ్జిని అభిశంసించాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో నోటీసు ఇవ్వాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ మురుగన్ భక్తుల సమ్మేళనంలో పాల్గొని కుహనా లౌకికవాదమంటూ దాడి చేశారు గానీ, అదే కేరళకు వచ్చేసరికి అయ్యప్ప భక్త సమ్మేళనం జరపరాదని పరివార్ శక్తులే అడ్డుపడ్డాయి.
ఎన్నికలకు ముందే అంతర్వేది రథం దగ్ధం నుంచి రామతీర్థం వరకూ అనేక ఆలయ వివాదాలతో రాజకీయ లబ్దికి బహిరంగంగానే విఫల యత్నాలు జరిగాయి. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బండి సంజయ్ హిందువులు ఓట్లేయాలని నేరుగా మత ప్రచారం చేస్తూ పవన్‌కళ్యాణ్‌ను కూడా అదేపనిగా పొగిడారు. కానీ, స్థానిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబోమంటున్నారు. హిందూత్వ సేనల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ ఇటీవల గణేష్ ఉత్సవ్ సభలో పాల్గొని విదేశీయులను తరిమేయాలంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఆ రంగరాజన్ కూడా తిరుపతి లడ్డూపై నిరాధార ప్రచారం చేయడం సరికాదని విమర్శించారు. సంఘ్ పరివార్ రకరకాల విన్యాసాలు దీన్ని బట్టి అర్థమవుతాయి. దక్షిణభారతంలో ఆ హిందూత్వ రాజకీయాల చొరబడకుండా చూడటం, అవకాశవాదంతో వారికి వత్తాసు పలికితే ఫలితాలు ఎలా వుండేది గ్రహించడం ప్రజాస్వామ్యవాదుల బాధ్యత. తిరుమల వ్యవహారాలపై సమగ్ర న్యాయ విచారణ వంటిది కూడా అవసరమే.
తెలకపల్లి రవి



