Sunday, February 1, 2026
E-PAPER
Homeసోపతిఇతరుల గురించి ఆలోచించకండి

ఇతరుల గురించి ఆలోచించకండి

- Advertisement -

ప్రపంచంలో అత్యంత విలువైన సంపద స్మశాన భూమిలో మూడు అడుగుల లోతులో ఉంది. అర్జునుడు లాంటి గొప్ప విలుకాడు యుద్ధ భూమి నుండి పలాయానం చేయాలని చూశాడు. ఎందుకంటే మన వారిని/ తన వారిని స్వయంగా సంహరించి సాధించేదేమిటి? అని. అప్పుడే శ్రీకష్ణుడు అర్జునుడిలోని వైరాగ్యం తొలగించి, యుద్ధ భూమిలోకి వైరాగ్యంతో ఎవరైనా ప్రవేశిస్తారా, యుద్ధం ప్రారంభానికి ముందు మీరు చేసుకున్న శపధాలు ఏమిటి? నేడు నువ్వు చేస్తున్నదేమిటి? అని ప్రశ్నిస్తాడు. ప్రతిపక్షం నుండి మీ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటో ఆలోచించు? గురుద్రోణుడి ద్వారా అభ్యసించిన విద్యకు ఇదేనా సార్ధకత. నువ్వు చేస్తున్నది సరైనదేనా పార్ధా? అంటూ ప్రశ్నించి ‘గీతోపదేశం’ ద్వారా తనలోని అన్ని శంకలను తొలగించి తిరిగి యుద్దోన్ముఖున్ని గావింప చేస్తాడు.

ప్రపంచంలో అత్యంత భయంకరమైన వ్యాధులలో ఎయిడ్స్‌ బయటపడకముందు క్యాన్సర్‌ను ప్రమాదకారిగా భావించేవారు. కానీ ఎయిడ్స్‌ బయటపడిన తర్వాత క్యాన్సర్‌ స్థానాన్ని ఎయిడ్స్‌ ఆక్రమించింది. ఈ రెండు వ్యాధులు మనిషి శరీరానికి అంటుకుంటే అంతే ఇక. రెండింటి కంటే అత్యంత ప్రమాదరకమైన వ్యాధి ఏమిటంటే మన అవకాశాలు (లక్ష్యాలు) ఎదుటివారి ద్వారా తెల్సుకొని సాధించాలనుకోవడం. (పరాన్న జీవులు) ఎలాగంటే పరాన్న జీవులు ఇతరులపై ఆధారపడి జీవిస్తాయి. వాటికీ స్వయం పోషకత్వం వుండదు. కానీ మనుషులుగా మనం కూడా అప్పుడప్పుడు పరాన్నజీవులుగా మారిపోతూ వుంటాం. నేను కొన్ని విషయాలు నా జీవితంలో చూసినవి నేను స్వయంగా చేసినవి కొన్ని చెప్తాను. మీరు కూడా ఆచరిస్తే గొప్ప స్థాయిలో ఉంటారని చెప్పగలను.

ఓ వ్యక్తి నన్ను ఈ ప్రపంచంలో అత్యంత విలువైన ‘సంపద’ ఎక్కడ వుంది? అని అడిగాడు. దానికి మీరైతే అరబ్‌ దేశంలోని రాజుల వద్ద, ఆఫ్రికాలోని బంగారు/ వజ్రాల గనులు వున్న దేశంలో అని చెప్తారు. లేదా అమెరికా దేశంలోని సంపన్నులు బిల్‌ గేట్స్‌, ఎలన్‌ మస్క్‌, వారెన్‌ బఫెట్‌ మొదలైన వారి పేర్లు చెప్పుతారు. కాని ఆశ్చర్యకరంగా నేను చెప్పిన సమాధానం ఏమిటంటే స్మశానంలో మూడు అడుగుల లోతులో అని చెప్పాను. మనిషి ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు కొన్నికోట్ల మంది తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోకుండానే అక్కడికి (స్మశానానికి) వెళ్ళిపోయారు. కాబట్టి ఆ స్థలం చాలా విలువైనదేగా అని అన్నాను. ఆ మాటలు విన్న అతడు ఆశ్చర్యపోయాడు. కాదంటారా? మీరు నాతో ఒకవేళ ఏకీభవించకపోయినా నష్టం లేదు కాని నేటికి చాలామంది ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోకుండానే, పెట్టుకున్నా పూర్తి చేయకుండానే మరణిస్తున్నారు. మరి వారికి మళ్ళీ ఒక అవకాశం ఇస్తే వెంటనే సరేనంటారు. ఇప్పుడు నాతో ఏకీభవిస్తారా? వారు ఈ ప్రపంచంలోకి ఎన్నో ఆశలతో ఆశయాలతో వచ్చారు కానీ ఇతరులు ఏం అనుకుంటారో అని, సమాజం ఏం అనుకుంటుందో అని, ఏమి చేయకుండానే వచ్చామా (పుట్టామ – చచ్చామ) పోయామా అన్నట్లుగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు.

కానీ మీరు మాత్రం అలా ఆలోచించకండి. ఎలాగంటే ఇతరులు ఏమనుకుంటారో అని, ఏమి చేయకుండానే మీ విలువైన సమయాన్ని దుర్వినియోగం చేయకండి. ఇక్కడ కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను, ఇవి మీ జీవితంలో ప్రగతిశీల మార్పులు తెస్తాయి. రత్నాకరుడు వాల్మీకిగా మారి రామాయణం రాశాడు. ఆయనకు కూడా ఆలోచనలు/ ఆశయాలు వున్నాయి. వాల్మీకిగా ఐన తర్వాత వాటిని పూర్తి చేసుకున్నాడు. సిద్ధార్ధుడు కూడా బుద్ధుడిగా మారిన తరువాతే చరిత్రలో నిలిచాడు. అర్జునుడి సందేహాలు శ్రీకష్ణుడి గీతోపదేశం తరువాత ఆయన ఆలోచన ధార మారిపోయింది. వీటికి విరుద్ధంగా చాలామంది ఆలోచనల దగ్గరే ఆగిపోతారు. వారి మనస్సులో బహుశా ‘లోకులు’ ఏమనుకుంటారో అని, ఏమీ చేయకుండానే స్తబ్దుగా వుంటారు.

మీరు మాత్రం అలా ఉండకండి. మనసు ఏం చెప్పుతుందో అదే చేయండి. ఎందుకంటే ఇతరుల మీద ఆధారపడి మీ కోరికలను, అలవాట్లను, లక్ష్యాలను చంపుకుంటే మీరే నష్టపోతారు. ఎలాగంటే ఒక పిల్లవాడు తండ్రితో నాన్న నాకు ‘పెయింటర్‌’ కావాలని వుంది అంటాడు. దానికి తండ్రి ఏం నాయనా పెయింటర్‌ లాంటి చిన్న చిన్న పనులు మానుకొని పెద్దపెద్ద ఉద్యోగాలు చేయాలని ఆలోచన చెరు, డాక్టర్‌గా కావాలనుకో, కలెక్టర్‌, పోలీస్‌ ఆఫీసర్‌, ఇంజనీర్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌గా మారు ఆ చిన్న’పెయింటర్‌’ పని ఏం చేస్తావ్‌ అని అతడిని పక్కదారి పట్టిస్తాడు.

కాని పిల్లవాడికి మాత్రం పెయింటర్‌ కావాలని వుంటే తండ్రి చెప్పినవి ఎలా పూర్తి చేయగలడు. కాని తండ్రికి తెలియని విషయం ఏమిటంటే పెయింటర్‌ ఐతే పాబ్లాపికాసో, లియోనార్డో డావిన్సి, మేకేలాంజిలో, రవి వర్మ, ఎం.ఎస్‌. హుస్సేన్‌ మొదలైన వారందరూ వారి తండ్రులను అడిగి పెయింటింగ్‌ను వత్తిగా ఎంచుకున్నా వారు కాదు. వారు గీసిన చిత్రాలు చరిత్ర ప్రసిద్ధమై కోట్ల ధరకు అమ్ముడుపోయిన విషయం మరువకూడదు. ఇప్పుడు ఆలోచించండి… తండ్రి కరెక్టా, కొడుకు కరెక్టా? ఇంకొక బాధాకరమైన విషయం ఏమిటంటే తల్లిదండ్రులకు అతిపెద్ద అపనమ్మకం వారి పిల్లలపై ఉంటుంది. కాదంటారా? బలవంతంగా తల్లిదండ్రుల లక్ష్యాలను పిల్లలపై రుద్ది మానసికంగా వారిని ఒత్తిడిలోకి నెడుతారు. ఒకవేళ పిల్లవాడు నాన్న నేను ఐఎఎస్‌ ఆఫీసర్‌ కావాలనుకుంటున్నాను అంటే, హేళనగా నువ్వు చదివే చదువుకు ఐఎఎస్‌ ఆఫీసర్‌ ఎలా అవుతావు అని ఎదురు ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నతో ఖతమ్‌… పిల్లాడి ఆలోచన ఆవిరైపోతుంది. కాని తల్లిదండ్రులకు తెలియని విషయం పిల్లవాడిలోని జీనియస్‌ లక్షణాలు గ్రహించలేకపోవటం.

ఒకవేళ పిల్లవాడు తండ్రి వద్దకు నేను హెయిర్‌ సెలూన్‌ పెట్టుకుంటాను అంటే, తండ్రి ఆవేశంగా ఇతరుల వెంట్రుకలు కత్తిరిస్తావా? దాని నుండి ఏమైనా ఉపాధి లభిస్తుందా అని తన కోరికను నీరు గారుస్తాడు. కానీ ‘జావెద్‌ హబీబ్‌’ ఖరీదైన హెయిర్‌ స్టైయిలర్‌ అని ఆ తండ్రికి తెలియకపోవడం అమాయకత్వం. పదివేల రూపాయలు చార్జీ వసూలు చెస్తాడు. ఒకసారి హెయిర్‌ కట్‌ చేస్తే. ఇప్పుడాలోచించండి ఏది చవకైనది ఏది ఖరీదైనది. ఇంకో పిల్లవాడు తండ్రి వద్దకు వచ్చి నాన్న నేను చెఫ్‌ మాస్టర్‌ అవుతాను అంటే, తండ్రి అవి ఆడవాళ్ళు చేసే పనులు నువ్వు చేయలేవు అని నిరుత్సాహ పరుస్తాడు కాని సంజీవ్‌ కపూర్‌ లాంటి వ్యక్తి దేశంలో ప్రసిద్ధమైన చెఫ్‌ మాస్టర్‌ అన్న విషయం తెలుసుకోలేకపోవడం అతడి అమాయకత్వం. డ్యాన్సర్‌ ఐతే బీర్జు మహారాజ్‌, వెంపటి చిన సత్యం, శోభ నాయుడు లాంటి క్లాసికల్‌ డ్యాన్సర్‌ కేవలం తన నాట్యం ద్వార దేశ విదేశాల్లో పేరు పొందారు. ఇవన్నీ కూడా సాంప్రదాయబద్దమైన పనులు. ఇవి ఏ ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు చేసే పనులు కావు కాని వారి కన్నా ఎక్కువ పేరు ప్రతిష్టలు పైన చెప్పిన వారందరూ సంపాదించారు. వీరు వారిష్ట ప్రకారం నచ్చిన రంగాన్ని ఎంచుకున్నారు. కాని తల్లిదండ్రులు చెప్పిన మాటలు కాదు. సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ తన తండ్రి బాటలో నడవాలనుకున్నాడు. కాని సక్సెస్‌ కాలేకపోయాడు. సునీల్‌ గవాస్కర్‌ కొడుకు రోహన్‌ గవాస్కర్‌ కూడా గవాస్కర్‌, ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్‌…

ఇలా చాలామంది జాబితా తయారవుతుంది. కాని వారికి తెలియని విషయం ఏమిటంటే వారు వారి తండ్రులు ఎంచుకున్న రంగం కాకుండా వేరే రంగం ఎంచుకొని వుంటే గొప్పవారుగా ఎదిగే వారేమో? కాదంటారా! సోనీ టీవి కామెడి షోలో వచ్చే హాస్యనటుడు కపిల్‌ శర్మ అమతసర్‌లో పేద కుటుంబంలో పుట్టాడు. అతడి వద్ద ఏ ప్రసిద్ధమైన డిగ్రీలు లేవు. కాని అతడి హాస్యపు చతురత దేశంలో కోట్లాది మంది అభిమానం చూరగొంది. అతడి వెనుకాల కోట్ల ఆస్తి పోగై ఉందన్న విషయం తెలియక పోవచ్చు చాలామందికి.
అంతెందుకు గాంధీ, తను చదువుకున్న లాయర్‌ చదువులోనే ప్రాక్టీసు చేసుకుని ఉంటే ఈరోజు అతడిని జాతిపిత, మహాత్మ, లాంటి పేర్లతో పిలిచేవారం కాదేమో. కలకత్తలోని మురికికాల్వల మధ్యన నివసిస్తున్న పేద పిల్లలు, అనాథల్ని చేరదీసిన మదర్‌ థెరిస్సా సేవకు ప్రపంచం విస్తుపోయింది. ఫలితంగా నోబెల్‌ (1979) భారత్‌ రత్న (1980) అవార్డులు వరించాయి.

ఒక అమ్మాయి నాన్న నేను ఆటలు ఆడుతాను. అంటే తండ్రి ఆటలొద్దు ఏమీ వద్దు, బాగా చదువుకో మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తా అంటాడు. కాని అలా కాకుండా అమ్మాయి కోరిక ప్రకారం ఆ కుటుంబం స్వేచ్ఛ ఇస్తే స్మతి మందాన, జెమీమా రోడ్రిగ్స్‌, పివి సింధు, నిఖత్‌ జరీన్‌, మేరికోమ్‌, మనుబాకర్‌, సానియామిర్జా లాంటి మేటి క్రీడాకారుల్ని చూసేవారమా? వారు కూడా లోకం ఏమి అనుకుంటుందో అని అనుకుంటే వీరందరూ చరిత్ర సష్టించేవారా చెప్పండి? వారి ఇష్ట ప్రకారం వారికి నచ్చిన రంగంలో ఎదిగారు ఫలితం నేడు చూస్తున్నాం.

ఇక్కడ చిన్న సంఘటన వివరిస్తాను శ్రద్ధగా చదవండి… ఒక వ్యక్తి పండ్ల మార్కెట్లో ‘ఇక్కడ తాజా పండ్లు అమ్మబడును’ అని బోర్డు పెట్టుకొని పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. భార్యాభర్తలు పండ్ల మార్కెట్లో బోర్డు పెట్టుకున్న (ఇక్కడ తాజా పండ్లు అమ్మబడును) వ్యక్తి వద్దకు వచ్చి మిత్రమా ఇది పండ్ల మార్కెట్‌ కదా మరి బోర్డులో ‘ఇక్కడ’ అని రాసావ్‌ అని ప్రశ్నిస్తారు. దానికి నిజమే అనుకోని ‘ఇక్కడ’ అనే పదం చెరిపేస్తాడు. తెల్లారి మరొక వ్యక్తి వచ్చి అందరూ ‘తాజా’ పండ్లే అమ్ముతారు. కుళ్ళి పోయిన పండ్లు ఎవరూ అమ్మరు, అమ్మినా ఎవరు తీసుకోరు. కాబట్టి బోర్డులో వున్న ‘తాజా’ పదం తీసివేయమని సలాహా ఇస్తాడు. దానికి అంగీకరించి ‘తాజా’ అన్న పదం బోర్డు నుండి తొలగిస్తాడు. రెండు రోజుల తర్వాత మరొక వ్యక్తి వచ్చి ‘పండ్లు అమ్మబడును’ అని వున్న బోర్డు చూసి పెద్దగా నవ్వుతాడు. ఏమయ్య పండ్లు మార్కెట్లో పండ్లు అమ్మకపోతే పూలు అమ్మతావా? ఎవరయ్య నీకు సలాహ ఇచ్చింది. ఇది పండ్ల మార్కెట్‌ ఐనప్పుడు ‘పండ్లు అమ్మబడును’ అని బోర్డు ఎలా పెడ్తావ్‌ అని, ‘పండ్లు’ అన్న పదం తొలిగించమని ఉచిత సలహా ఇస్తాడు. వ్యాపారి ఆలోచనలో పడి నిజమే కదా పండ్ల మార్కెట్లోనే కదా నేను ‘పండ్లు’ అమ్మేది అనుకోని ‘పండ్లు’ అని వున్న పదం తొలగిస్తాడు.

వారం రోజుల తర్వాత మరొక వ్యక్తి వచ్చి పండ్లు ఖరీదు చేస్తూ బోర్డు వైపు చూసి నువ్వు పండ్లు అమ్మడానికే పెట్టావు కదా మరి ‘అమ్మబడును’ అని ఎందుకు రాశావ్‌? అని అడుగుతాడు. ఆ మాటలు విన్న తరువాత పండ్ల వ్యాపారి ఎందుకు గందరగోళం అని బోర్డు మొత్తం చెరిపివేస్తాడు. ఇప్పుడు బోర్డు ఖాళీగా/తెల్లగా ఉంది. కొద్ది రోజుల తర్వాత మరొక వ్యక్తి వచ్చి ఏమయ్య ఇంతమంచి ‘బోర్డు’ పెట్టుకున్నావ్‌. ఏదైనా రాయించవచ్చు కదా? అని అడుగుతాడు ఇప్పుడు చెప్పండి అతిపెద్ద బలహీనత మనకు ఏమిటో? అందుకే ఇతరుల మాటలు వినేముందు, ఆచరించే ముందు ఓసారి ఆలోచిచండి, మీ ఆలోచనలు మీకే స్వంతం, ఎలాగంటే వేరే వారికి కూడా ఆలోచనలు ఉంటారు. కాబట్టి ఇతరుల గురించి ఆలోచించకండి మీ గురించి ఆలోచించండి.

– డా||మహ్మద్‌ హసన్‌,
9908059234

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -