ఒకప్పుడు వైద్యుడిని దేవుడిగా భావించేవారు. ‘వైద్యో నారాయణో హరి’ అని ప్రాణం ఇచ్చే డాక్టరుకు పాదాభివందనం చేసేవారు. కానీ నేడు ఆ దృశ్యం మారిపోయింది. ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవాల్సిన వైద్యం, లాభాల కోసం వ్యాపారంగా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పట్టణ పల్లెల దాకా నగరాలలో పట్టణాలలో మండలాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫైనాన్స్ నిర్వాహకులు కూడా పెట్టుబడిదారులుగా మారి మల్టీ స్పెషాలిటీ బోర్డులు, కార్పొరేట్ ఆసుపత్రుల బోర్డులు తగిలిస్తున్నారు.
ప్రతిరోజూ పేదవారి ప్రాణాలు, కుటుంబ ఆస్తులు, డబ్బు బిల్లుల చేతుల్లో నష్టపోతున్నాయి. కొంతమంది వైద్యులు నిజాయితీతో పేదవారికి సేవ చేస్తున్నప్పటికీ, కొద్దిమంది నిర్వాహకులు, పెట్టుబడిదారుల దోపిడీ మొత్తం వ్యవస్థకు మచ్చ వేస్తోంది.
నమ్మకం చితికిన వేళ
మానవ సమాజంలో అత్యున్నతమైన స్థానం వైద్యుడిది. ”మనిషి ప్రాణం నిలబెట్టేవాడు మనిషిలో ఉన్న మహనీయుడు” అని నమ్మి, ఆపదలో ఉన్నప్పుడు తమ సర్వస్వాన్ని వైద్యుడి చేతిలో పెడతారు రోగులు.
కానీ నేడు ఆ దశ్యం విషాదకరంగా మారింది. ‘కంచే చేను మేసినట్లు’ రక్షించాల్సిన చేతులే భక్షించే స్థాయికి దిగజారుతున్నాయి.
సేవగా భావించిన వైద్యం, లాభాల వేటలో క్రూరమైన వ్యాపారంగా మారింది. ‘డబ్బు ఉంటే డూడూ బసవన్న’ అన్న చందంగా, నైతికత లేని పెట్టుబడిదారులు మల్టీ స్పెషాలిటీ బోర్డులు తగిలించి సామాన్యుడి రక్తాన్ని పిండుతున్నారు.
ప్రతిరోజూ పేదవారి ప్రాణాలు, ఆస్తులు కార్పొరేట్ బిల్లుల మధ్య నలిగిపోతున్నాయి. కొంతమంది వైద్యులు నిజాయితీగా పని చేస్తున్నప్పటికీ, వ్యవస్థలో పేరుకుపోయిన ఈ వ్యాపార మాఫియా మొత్తం వత్తికే మచ్చ తెస్తోంది.
రెట్టింపు బిల్లులు… ఇన్సూరెన్స్ దోపిడీ పర్వం
ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీ ఇప్పుడు పరాకాష్టకు చేరింది.
‘అప్పిచ్చేవాడు లక్ష్మీపుత్రుడు’ అనుకుంటే, ఆ అప్పు తీర్చే వరకు రోగిని రోడ్డున పడేస్తున్నారు.
ప్రధానంగా ఇన్సూరెన్స్ ఉన్న రోగులపై ఈ దాడి వర్ణనాతీతం.
నగదు చెల్లిస్తే ఒక రేటు, ఇన్సూరెన్స్ కార్డు ఉంటే బిల్లులు రెండు మూడు రెట్లు పెంచి క్లెయిమ్ చేస్తున్నారు.
చిన్నపాటి మందులతో తగ్గే వ్యాధికి కూడా ఎమర్జెన్సీ అని భయపెట్టి ఆపరేషన్ థియేటర్‌కు తరలిస్తున్నారు.
ప్రభుత్వ ఆరోగ్య పథకాలు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల పాలిట కామధేనువులుగా మారాయి.

వైద్యం పేరుతో దోపిడీ స్క్రిప్షన్
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం సేవగా కాకుండా వ్యాపారంగా మారింది. వైద్యులు రాసే స్క్రిప్షన్‌లు బయట మెడికల్ షాపులకు అర్థం కాని విధంగా ఉండటంతో, రోగులు తప్పనిసరిగా ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన ఫార్మసీల్లోనే మందులు కొనాల్సి వస్తోంది. అక్కడ మందులపై కనీస డిస్కౌంట్ కూడా ఇవ్వడం లేదు.
అవసరం లేని టెస్టులు, స్కానింగ్లు, ఎక్స్‌రేలు విపరీతంగా రాస్తూ రోగులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. చికిత్స కంటే లాభాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దోపిడీతో పేదవాడి జేబు ఖాళీ అవుతోంది.
ప్రభుత్వ కొలువు… ప్రైవేట్ వేట
‘నోరు చెబితే నొసలు వెక్కిరించినట్లు’, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ భారీ వేతనాలు తీసుకునే కొందరు వైద్యులు నైతికతను వదిలేస్తున్నారు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో హాజరై, మధ్యాహ్నం తమ ప్రైవేట్ క్లినిక్‌లకు రోగులను తరలిస్తున్నారని వివిధ ప్రాంతాలలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ అనుమతి లేని చిన్న ఆసుపత్రుల వారు, పెద్ద ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుని, ప్రైవేట్ ఆపరేషన్లు చేయిస్తున్నారు.
ఇది ‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు’ అన్న సామెతను గుర్తు చేస్తోంది.
కమీషన్ల మాయాజాలం ఆర్‌ఎంపీలే ఏజెంట్లు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నమ్మకమైన కొంత మంది ఆర్‌ఎంపీలు, పిఅర్వోలు, ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రుల వేగులుగా మారారు.
ఒక్కో డెలివరీ లేదా సర్జరీ కేసును ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చితే, ఆ ఆర్‌ఎంపీకి తగినంత కమీషన్ అందుతోంది.
సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉన్నా, కమీషన్ల కోసం అమాయక గర్భిణీలను కోతలకు గురి చేస్తారు. దీని వల్ల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి రెండూ చిన్నాభిన్నం అవుతున్నాయి.
.నిర్లక్ష్యపు కత్తి… సామాన్యుడి బలి
లాభాలే ధ్యేయంగా నడిచే ఆసుపత్రుల్లో రోగి భద్రత గాలిలో దీపంలా మారుతోంది.
అర్హత లేని సిబ్బంది: నర్సులు, టెక్నీషియన్ల స్థానంలో తక్కువ జీతానికి అనుభవం లేని వారిని నియమించి వైద్యం చేస్తున్నారు.
బాధ్యతారాహిత్యం: ఆపరేషన్ విఫలమైనా లేదా రోగి మరణించినా ‘మాకు తెలియదు, పరిస్థితి ముందే విషమం’ అని చేతులు ఎత్తేస్తున్నారు.
మాఫియా అండ: రాజకీయ బలంతో కేసులు అణచివేయడం, అగ్నిమాపక నిబంధనలు లేని భవనాల్లో ప్రాణాలతో చెలగాటం ఆడడం నిత్యకత్యం.
అధికారుల మౌనం… మాఫియాకు బలం
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు (ణవీనఉ) పర్యవేక్షణ కేవలం కాగితాలకే పరిమితం. బాధితులు మొరపెట్టినా స్పందించరు. రాజకీయ ఒత్తిళ్లు, మామూళ్ల ప్రభావంతో తనిఖీలు నామమాత్రం.
సామాన్యుడు ఆసుపత్రి గడప తొక్కాలంటే అప్పు చేయాలి, అప్పు తీర్చలేక ప్రాణం వదలాలి అన్న పరిస్థితి దాపురించింది.
ప్రభుత్వ వైఫల్యం: పేదవారికి సేవా లోపం
ప్రైవేట్ ఆసుపత్రులు రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఆసుపత్రుల బలహీనత.
సౌకర్యాల కొరత: జిల్లా ఆసుపత్రుల్లో యంత్రాలు ఉన్నా, పనిచేసే సిబ్బంది ఉండరు.
పర్యవేక్షణ లోపం: ప్రభుత్వ వైద్యులు మధ్యాహ్నం తర్వాత అందుబాటులో లేకపోవడం, పేదవారిని ప్రైవేట్ ఆసుపత్రులకు మళ్ళించుకోవడం.
వైద్యం వ్యాపారం కాదు: పరిష్కార మార్గాలు
ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాలి: పేదవారి కోసం కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో అందించాలి.
కఠిన పర్యవేక్షణ: ప్రైవేట్ ఆసుపత్రుల రేట్లు, ల్యాబ్ ధరలు ప్రభుత్వ పరిమితి (షaజూ)లో ఉండాలి.
ఆడిటింగ్: ఇన్సూరన్స్ క్లెయిమ్‌లపై థర్డ్ పార్టీ ఆడిటింగ్ నిర్వహించి, అనవసర సర్జరీలను అరికట్టాలి.
లైసెన్సుల రద్దు: నిబంధనలు ఉల్లంఘించే, కమీషన్ల దందా చేసే ఆసుపత్రుల లైసెన్సులు తక్షణమే రద్దు చేయాలి.
వైద్యుల జవాబుదారీతనం: ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా బయోమెట్రిక్, ఆకస్మిక తనిఖీలు చేయాలి. పేషెంట్ భద్రతకు స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలి.
ముగింపు
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు పెద్దలు. ఆ భాగ్యాన్ని కాపాడాల్సిన వైద్య వ్యవస్థ దోపిడీ కేంద్రంగా మారడం సమాజానికి గొడ్డలి పెట్టు.
కొంతమంది స్వార్థపరుల వల్ల మొత్తం వైద్య వత్తికే మచ్చ రాకూడదు. సేవ చేసే వారికి రక్షణ, దోపిడీ చేసే వారికి శిక్ష ఉండాలి.
ప్రభుత్వ ఆసుపత్రులు బలపడితే, ప్రైవేట్ మాఫియా అంతమవుతుంది. అప్పుడు మాత్రమే పేదవారి ప్రాణానికి విలువ, జీవన హక్కు, వైద్య సేవ అందుతుంది.
– గడగోజు రవీంద్ర చారి, 9848772232



