Sunday, February 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివీరుల స్మృతి జాతర!

వీరుల స్మృతి జాతర!

- Advertisement -

ధిక్కార పతాకలైన వారి పేర జరిపే ఈ జాతరను బ్రాహ్మణీకరించాలని ప్రయత్నాలు జరిగాయి. జంతుబలులు, హలాలు విషయాలను చర్చకు తెచ్చారు. ఆదివాసులే పూజా కార్యక్రమాలు నిర్వహించేచోట బ్రాహ్మణ పూజారులను, పూజా పద్ధతులను తెచ్చే ప్రయత్నమూ చేశారు. సమ్మక్క, సారక్కలకు గద్దెలు తప్ప, గుడి గోపురాలేవీ లేవు. కట్టడాలు లేవు. పసుపు కుంకుమలు, ప్రసాదంగా బెల్లం తప్ప మరేదీ ఉండదు. ఇట్లాంటి ఒక గిరిజన తెగల సంప్రదాయాన్ని హైందవీకరించే ప్రయత్నం, ఆధిపత్య శక్తుల చొరబాటులను అడ్డుకోవాలి. దేశంలో భిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయనే విషయాన్ని నిరాకరించే మనువాదుల కుట్రలను తిప్పికొట్టాలి.

తెలంగాణలో జాతర అనగానే మేడారం మదిలోకొస్తుంది. సమ్మక్క సారక్కలు జ్ఞప్తిలోకి వస్తారు. శతాబ్దాలుగా జరుగుతున్న జనజాతర అది. అమరులైన ఆదివాసీ యోధుల స్మృతిలో ప్రణమిల్లే ప్రజా సమూహపు కలయిక. లక్షలాది ప్రజలు, మరీ ముఖ్యంగా ఆదివాసీలు ఎంతో ప్రేమతో, విశ్వాసంతో, భక్తితో మేడారం సమ్మక్క సారమ్మల గద్దెల వద్దకు చేరి, అమరవీరులకు వందనాలు చేయటం ఒక అపురూప ఘట్టం. ఆ మొక్కులను, భక్తిని, నమస్కారాలను పొందుతున్న సారక్కలు, సమ్మక్కలు, పగిడిద్దరాజు, జంపన్న, నాగులమ్మలు, బ్రహ్మ, విష్ణు అవతారాలేమీకాదు, పురాణగాథల పాత్రలూ కాదు, వాళ్లు చారిత్రక వ్యక్తులు. ఆదివాసీ నాయకులు.

తమ ప్రాంతంపైన, అటవీ సంపదపైన, ఆదివాసీ సమూహంపైన, తమ అధికారంపైన తమకే హక్కు ఉందని, మా రాజ్యాన్ని మేమే పాలించుకుంటామని ప్రకటించి, ప్రతిఘటించి, నాటి కాకతీయ రాజులు ప్రతాపరుద్రుడిపై యుద్ధం చేసి వీరమరణం పొందిన మన్యం వీరులు. అంతేకాదు, మాతృస్వామిక వ్యవస్థకు ప్రతిరూపాలుగా నిలిచిన సారక్క, సమ్మక్కలు వీరవనితలుగా వారి పేరుమీదనే ఈ మహాజాతర జరగడం మనం చూస్తున్నాము. కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. సామంతుడుగా ఉన్న పగిడిద్దరాజు కరువుల కారణంగా కప్పం కట్టలేకపోయాడు. కప్పం ఎగ్గొట్టడంపై కళ్లెర్ర జేసిన ప్రతాపరుద్రుడు దాడికి పూనుకోగా, ప్రాణాలకు తెగించి పోరాడిన ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీకలైన పగిడిద్దరాజు, సమ్మక్క, సారమ్మ, జంపన్న, నాగులమ్మల జ్ఞాపకార్థం ప్రజలు జరుపుకునే జాతర ఇది.

ప్రపంచవ్యాపితంగా నేడు మనం చూస్తున్నాం. అమెరికా సామ్రాజ్యవాదం, మనపైనా, ఇతర దేశాలపైన దాడులు చేయటం లాంటి దుర్మార్గ చర్యలను. అయినా మన నాయకులు గానీ, ప్రపంచంలోని అనేక దేశాలు కానీ ఒక్కమాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నవి. ఇది దుర్మార్గమని, నియంతృత్వమని కనీసం అనలేకపోతున్నవి. వీళ్లతో పోల్చితే సమ్మక్కసారక్కలు, పగిడిద్దరాజులు ఎంత ఆత్మాభిమానం కలవారో అర్థమవుతుంది. ఎంత వీరత్వం కలవారో కూడా అర్థమవుతుంది. జీఎస్టీ ద్వారా వచ్చిన సొమ్ము, రాష్ట్రాల వాటాను కూడా కేంద్రం ఇవ్వకపోతే నిలదీసి, అడిగే ధైర్యం రాష్ట్రాలు చేయలేకపోవటాన్ని కూడా గమనించ వచ్చు. సమ్మక్క సారక్కలను జాతరలో తలచుకోవడమంటే, వారు అందించిన స్ఫూర్తిని కొనసాగించడం కూడా అని నేటి నాయకులు తెలుసుకోవాలి. తెలంగాణ నేల ఇచ్చిన చైతన్యపూరిత పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం మొదలైనవారు అలాంటి చైతన్యాన్ని కొనసాగించి వీరవనితలుగా పేరొందారు. ఇదీ వారసత్వపు కొనసాగింపు.

ఇక జాతర విషయానికొస్తే, 1946లో నైజాం పాలనలో సుబేదార్‌గా ఉన్న అమీర్‌ అలీఖాన్‌ పర్య వేక్షణలో మేడారం జాతర ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారని చరిత్ర చెబుతున్నది. ధిక్కార పతాకలైన వారి పేర జరిపే ఈ జాతరను బ్రాహ్మణీకరించాలని ప్రయత్నాలు జరిగాయి. జంతుబలులు, హలాలు విషయాలను చర్చకు తెచ్చారు. ఆదివాసులే పూజా కార్యక్రమాలు నిర్వహించేచోట బ్రాహ్మణ పూజారులను, పూజా పద్ధతులను తెచ్చే ప్రయత్నమూ చేశారు. సమ్మక్క, సారక్కలకు గద్దెలు తప్ప, గుడి గోపురాలేవీ లేవు. కట్టడాలు లేవు. పసుపు కుంకుమలు, ప్రసాదంగా బెల్లం తప్ప మరేదీ ఉండదు. ఇట్లాంటి ఒక గిరిజన తెగల సంప్రదాయాన్ని హైందవీకరించే ప్రయత్నం, ఆధిపత్య శక్తుల చొరబాటులను అడ్డుకోవాలి. దేశంలో భిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయనే విషయాన్ని నిరాకరించే మనువాదుల కుట్రలను తిప్పికొట్టాలి.

ఒకవైపు మనదేశంలోని ఆదివాసీల హక్కులను, అడవిపై వారికున్న అధికారాన్ని కాలరాసే చట్టాలను, విధానాలను తీసుకువస్తున్న కేంద్ర పాలకులు, మరోవైపు వారి మతతత్వానికి పావులుగా ఆదివాసీలను వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కగార్‌ పేరిట ఆదివాసీలను అడవినుండి తరిమేసి కార్పొరేట్‌ శక్కులకు అటవీ సంపదను దోచి పెట్టేందుకు పూనుకుంటున్నారు. ఈ విషయాలనూ ఈ సందర్భంగా గుర్తుచేసుకుని అప్రమత్తమవ్వాలి. దేశంలో సాంస్కృతిక ఆధిపత్యం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న మనువాద పరివారం అనేక దుష్ప్రచారాలను, చరిత్రను చెరిపేయాలనీ కుట్రలు చేస్తున్నది. ఈ దాడులను ఎదుర్కోవాలంటే స్థానిక సాంస్కృతిక వారసత్వాలను కాపాడుకుంటూ, సామాన్యప్రజల పోరాట చైతన్యాన్ని పునికి పుచ్చుకుని ముందుకు పోవడం మన కర్తవ్యం. ఈ జాతరకు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్నదంటే, జనం బాధలు, వేదనలు, ఆశలు, ఆకాంక్షలు పెరిగాయని అర్థం. అందుకు ప్రజలను ఏకం చేసి పోరాడడమే ఏకైకమార్గం. అదే సమ్మక్క, సారక్కల స్ఫూర్తి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -