అర్ధ సెంచరీ చేరువకు పగటిపూట ఉష్ణోగ్రతలు
ఎండ వేడి, వడగాలుల
దాడితో నిప్పుల కొలిమిలా రాష్ట్రం
వడదెబ్బతో పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఆగని మూగజీవాల మృత్యువాత
కార్మికులు, కూలీల అవస్థలు.. పనుల్లేక ఇబ్బందులు
పొట్ట కూటికోసం
మండుటెండలో శ్రామిక వర్గం
గిరాకీలేక దుకాణాలు వెలవెల .. ఎండతో జ్యూస్ సెంటర్లకు
రాని వైనం
అగ్నిప్రమాదాలతో
రూ. కోట్లల్లో నష్టం
ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు, రైతుల వేడుకోలు
నవతెలంగాణ-ఆత్మకూరు/తొర్రూరు టౌన్/
మహదేవపూర్/చిట్యాల/బయ్యారం/చిన్నగూడూరు
రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలు సాధారణ ప్రజలను ఇబ్బంది పెడుతుండగా, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపుతూ 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో బెంబేలెత్తిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నమయేసరికి నిప్పుల కొలిమి తలపిస్తున్నది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సగం జిల్లాల్లో 46 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో50 డిగ్రీస్ ఉష్ణోగ్రత (హాఫ్ సెంచరీ) నమోదయ్య అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండదెబ్బతో వడదెబ్బకు గురై అనేకమంది చనిపోవడం.. అగ్నిప్రమాదాలు చోటు చేసుకుని పంటలు కాలిపోతున్నాయి. మరోవైపు అకాల వర్షాలు, ఈదురు గాలులు పంటలు తడిసిపోవడం,.. ఇలా రాష్ట్రంలో అటు ఎండలు, అకాల వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కూలి పనులకూ వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యాపారాలు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. కార్మికులు పనులకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇప్పుడే ఎండలకు జనాలు అల్లాడుతుంటే రోళ్లు పగిలే రోహిణికార్తె వస్తుండటంతో ఇంకా ఎండలు ఏ స్థాయిలో ఉంటాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మధ్యాహ్నం సమయాల్లో జ్యూస్ సెంటర్లకు చల్లటి పానీయాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. మద్యం షాపులు మందుబాబులతో కిక్కిరిసిపోతున్నాయి.
నిర్లక్ష్యం.. నిప్పు.. రైతుకు కన్నీరు!
పంట వ్యర్థాలను తగులబెట్టే క్రమంలో కొందరు రైతులు ప్రదర్శిస్తున్ననిర్లక్ష్యం ఇతరుల పాలిట శాపమవుతోంది. పొలం పక్కన మంట పెట్టడంతో ఆ మంటలు వ్యాపించి జామాయిల్, మామిడి తోటలు కాలి బూడిదయ్యాయి. వడగాల్పుల ఉధృతికి ముగ్గురు మృతిచెందారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామాఁకి చెందిన రైతు బూర రమేష్ కు పత్తిపాక శివారులో 3ఎకరాల జామాయిల్ తోట ఉంది. పక్క చేను రైతు మక్క వ్యర్థాలకు నిప్పు పెట్టగా, గాలి తీవ్రతకు మంటలు జామాయిల్ తోటకు వ్యాపించాయి. చేతికొచ్చే సమయంలో 8 లక్షల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటీడు గ్రామానికి చెందిన రైతు నగరబోయిన వెంకన్నకు చెందిన 28 ఎకరాల మామిడి తోట అగ్నికి ఆహుతైంది.
పక్క రైతు పెట్టిన మంట వల్ల డ్రిప్ పైపులతో సహా తోట మొత్తం కాలిపోయింది. సుమారు కోటి రూపాయల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ఎండల తీవ్రత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాణాలు తీస్తోంది. తొర్రూరు మండలంలో అత్తిలి రాము (60), సోమనారాయణ (65) వడదెబ్బకు గురై మృతి చెందారు. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లిలో కట్టెల కోసం వెళ్లిన ఎర్రబోయిన జయలక్ష్మి (70) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచింది. బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మాచర్ల శ్రీను(51) ఓ ఇంట్లో మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యంతో తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి విసంపల్లిలో చిన్నగూడూరు మండలంలో అల్లి రాజశేఖర్ అనే రైతుకు చెందిన పాడి గేదె మృతి చెందింది.
వడదెబ్బ మృతులు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలంలో ఇద్దరు వడ దెబ్బతో మృతి చెందారు. మండలంలోని పారిగాం గ్రామానికి చెందిన కౌలు రైతు ఎలుకరి అశోక్ (41)కు సొంత భూమి లేకపోవడంతో ఇతరుల భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. శనివారం ఉదయం తన భార్య సోనితో కలిసి చేనులో పనులు చేశాడు. అనంతరం సాయంత్రం మళ్లీ పొలానికి వెళ్లి పనులు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిసేపటికే కుప్పకూలి పడిపోయాడు. మండలంలోని జక్కాపూర్ గ్రామాఁకి చెందిన పిప్రే సాయినాథ్ (45) వడదెబ్బతో మృతి చెందాడు. సాయినాథ్ కూలి పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో శనివారం తీవ్ర ఎండ ప్రభావానికి గురై స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలంలోనూ యువకుడు మృతిచెందాడు. మామిడిగట్టు ఆదిల్పేట్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లూరు గ్రామంలో వడదెబ్బకు కొరివి అచ్చయ్య (80) ఆదివారం మృతి చెందారు. ఇటీవల పెరుగుతున్న ఎండలు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్ కు చెందిన రైతు చల్లా రంగయ్య(60) వడదెబ్బతో మృతి చెందారు.
గిరాకీ లేక వెలవెలబోతున్న దుకాణాలు
భానుడి భగభగలకు కేవలం మనుషులే కాదు, వాణిజ్య రంగం కూడా విలవిలలాడుతోంది. ఎండల తీవ్రత పదేండ్ల్ల గరిష్ట స్థాయికి చేరడంతో వ్యాపార సముదాయాలు గిరాకీ లేక బోసిపోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, నర్సింహులపేట, కేసముద్రం వంటి ప్రధాన కేంద్రాల్లో వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా రద్దీగా ఉండే ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారి సైతం నిర్మానుష్యంగా మారుతోంది. గిరాకీ లేక పట్టణాల్లోని సగం దుకాణాలు మధ్యాహ్నానికే షట్టర్లు దించేస్తున్నాయి. చల్లటి పానీయాల దుకాణాలు, జ్యూస్ సెంటర్ల వద్ద కూడా జనం కనిపించడం లేదని, వడగాల్పుల దాటికి గ్లాసు పట్టుకునే నాథుడే కరువయ్యారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల్లో వేడిని తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలు వాడుతుండటంతో కరెంటు బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. అటు గిరాకీ లేక ఆదాయం రాక, ఇటు అద్దెలు, కరెంటు బిల్లులు చెల్లించలేక చిన్న వ్యాపారులు దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నారు. ఇదే అదునుగా కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కొనేవారు లేక నిల్వ ఉన్న సరుకు పాడైపోతోందని చిరు వ్యాపారులు వాపోతున్నారు.
‘గత వడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు, మళ్లీ సాయంత్రం 6 తర్వాత షాపులను తీస్తున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు వడగాలులు వీస్తున్నాయి. ఎండ తీవ్రతతో వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం.’ అని నర్సింహులపేటకు చెందిన మద్ది శేఖర్ తెలిపారు. ‘ప్రతీరోజు 44 డిగ్రీలు దాటి వేడిమి ఉండటంతో తప్పని సరిగా పనులకు వస్తున్నాం. మునుపెన్నడు లేనివిధంగా ఎండల వేడిమితో కొడుతున్నాయి. ఇంటి దగ్గరే ఉండాలనిపిస్తుంది కానీ పనులకు వెళ్లకుండా పూట గడవదు. వడదెబ్బతో ఉపాధి కూలీలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎండ తీవ్రతకు పనివేళల్లో మార్పులు చేయాలి. పని స్థలాల్లో నీడ, ప్రథమ చికిత్స కిట్లు, నీరు తదితర వాటిని అందించాలి.’ అని భూక్యలక్ష్మీ తెలిపారు. ‘ఊరు ఏదైనా పని ముఖ్యం. దూరంతో పని లేకుండా కుటుంబ పోషణ కోసం అనునిత్యం ఎండకు, వానకు తడుస్తూ పని చేసే కూలీలం. ఊరు విడిచి సుతారి పని కోసం కేసముద్రం మండలంకు వచ్చాం. ఎండ తీవ్రతకు… ఒప్పుకున్న పని చేయడం చాలా కష్టంగా ఉంది. భానుడి ఉగ్రరూపానికి రోజువారి కూలీలం బలవుతున్నాం.’ అని శివార్ల లక్ష్మయ్య వాపోయారు.
వడగాలులు… అకాలవర్షాలు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుస్తున్న తొలకరి వర్షాలు జిల్లా ప్రజలను వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఒకవైపు వడగాడ్పులతో జనాలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు అకాల వర్షాలతో పంటలు నష్టపోవడంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతోంది. వడగండ్లతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఖరీఫ్ కు ముందుగానే తొలకరి వర్షాలు వస్తుండడంతో విత్తనం వేసిన తర్వాత వర్షాలు వస్తావో రావోనని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రాణ ఆస్తి నష్ట బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. గద్వాల జిల్లా గట్టు మండలంలో తోలు తిమ్మప్ప వడదెబ్బకు మృతి చెందాడు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన తిమ్మప్ప క్షేత్రస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నది. తాడూరు మండలం గోవిందాయపల్లిలో గొర్రెలకాపరి మల్లయ్య పిడుగుపాటుకు మృతి చెందాడు. నాగర్కర్నూల్ జిల్లా చిన్నంబావిలో నాగార్జున అనే గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయాడు. వీరితోపాటు సుమారు పదిమంది గాయపడ్డారు. 100 పశువులు మృతి చెందినట్లు సమాచారం. మక్కలు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి 15 రోజులు కావస్తున్నా కనీసం ఒక్క లోడు మక్కలైనా తూకం వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
మండుటెండలో శ్రామిక వర్గం
చేతిలో పనిముట్లు, తలపై గుడ్డలు, భుజాలపై బస్తాలతో జీవన పోరాటం మొదలుపెట్టే కూలీలకు ఎండాకాలం అంటే మరింత కఠినమైన పరీక్షగా మారుతోంది. ఉదయం ఎనిమిది గంటల వరకూ పరి దొరుకుతుందా లేదా అని అయోమయంలో సాధారణంగా కరిపించే పనిస్థలాలు, అదే కార్మికుడు పని దొరికిన తర్వాత హమ్మయ్య ఈరోజు పొట్ట నిండింది అనుకునే సమయానికి మధ్యాహ్నానికి పని స్థలాలు సూర్యుడి భగభగలతో అగ్నిగుండాలుగా మారిపోతున్నాయి. పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో మండుటెండను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్న శ్రామిక వర్గారనికి ఒకవైపు పెరుగుతున్న నిత్యావసర ధరలతో పాటు రోజురోజుకు పెరుగుతున్న ఎండలు మూలిగే నక్కపై తాటి పండు పడినట్టు అయింది. రోజువారీ కార్మికుల పరిస్థితి.
42 నుంచి 45 డిగ్రీల భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మహిళా కూలీలు తలపై సిమెంట్ గంపలు మోస్తూ చెమటతో తడిసి ముద్దవుతుంటే, పురుష కార్మికులు వేడెక్కిన ఇనుప రాడ్లు, యంత్రాల మధ్య పని చేస్తూ అలసటతో కూలిపోతున్నారు. పలుచోట్ల కార్మికులకు కనీసం తాగునీరు, విశ్రాంతి కోసం షెడ్లు కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. కొందరు చెట్టు నీడ దొరికితే అక్కడే కొన్ని నిమిషాలు కూర్చొని ఊపిరి పీల్చుకుంటున్నారు. “ఎండలో పని చేయకపోతే ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టలేం. ఒక్కరోజు పనికి వెళ్లకపోయినా కుటుంబం ఆకలితో ఉండాల్సిందే” అని నగరంలోని ఓ నిర్మాణ కార్మికు ఆవేదన వ్యక్తం చేశాడు. మహిళా కూలీలు కూడా “చిన్నపిల్లలను ఇంట్లో వదిలి వచ్చి ఈ ఎండల్లో పనిచేయడం చాలా కష్టం. కానీ జీవితం కోసం తప్పడం లేదు” అంటూ తమ బాధను వెల్లగక్కుతున్నారు.
ఎండతో జాగ్రత్త …
ఎండతో వడదెబ్బ, డీహైడ్రేషన్, తల తిరుగుడు, బీపీ సమస్యలు కార్మికుల్లో పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట పనులు చేయడం ప్రమాదకరమని చెబుతున్నారు. ప్రభుత్వం వేసవి తీవ్రత దష్ట్యా మధ్యాహ్న వేళల్లో పనివేళలు తగ్గించాలని, కార్మికులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, విశ్రాంతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటి అమలు చాలా చోట్ల కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ నిర్మాణ రంగంలో నిబంధనలు పూర్తిగా పాటించకపోవడం కార్మికుల ప్రాణాలకే ముప్పుగా మారుతోంది.



