జుట్టుపోలుగాడు : ఎహె.. నా కత్తికి రెండు అంచులుంటాయెహె… నేనెటైనా తిప్పగలను. కావాలంటే చూస్కో. రెండు చేతుల్తో కూడా తిప్పగలను. ఎడా పెడా.. చూస్కోరోరు. నేను చెప్పాను గదరా.. ఇంకా చూస్తారేంట్రా. కాస్కోండెహె. నాకు తనా… పరా.. బేధం లేదురోరు. నాకు అడ్డొస్తే… ఎవడ్నైనా ఇట్టే చంపేస్తా.. బస్తీమే సవాల్… కాదెహె… వరల్డ్ మే సవాల్….
కేతిగాడు : ఇంతకీ నీవెవడివో చెప్పకుండా ఈ కుప్పిగంతులేమిటి? నాటక సూత్రధారిగా అడుగుతున్నా.
జుట్టుపోలుగాడు : అరె, అరె… అరె… నేను హిరణ్యాక్షుణ్ణిరా… కాదెహె! వాణ్ణి మించినవాడి బాబునురా. నాకు ఎదురే లేదురా… ఈ పెపంచకమంతా నాదేనురా… నేను ట్రంపాసురుణ్ణిరా… నాకు అడ్డొస్తే శత్రువునైనా, మిత్రుడినైనా ఇరసకు తింటానురా… హా…హా..
కేతిగాడు : తమ పర బేధం లేదంటున్నారు. శత్రువు, మిత్రుడు ఒకడే అంటున్నారు. అది ఎలాగో ప్రేక్షకులకు వివరింపగలరా…
జుట్టుపోలుగాడు : నాకు బద్దశత్రువులైన రష్యా, చైనాలపైనే గాదు, నా మిత్ర దేశాలు నాటో దేశాలన్నా నాకిప్పుడు లెక్కలేదు. ఎవడ్నైనా సరే ఇరసకు తింటానురా… నంజుకు తింటానురా… హా…హా..
కేతిగాడు : అకస్మాత్తుగా ఈ రంగ ప్రవేశానికి కారణమేమిటి?
జుట్టుపోలుగాడు : హా.. హా..హా… ఈ పెంపంచకంలో శాంతిని స్థాపించాలన్నా నేనే. యుద్ధం చేయాలన్నా నేనే. నేనే పెపంచకం. పెపంచకమే నేను. నాకు నోబుల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. గందుకే బరితెగించా.. ఇదో కొత్త అవతారం. యుద్ధమూ నేనే… శాంతీ నేనే.
కేతిగాడు : అది ఎలా..? ఒకే ఒరలో రెండు కత్తులా..
జట్టుపోలుగాడు : ఎందుకు పట్టవెహె. పట్టించే తెలివితేటలు వుండాలి. పెజాస్వామ్యం అనేది పైకి కన్పించే కత్తి. నియంతృత్వం అనేది లోపల దాగే అసలు కత్తి. ఇక అసలు కత్తి దూస్తా.
కేతిగాడు : ముందు అసలు విషయం చెప్పరా స్వామి.
జుట్టుపోలుగాడు : నేనిప్పుడు శాంతి సాధన మండలి స్థాపించా. ఇక ఐక్యరాజ్యసమితి… పెపంచ ఆరోగ్య సంస్థలు జాన్తానై. నా శాంతి మండలిలో చేర్తారా… లేక నా యుద్ధాలకు సిద్దమవుతారా… తేల్చుకోవాల్సింది వారే.
కేతిగాడు : ఇప్పటికి మీ మండలిలో ఎన్ని దేశాలు చేరాయి?
జుట్టుపోలుగాడు : అరవై రెండు దేశాలకు ఇరవై చేరాయి.
కేతిగాడు : ఇంకా రెండొంతుల దేశాలు చేరలేదన్నమాట. భారతదేశం చేరిందా స్వామీ?
జుట్టుపోలుగాడు : ఏరు! నాకు పిచ్చెక్కించమాకు. ఆ దేశం అంటేనే నాకు కంపరం. అదో నంగనాచి. తుంగబుర్ర. ముంగిగా వుంటూ యాగీ యాగీ చేస్తుందెహె.
కేతిగాడు : ఏం చేసింది స్వామీ?
జుట్టుపోలుగాడు : నా జట్టునున్న యూరప్ కౌన్సిల్, కమిషన్‌తో కలిసి కుట్రలు పన్నుతుంది. స్వేచ్ఛావ్యాపారం అంటూ 16 ఒప్పందాలు చేసుకుంది. ఇలా ఎవరికి వాళ్లు అలా ఒప్పందాలు, తీర్మానాలు చేసుకుంటే ఇక నేనెందుకెహె. నా పెత్తనం ఎందుకెహె. అస్సలు భారత రిపబ్లిక్‌డే ఉత్సవాలకు నన్ను పిల్వకుండా వాళ్లని పిల్చి విందులు చేసుకుంటుంది. అదీ చూస్తా. అక్కడికీ గౌరవం పాటించి చెప్పా. ‘పెపంచకంలోనే అత్యంత పురాతన అతి పెద్ద పెజాస్వామ్య దేశాలు మనవి. అంటే భారత్, అమెరికాలు. మనది మామూలు బంధం కాదు, చారిత్రక బంధం’ అంటూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పా. అయినా వినుకోలా.. ఇక సమయం లేదు. అసలు కత్తి దూస్తా… ఆ… ఆ..
(బంగారక్క ప్రవేశం)
బంగారక్క : నోర్మురు. నీ వాచాలత్వం. ఇక కట్టిపెట్టు. నీలాంటి హిరణ్యాక్షుడ్ని. బకాసురుల్ని… ప్రజలు మట్టి కరిపించారు. ఏంటీ కత్తులు దూస్తావా..? నీవు ట్రంపాసురుడివా.. జిస్సే ఖేల్తే హై… ఉస్సే మర్తే హై.. ఏ ఆట ఆడితే ఆ ఆటే నిన్ను మట్టుపెట్టుద్ది. అపరిమిత అధికారాలతో విర్రవీగే కత్తులు దూసి ఎడాపెడా తిప్పితే ఏదో క్షణం అది నీకు తెలియకుండా నీ కుత్తుకను ఉత్తరిస్తుంది. ఇప్పుడు నీ వంతు వచ్చింది. నీకు మద్దతిచ్చేవాళ్లు లోపలా బయటా ఎవడూ లేకపోవడంతో గంగవెర్రులెత్తుతున్నావ్. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్. నీవెంత? నీ జులుమెంత?
ఈ సువిశాల ఎనిమిది వందల కోట్ల ప్రజాస్వామ్య ప్రపంచంలో నీవో మనిషివి. నీవే ప్రజాస్వామ్యం కాదు. ప్రపంచం అంతకన్నా కాదు. ‘సమయం లేదు’ కాదు, నీకు సమయం దగ్గర పడింది. అది గుర్తుంచుకో.
– కె.శాంతారావు, 9959745723



